Asmika Das story: ఆ బాలిక పేరు ఆస్మిక దాస్. వయస్సు 18 నెలలు. ఆమె తల్లిదండ్రులు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని చందన్ నగర్ ప్రాంతానికి చెందినవారు. ఆస్మిక దాస్ చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. గుండ్రటి ముఖం. బంగారు వర్ణం.. విశాలమైన నేత్రాలు.. చలాకీ మాటలతో ఇట్టే ఆకట్టుకుంటుంది. ఆ చిన్నారిని చూసి తల్లిదండ్రులు ఎంతో మురిసిపోయారు. ఆమె అల్లరిని ఆస్వాదిస్తూ కాలాన్ని మర్చి పోయారు. అలా గడిచిపోతున్న వారి జీవితంలో ఓ రోజు ఊహించని మలుపు చోటు చేసుకుంది. ఆ బాలిక ఉన్నట్టుండి అనారోగ్యానికి గురైంది.
కంగారుపడిన తదితరులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. పాప అనారోగ్యాన్ని అంచనా వేసిన వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో ఆ బాలికకు అరుదైన స్పైనల్ మస్కిలర్ అట్రోