Chittamma Tea Stall: కేఫ్ నిలోఫర్ లో టీ తాగాలంటే ఎంత టైం పడుతుంది.. మహా అయితే పదినిమిషాలు.. ఒకవేళ ప్రీమియం టి అయితే 15 నిమిషాలు.. కేఫ్ నిలోఫర్ అనేది ఎలైట్ పీపుల్ కోసం మాత్రమే ఏర్పాటు చేసింది. అందులోకి సాధారణ ప్రజలు వెళ్లడం కష్టం. ఒకవేళ వెళ్లినా టీ కొనుగోలు చేయడం మరింత కష్టం. ఎందుకంటే అక్కడ టీ ధర ఆ స్థాయిలో ఉంటుంది కాబట్టి.. అస్సాం రాష్ట్రంలో లభించే తేయాకు ద్వారా సేకరించే ప్రీమియం డస్ట్ తో తయారు చేసే టీ అయితే ఏకంగా వెయ్యి రూపాయల వరకు ఉంటుంది.
కేఫ్ నిలోఫర్ గురించి రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. కానీ ఒక సాధారణ మహిళ కేఫ్ నిలోఫర్ స్థాయిలో టీ స్టాల్ రన్ చేస్తోంది అనే విషయం మీకు తెలుసా.. అక్కడ టీ తాగాలంటే తక్కువగా తక్కువ 15 నిమిషాల వరకు వెయిట్ చేయాలని మీకు తెలుసా.. క్యూలో నిలబడితేనే అక్కడ టీ పోస్తారని మీకు తెలుసా.. ఇంతకీ అక్కడ అంత ప్రత్యేకత ఏంటి.. ఆ మహిళ చేసే టీ కి ఈ స్థాయిలో డిమాండ్ ఎందుకు.. ఈ కథనంలో తెలుసుకుందాం పదండి..
ఉమ్మడి కృష్ణా జిల్లాలో గుడివాడ పట్టణంలో చిట్టెమ్మ అనే మహిళ టీ స్టాల్ రన్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ టీ తాగడాన్ని గుడివాడ వాసులు స్టేటస్ సింబల్గా భావిస్తూ ఉంటారు. అక్కడ టీ స్టాల్ పెద్ద హంగామా తో ఉండదు. అక్కడ ఏసీలు ఉండవు. వెలుగులు చిమ్మె దీపాలు ఉండవు.. ప్రత్యేకించి అంతస్తుల భవనాలు ఉండవు. అక్కడ కేవలం ఒక సాధారణ ఇల్లు.. అందులోనూ కనీసం కూర్చోవడానికి కుర్చీలు కూడా ఉండవు. పైగా చిట్టెమ్మ చిన్నపాటి గ్యాస్ స్టవ్ మీద టీ తయారు చేస్తూ ఉంటుంది. టీ తయారీకి స్థానికంగా ఉన్న రైతుల నుంచి ఆమె పాలు సేకరిస్తూ ఉంటుంది. ఆ పాలలో ఆమె నాణ్యమైన బెల్లం పొడి.. నాటు అల్లం.. కేరళ రాష్ట్రం నుంచి తెప్పించిన యాలకులు.. కొద్దిగా సొంటిపొడి.. ప్రీమియం టీ పౌడర్ వాడుతుంటారు. ఈ స్థాయిలో ఉంటుంది కాబట్టి చిట్టెమ్మ టీ కి విపరీతమైన గిరాకి. పైగా ఆ టీ అద్భుతంగా ఉంటుంది. ఒక కప్పు టీ ఆమె పదిహేను రూపాయలు చొప్పున విక్రయిస్తూ ఉంటుంది. ఎప్పటికీ అక్కడ రద్దీ ఉంటుంది.. ఉదయం 8 నుంచి సాయంత్రం ఆరు వరకు అక్కడ టీ స్టాల్ లో విపరీతమైన గిరాకీ ఉంటుంది. అందువల్లే చిట్టెమ్మ టీ స్టాల్ అంటే గుడివాడలో ఒక పాపులర్ స్పాట్ అయిపోయింది.
కేఫ్ నిలోఫర్ బాబూ రావు తన జర్నీ ఇలానే మొదలుపెట్టారు. ఈ రోజున హైదరాబాదులో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. చిట్టెమ్మ కూడా అలాంటి వ్యక్తినే. కేవలం తనకి తెలిసిన టీ తయారు చేయడం ద్వారా ఈరోజు ఇంత గుర్తింపు సంపాదించుకుంది. భవిష్యత్తు కాలంలో గుడివాడలో కేఫ్ నిలోఫర్ స్థాయిలో కాకపోయినప్పటికీ.. తన స్థాయికి తగ్గట్టుగా టీ స్టాల్ ఏర్పాటు చేయాలని ఆమె భావిస్తుంది. ఆమె కల సాకారం కావాలని మనమంతా కోరుకుందాం.