India Tigers: డిస్కవరీ ఛానల్ లో జింకలను పులులు వేటాడుతుంటేనే భయపడి పోతుంటాం. అవి మీద పడిపోతాయేమోనని కంగారు పడిపోతుంటాం. కానీ వాళ్లకు మాత్రం పులులు ప్రత్యక్షంగా కనిపిస్తుంటాయి. అవి వారికి ఎదురుగా కనబడుతుంటాయి. కొన్ని సందర్భాలలో వారు నివసిస్తున్న ఇళ్లల్లోకి వస్తుంటాయి. ఈ స్థాయిలో వారికి పులులు కనిపిస్తున్నప్పటికీ ఏమాత్రం భయపడరు. ఒకవేళ కనిపిస్తే దండం పెట్టుకుంటారు. ఆ తర్వాత వారి పని వారు చేసుకుంటారు.
ఈ ఉపోద్ఘాతం విన్న తర్వాత.. ఈ గ్రామం ఎక్కడ ఉంది? అని అనుకుంటున్నారు కదా.. ఇది ఎక్కడో విదేశాలలో లేదు. మనదేశంలోనే.. ఎడారి రాష్ట్రంగా పేరుపొందిన రాజస్థాన్ లో ఉంది. రాజస్థాన్ రాష్ట్రంలో ఆ గ్రామం పేరు బేరా. అది పాలి జిల్లాలో ఉంది. బేరా గ్రామంలో రబారి అనే గిరిజనులు నివసిస్తుంటారు. ఆ గ్రామంలో సుమారు 2000 వరకు కుటుంబాలు ఉంటాయి. రబారి గిరిజనలు గిరిజనులు ఇరాన్ ప్రాంతం నుంచి దాదాపు 300 సంవత్సరాల క్రితం వలస వచ్చారు. వీరికి పశువులను పెంచుకుంటూ బతకడం అలవాటు. వీరి పూర్వికులు చిరుత పులులను దైవాలుగా కొలుస్తూ ఉంటారు. చిరుత పులులను తమ దైవాలుగా వారు భావిస్తుంటారు. పైగా ఈ పులులకు శివ, కేశవ, లక్ష్మి, పార్వతి అని పేర్లు పెట్టి పిలుచుకుంటారు.
చిరుత పులులు తాము పెంచుకుంటున్న పశువుల పై దాడి చేస్తే రబారి గిరిజనులు భయపడరు. పైగా వాటికి ఆహారం ఇచ్చామని గొప్పగా భావిస్తుంటారు. ఇది తమ బాధ్యత అని చెబుతుంటారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా చిరుత పులులను వారు వేటాడరు. అవి ఉండే ప్రదేశాలకు వెళ్లరు. చిరుతపులులు ఆ గ్రామంలో ఉన్న పొలిమేర లలో ఉన్న రాతి గుహలలో సేద తీరుతూ ఉంటాయి. వాటికి ఇష్టం వచ్చిన ప్రాంతాలలో విహరిస్తూ ఉంటాయి. ఈ గ్రామానికి చెందిన వారంతా ఎర్రటి తలపాగతో కనిపిస్తారు. అందువల్ల చిరుతపులులు వారిపై దాడి చేయవు. పైగా వారిని గుర్తుపట్టి.. గ్రామానికి చెందిన వారని భావిస్తాయట. పైగా ఆ పులులు పుట్టినప్పటినుంచి ఆ గ్రామస్తుల మధ్య పెరగడంతో.. ఎట్టి పరిస్థితుల్లో కూడా దాడులు చేయవు. అందువల్లే మన దేశం, విదేశాల నుంచి యాత్రికులు వస్తుంటారు. వీరి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సఫారీలలో రూములు బుక్ చేసుకుంటారు. జీపులలో చిరుత పులులను చూస్తూ ఆ దృశ్యాలను కెమెరాలలో బంధిస్తుంటారు. చిరుత పులులను సాధు జంతువులుగా భావిస్తూ.. జీవిస్తున్న రబారి గిరిజనులకు హాట్సాఫ్ చెప్పాల్సిందే. అన్నట్టు ఈ గ్రామాన్ని టైగర్ విలేజ్ అని పిలుస్తుంటారు.