Bullock Cart Innovation: ఇప్పుడంటే ట్రాక్టర్లు వచ్చాయి. అంతకుమించి అనేటట్టుగా వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. వాటి ద్వారా సరుకుల రవాణా జరుగుతోంది. ఫలితంగా ఎడ్ల బండి అనేది మూలకు పడిపోయింది. కానీ ఒకప్పుడు ఇలా ఉండేది కాదు. రైతులకు ఇంతటి వ్యయం అయ్యేది కాదు.
టేకు చెక్కతో తయారుచేసిన ఎడ్ల బండి.. దానిమీద వెదురు పుల్లలతో రూపొందించిన జల్ల.. అది కనిపిస్తే చాలు అందులో ఏదో ఒక వ్యవసాయ ఉత్పత్తిని రైతు ఇంటికి లేదా మార్కెట్ కు తీసుకెళ్తున్నాడని అనుకునేవారు . ధాన్యం, మొక్కజొన్నలు, పత్తి, మిరపకాయలు, పెసల్లు, కందులు ఇలా చెప్పుకుంటూ పోతే రైతు పండించిన ప్రతి ఉత్పత్తిని ఎడ్ల బండిలో ఇలా వెదురు జల్లలో ఇంటికి తీసుకెళ్లేవాడు. ఇలా రోజుల తరబడి ఎడ్ల బండి ద్వారానే వ్యవసాయ ఉత్పత్తులను ఇంటికి లేదా మార్కెట్ కు రవాణా చేసేవాడు. ఫలితంగా రైతుకు పెద్దగా వ్యయం ఉండేది కాదు. ట్రాక్టర్ వంటి వాటిని ఉపయోగించాల్సిన పని ఉండేది కాదు. నాటి రోజుల్లో వెదురు జల్లలో రవాణా చేసిన ఉత్పత్తులు నాణ్యంగా ఉండేవి.. ఆ జల్ల అత్యంత కట్టుదిట్టంగా అల్లడం వల్ల బండిలో నిండుగా ఉండేది.
ఇప్పుడు ఆ పరిస్థితి లేదు
కాలక్రమంలో వ్యవసాయం కూడా అనేక మార్పులకు గురైంది. యంత్రాల వల్లనే ప్రతి పని కూడా జరుగుతోంది. వ్యవసాయాన్ని పూర్తిగా యంత్రాలు ఆక్రమించడంతో మనుషుల అవసరం తగ్గిపోతుంది. ఎడ్ల బండి కూడా ఒకప్పటి జ్ఞాపకం లాగా మారిపోయింది. ఇక ప్రతి గ్రామంలో ఎద్దులు అనేవి తక్కువ సంఖ్యలోకి పడిపోయాయి. ఎవరో ఒక ఔత్సాహిక రైతు వద్ద మాత్రమే ఎద్దులు కనిపిస్తున్నాయి. ఇక ప్రతి రైతు తమ స్తోమతకు తగ్గట్టుగా ట్రాక్టర్ కొనుగోలు చేయడంతో ఎడ్లబండి వినియోగం పూర్తిగా పడిపోయింది. ఇదివరకు గ్రామాలలో ప్రతి రైతు దగ్గర ఎడ్ల బండి ఉండేది. ఇప్పుడు ఆ స్థానాన్ని ట్రాక్టర్ ఆక్రమించింది. భవిష్యత్ కాలంలో ఇంకా ఎన్ని మార్పులు చోటు చేసుకుంటాయో తెలియదు కాని.. ఇప్పటికైతే పరిస్థితి పూర్తిగా యాంత్రీకరణ దిశగా వెళ్లిపోయింది. నేటి తరం పిల్లల కోసం ఎడ్ల బండి గురించి తెలియాలన్నా.. వెదురు జల గురించి తెలియాలన్నా అయితే గూగుల్లో సెర్చ్ చేయాలి. లేదా ఎక్కడైనా వ్యవసాయ పరికరాలు లేదా పురాతన పుస్తల గురించి ప్రదర్శన జరిగితే చూడాలి. ఎందుకంటే వెనుకటి ఉత్పత్తులు ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయాయి. రైతులు కూడా వాటికి నమస్కారం పెట్టేశారు.
Also Read: Adani- YCP Government: అదానీ అడిగితే ఓకే.. ఏపీ సర్కారు తీరుపై పారిశ్రామికవర్గాల విస్మయం
గ్రామాలలో ఇప్పటికీ పాతకాలం రైతులు నాటి రోజులు గుర్తు చేసుకుంటూ బాధపడుతుంటారు. యాంత్రికరణ వల్ల వ్యవసాయంలో వ్యయం పెరిగిందని.. రైతులకు గిట్టుబాటు పూర్తిగా తగ్గిపోయిందని వారు బాధపడుతున్నారు. వెనుకటి రోజుల్లో రైతులకు ఈ స్థాయిలో ఖర్చు ఉండేది కాదని.. పంట ఉత్పత్తిలో శారీరక శ్రమ అధికంగా ఉండేదని.. ఇప్పుడు శారీరక శ్రమ తగ్గిపోయి పురుగుమందుల వాడకం పెరిగిందని వెనుకటి రైతులు వాపోతున్నారు. యాంత్రికరణ ఒక దశ వరకు ఉంటే బాగుండేదని.. అది ఇప్పుడు అన్ని రంగాలలో రైతులపై వ్యయం పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.