Adani- YCP Government: అదానీ అడిగితే ఓకే.. ఏపీ సర్కారు తీరుపై పారిశ్రామికవర్గాల విస్మయం

Adani- YCP Government: దావోస్ లో జరిగిన ప్రపంచ వాణిజ్య సదస్సుకు హాజరైన ఏపీ సీఎం జగన్ స్వదేశీ కంపెనీలతో ఒప్పందం చేసుకోవడం చర్చనీయాంశమైంది. దానికి దావోస్ వరకూ ఎందుకు వెళ్లడమన్న ప్రశ్న ఉత్పన్నమైంది. ఇక్కడే ఒప్పందం చేసుకోవచ్చు కదా అని మన దేశానికి చెందిన పారిశ్రామిక వేత్తలు సైతం ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. వాస్తవానికి దావోస్ లో అదానీ సంస్థతో లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు కుదుర్చుకున్నట్టు జగన్ మీడియా ఆర్భాటపు కథనాలను ప్రచురించింది. కానీ […]

Written By: Dharma, Updated On : May 29, 2022 10:49 am
Follow us on

Adani- YCP Government: దావోస్ లో జరిగిన ప్రపంచ వాణిజ్య సదస్సుకు హాజరైన ఏపీ సీఎం జగన్ స్వదేశీ కంపెనీలతో ఒప్పందం చేసుకోవడం చర్చనీయాంశమైంది. దానికి దావోస్ వరకూ ఎందుకు వెళ్లడమన్న ప్రశ్న ఉత్పన్నమైంది. ఇక్కడే ఒప్పందం చేసుకోవచ్చు కదా అని మన దేశానికి చెందిన పారిశ్రామిక వేత్తలు సైతం ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. వాస్తవానికి దావోస్ లో అదానీ సంస్థతో లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు కుదుర్చుకున్నట్టు జగన్ మీడియా ఆర్భాటపు కథనాలను ప్రచురించింది. కానీ అదానీ అంటే ఏపీ ప్రభుత్వానికి ప్రత్యేక ఆసక్తి ఉందన్నది అందరికీ తెలిసినదే. అదానీ సంస్థ ఏమడిగినా కాదనకుండా ప్రభుత్వం చేసి పెడుతోంది. తాజాగా విశాఖపట్నంలో అదానీ ఏర్పాటు చేసే డేటా సెంటర్‌కు మరో మేలు చేస్తూ నిర్ణయం తీసుకుంది. 2020లో విశాఖ మధురవాడలో రూ.2,600 కోట్లు మార్కెట్‌ విలువ చేసే 130 ఎకరాలను ఎకరా కోటి రూపాయలు చొప్పున కేవలం రూ.130 కోట్లకే ఈ సంస్థకు కేటాయించింది. ఏపీఐఐసీ తొలుత ఈ భూమిని లీజు ఒప్పందం కింద ఇచ్చింది. లీజు ఒప్పందమైతే బ్యాంకులు భారీగా రుణాలు ఇవ్వవని, సేల్‌ డీడ్‌ (అమ్మకం ఒప్పందం)గా మార్చాలంటూ అదానీ పేచీ పెట్టింది. దీంతో ఆ సంస్థ కోరినట్టుగానే ప్రభుత్వం లీజు డీడ్‌ను సేల్‌ డీడ్‌గా మార్చింది. బ్యాంకులో తగిన రుణం తీసుకోవడానికి ప్రభుత్వం వీలు కల్పించింది. సేల్‌ డీడ్‌ చేసిన కంపెనీ ఇదొక్కటే కావడం గమనార్హం. ఇప్పుడు అదే చోట డేటా సెంటర్‌ లే అవుట్‌ ఖర్చులను కూడా ప్రభుత్వం మాఫీ చేసింది. రూ.5.05 కోట్లను ప్రభుత్వం రద్దు చేసింది. అంతేగాక ఆ సంస్థకు ఇచ్చిన 130 ఎకరాలకు పక్కనే ఉన్న మరో సర్వే నంబర్‌ను కలుపుతూ మరో ఉత్తర్వు జారీ చేసింది. ఆ సర్వే నంబర్‌లో కూడా అదానీకి భూమి ఉన్నట్టు పేర్కొంది.

Adani, JAGAN

నిబంధనలకు విరుద్ధంగా..
విశాఖలోని మధురవాడ సమీపంలోని కొండల సముదాయంలో ఏపీఐఐసీకి ఒకే దగ్గర 290 ఎకరాలు ఉంది. అందులోని 409 సర్వే నంబరులో 130 ఎకరాలు అదానీకి ఇచ్చారు. 2020 నవంబరు 23న ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. వాస్తవానికి ఆ కొండపై ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టలేదు. కనీసం లేఅవుట్‌ కూడా వేయలేదు. మార్కింగ్‌ చేసి అదానీకి భూమి ఇవ్వాల్సి రావడంతో ఏపీఐఐసీ కాగితంపై లే అవుట్‌ను రూపొందించి.. అనుమతి కోసం విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ)కు దరఖాస్తు చేసింది. దీనికి ఫీజుల రూపేణా రూ.6.39 కోట్లు చెల్లించింది.

