Cheemala Tipa Island : కృష్ణానది పరివాహకం అందమైన ప్రకృతికి.. అత్యద్భుతమైన ప్రాంతాలకు ఆలవాలం.. ఉమ్మడి పాలమూరు, నల్లగొండ జిల్లాలో కృష్ణానది ప్రవహిస్తుంది.. ఈ నది ప్రవహించిన పరివాహంలో కొత్త కొత్త ప్రాంతాలు ఉన్నాయి. అయితే ఈ ప్రాంతాలలో చాలావరకు బయటి ప్రపంచానికి తెలియదు. అలా తెలిసిన ప్రాంతాలలో కొన్ని గుర్తింపుకు నోచుకోలేదు. కొన్ని గుర్తింపునకు నోచుకున్నప్పటికీ.. పర్యాటకులు ఎక్కువగా వెళ్లడం లేదు. అయితే పర్యాటకులకు అమితానందాన్ని.. అంతకుమించిన అనుభూతిని అందించే ప్రాంతం కృష్ణా నదిలో ఉంది. ఇది తెలంగాణ, ఆంధ్రా రాష్ట్రాల సరిహద్దులో ఉంది. ఇక్కడికి వెళ్తే చుట్టూ దట్టమైన అడవులు.. కృష్ణ నది ప్రవాహం.. అద్భుతమైన ప్రాంతాలు పర్యాటకు కనువిందు చేస్తాయి.
ఎక్కడ ఉందంటే
శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువన చీమల తిప్ప ద్వీపం (cheemala tipa Island) ఉంది.. దీని చుట్టూ నీరు ఉంటుంది. పచ్చటి చెట్లతో మధ్యన చిట్టడవిని తలపిస్తుంది. ఇది నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం అమరగిరి నుంచి కృష్ణా నదిలో ఆంకాలమ్మ ఆలయానికి వెళ్లే దారిలో ఈ దీపం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లోని నందికొట్కూరు నియోజకవర్గం కొత్తపల్లి మండల పరిధిలో ఇది విస్తరించి ఉంటుంది. ఇక్కడ సుమారు 50కి పైగా మత్స్యకార కుటుంబాలు తాత్కాలిక ఆవాసాలు ఏర్పాటు చేసుకొని జీవిస్తుంటారు. కృష్ణానదిలో చేపలను పట్టుకుంటూ జీవనం సాగిస్తుంటారు.. వర్షాకాలం మినహా.. మిగతా అన్ని రోజులు వారు ఇక్కడే ఉంటారు.. ఇక్కడ పట్టే చేపలకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. చేపలను పట్టి అదే నదిలో పడవల ద్వారా ప్రయాణం చేసి.. మత్స్యకారులు మైదాన ప్రాంతాల్లో అమ్ముతుంటారు. ఈ ప్రాంతాన్ని మరింతగా అభివృద్ధి చేస్తే పర్యాటకులకు అనువుగా ఉంటుంది. ములుగు జిల్లాలో బ్లాక్ బెర్రీ ఐలాండ్ లాగా.. దీనిని కూడా అభివృద్ధి చేస్తే పర్యాటకులు ఎక్కువగా వచ్చే ఆస్కారం ఉంటుంది.. రెండు రాష్ట్రాల పర్యాటక శాఖ అధికారులు సంకల్పిస్తే ఈ ప్రాంతాన్ని అద్భుతమైన ద్వీపకల్పం లాగా మార్చవచ్చు. ఈ ప్రాంతంలో రాత్రిపూట సేద తీరవచ్చు.. కృష్ణ నదిలో బోటింగ్ చేయవచ్చు.. సరదాగా ఫిషింగ్ కూడా చేయవచ్చు.. పైగా ఇక్కడ దట్టమైన వృక్షాలు ఉంటాయి కాబట్టి.. పర్యాటకులు ఊగడానికి ఊయలలు కూడా ఏర్పాటు చేయవచ్చు. ఈ ప్రాంతంలో 365 రోజులు నీరు నిల్వ ఉంటుంది.. పైగా అది స్వచ్ఛంగా ఉంటుంది. ఇక్కడ చేపలు కూడా అత్యంత రుచిగా ఉంటాయి.. వీటిని తినడానికి ఎక్కడెక్కడ నుంచో వస్తూ ఉంటారు.. చేపల పెంపకాన్ని కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తే మత్స్యకారులకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది.