Virat Kohli
Virat Kohli: ఆదివారం రాత్రి కోల్ కతా జట్టు తో జరిగిన మ్యాచ్ లో బెంగళూరు ఒక్క పరుగు తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోల్ కతా జట్టు పాయింట్లు మరింత మెరుగుపరుచుకుని రెండవ స్థానంలోకి వెళ్లిపోగా.. బెంగళూరు ప్లే ఆఫ్ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్ లో బెంగళూరు ఆటగాడు విరాట్ కోహ్లీ అవుట్ అయిన విధానం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సామాజిక మాధ్యమాలలో చర్చలు జోరుగా సాగుతున్నాయి. కొంతమంది మాజీ క్రికెటర్లు, క్రీడా విశ్లేషకులు అంపైర్ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. మరి కొంతమంది విమర్శిస్తున్నారు. ఇంతకీ క్రికెట్ నిబంధనలు ఏం చెబుతున్నాయి? విరాట్ కోహ్లీ ఔట్ అని థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయం సరైనదేనా? మాజీ క్రికెటర్ల వాదనలో వాస్తవం ఎంత? దీనిపై ప్రత్యేక కథనం.
ఆదివారం రాత్రి కోల్ కతా జట్టు బెంగళూరు ఎదుట 223 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. అయితే బెంగళూరు ఆటగాడు విరాట్ కోహ్లీ ఏడు బంతుల్లో 18 పరుగులు చేసి దూకుడుగా ఆడాడు. అయితే హర్షిత్ రానా వేసిన 2.1 ఓవర్ లో.. వేసిన బంతిని ఆడబోయిన కోహ్లీ అతడికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అయితే, ఆ బంతి నడుము కంటే తక్కువ ఎత్తులో వచ్చిందని.. దానిని అవుట్ అని ఎలా పరిగణిస్తారని థర్డ్ అంపైర్ పై కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. రివ్యూ కోసం థర్డ్ అంపైర్ కు ఫీల్డ్ అంపైర్ రిఫర్ చేశాడు. రివ్యూలో ఆ బంతి సరైనదేనని తేలింది. దీంతో విరాట్ కోహ్లీ ఆగ్రహంతో విలియం చేరుకున్నాడు..
ఈ నేపథ్యంలో బంతిని అంచనా వేసే సాంకేతికతపై సోషల్ మీడియాలో అభిమానులు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.. విరాట్ కోహ్లీకి అనుకూలంగా, అంపైర్ కు వ్యతిరేకంగా కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. దీంతో నిన్నటి సాయంత్రం నుంచి జోరుగా చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో పలువురు మాజీ ఆటగాళ్లు, క్రికెట్ వ్యాఖ్యాతలు తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
ఎబి డివిలియర్స్ ఏమంటున్నారంటే..
“విరాట్ ఔట్ అయిన విధానం చర్చకు దారితీస్తోంది. 360 లైవ్ కార్యక్రమంలో దీనిపై ఒక క్లారిటీ ఇద్దామని భావించాను. ఏమరపాటులో మర్చిపోయాను.. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నాను. అంపైరింగ్ విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు. అసలు సమస్య సాంకేతికత వల్లే తలెత్తింది. వైడ్, ఎటువంటి నిర్ణయాలు తీసుకునేందుకు సాంకేతికతను వాడుకోవడం మంచిదే..కానీ, ఈ మ్యాచ్లో అంపైర్ తీసుకున్న నిర్ణయం పై ఇంతవరకూ ఒక క్లారిటీ లేదు. దీనిపై చాలామందిలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. మరికొందరు అయోమయానికి గురవుతున్నారు.. విరాట్ ఉన్న స్థానాన్ని లెక్కలోకి తీసుకొని, లైన్లు, బంతి పడే విధానాన్ని అంచనా వేసి ఉంటే ఇంతటి చర్చ జరిగి ఉండేది కాదని” దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏపీ డివిలియర్స్ పేర్కొన్నాడు. మరోవైపు అంబటి రాయుడు, నవ జ్యోత్ సిద్దు అంపైర్ నిర్ణయాన్ని విమర్శించారు. దానిని వైడ్ కాకుండా, సరైన బంతి అని ఎలా నిర్ధారిస్తారని? ప్రశ్నించారు.
పఠాన్, హర్షా భోగ్లే ఏమన్నారంటే..
విరాట్ ఔట్ నిర్ణయం పట్ల ఏబీ డివిలియర్స్ తన స్పందనను అంపైర్ కు వ్యతిరేకంగా తెలియజేస్తే.. టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్, వ్యాఖ్యాత హర్షా భోగ్లే అంపైర్ నిర్ణయం సరైనదని వ్యాఖ్యానించారు. అది సరైన బంతి అని పేర్కొన్నారు. ” క్రికెట్లో సాంకేతికతను సమర్థవంతంగా వాడుకుంటున్నారు. దీనికి మా ధన్యవాదాలు. సాంకేతికతను వాడటం వల్ల పక్షపాతంతో నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శకు తావు లేకుండా పోయింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వాడటం వల్ల అంపైరింగ్ విషయంలో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కానీ అలాంటివి ఇలాంటి సమయంలో సరికావు. అంపైర్ అంత సులువుగా నిర్ణయాలు తీసుకోలేరు. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటే తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలో అంపైర్ కు తెలుసు. అందుకే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. విరాట్ కోహ్లీ అవుట్ పట్ల అంపైర్ తీసుకున్న నిర్ణయం సరైనదే. ఆ బంతి కూడా సరైనదే. కోల్ కతా, బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో స్పష్టమైన నిర్ణయమే వచ్చిందని” వారు పేర్కొన్నారు.