Also Read: Anantapur District Puleti Erragudi: ఆ మహిళ అలక.. గ్రామానికి చేటు తెప్పించిందట

అందులో ఎక్కువ భాగం అదానీదే అయినందున నిష్పత్తి ప్రకారం ఆ కంపెనీ రూ.5.05 కోట్లు భరించాల్సి ఉందని, దానిని రీయింబర్స్‌ చేసుకుంటామని ప్రభుత్వానికి ఏపీఐఐసీ లేఖ రాసింది. అయితే అందుకు ప్రభుత్వం అంగీకరించలేదు. ఒక కంపెనీకి భూమి ఇచ్చినప్పుడు అది వినియోగించుకునే రీతిలో ఇవ్వాలని, అలా తయారు చేసేందుకు అయ్యే వ్యయాన్ని ఏపీఐఐసీనే భరించాలని, రీయింబర్స్‌ చేసుకోవద్దని స్పష్టం చేసింది. దీనిపై ఈ నెల 20వ తేదీనే ఉత్తర్వులు జారీ చేసింది. అయితే తమకు ఇంకా అందలేదని ఏపీఐఐసీ అధికారులు చెబుతున్నారు. దీంతో పాటే ప్రభుత్వం మరో ఉత్తర్వు కూడా జారీ చేసింది. అదానీకి ఇచ్చిన 130 ఎకరాలు 409 సర్వే నంబర్‌లో ఉండగా, కొత్తగా 427 సర్వే నంబర్‌ను కూడా చేర్చింది. ఈ రెండు సర్వే నంబర్లలోనూ అదానీ భూమి ఉందని ఉత్తుర్వులో పేర్కొంది. ఈ కొత్త ఉత్తర్వు మతలబు ఏమిటో తమకూ అర్థం కావడం లేదని అధికారులు చెబుతున్నారు. కొండకు ఒక వైపు సర్వే నంబర్‌ 409 ఉంటే, అవతల వైపు సర్వే నంబర్‌ 427 ఉంది. దానిని ఎందుకు చేర్చారన్నది చర్చనీయాంశమైంది. ఈ సర్వే నంబర్‌లో ఎన్ని ఎకరాలు ఉందన్న దానిపై సమాచారం లేదు.

ప్రభుత్వ ఆస్తులు ప్రైవేటుపరం..
విశాఖలోని ప్రభుత్వ ఆస్తులు దాదాపు ప్రైవేటు కంపెనీల పరమవుతున్నాయి. కొత్తగా ఏదైనా కంపెనీ విశాఖపట్నంలో ఎక్కువ పెట్టుబడులు పెడతామని చెబితే.. భీమిలి బీచ్‌ రోడ్డులో కొండలను కేటాయించడం ఆనవాయితీగా వస్తోంది. గతంలో రామానాయుడు స్టూడియోకు కాపులుప్పాడలో ఒక కొండ ఇచ్చారు. సొంత ఖర్చులతో దానిని వారే అభివృద్ధి చేసుకున్నారు. రుషికొండలో మిరాకిల్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీకి ఒక కొండ కేటాయించారు.

Adani, JAGAN

అది కూడా వారే అభివృద్ధి చేసుకున్నారు. అయితే అదానీకి మధురవాడలో స్థలం కేటాయించారు. కానీ ప్రభుత్వమే అన్ని ఖర్చులు భరించడానికి ముందుకు రావడం అదానీ సంస్థపై ఉన్న ప్రత్యేక అభిమానాన్ని చాటుతోంది. గతంలో ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌, డీఆర్‌డీవో, సెంటినల్‌ టవర్‌కు కూడా భూములు కేటాయించారు. ఆ తరువాత అదానీ వచ్చి చేరింది. ఆయా సంస్థల పేరుతో అక్కడ బోర్డు ఉండేది. ఇటీవల ఆ బోర్డు తీసేసి, ఏపీఐఐసీ నాలెడ్జ్‌ పార్క్‌ అంటూ కొత్త బోర్డు పెట్టారు. అందులో ఏదో మర్మం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం తీరు నచ్చక ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ వెనక్కి వెళ్లిపోయింది. ఆ కంపెనీ పేరుతో బోర్డు ఉంటే.. అది వెళ్లిపోయిన విషయంపై చర్చ జరుగుతుందన్న ఉద్దేశంతో తీసేసి ఉండవచ్చునన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి వైసీపీ ప్రభుత్వం అదానీ సంస్థపై తనకున్న ప్రత్యేక అభిమానాన్ని చాటుకుంటోంది. అందుకే ప్రభుత్వానికి మైలేజ్ వచ్చేలా దావోస్ లో ఏకంగా లక్షలాది కోట్ల రూపాయలను ఏపీలో పెట్టుబడులు పెట్టనున్నట్టు అదానీ సంస్థ ప్రకటించింది. దీనికి మసిపూసి మారేడు కాయ చేస్తోంది. పరిశ్రమల పెట్టుబడులు అన్న విషయానికి వచ్చేసరికి ఏపీ ప్రభుత్వానికి అదానీ సంస్థ ఒక్కటే గుర్తుకు రావడం ప్రస్తావించాల్సిన విషయం. దీనిపై స్వదేశీ పారిశ్రామిక వేత్తల్లో సైతం ఏపీ ప్రభుత్వంపై అనుమానాలున్నాయి.

Also Read:Bull Cart Ride To Delhi: తోబుట్టువుకు న్యాయం చేయాలంటూ ఢిల్లీకి ఎడ్ల బండి యాత్ర..అసలేం జరిగిందంటే?

Tags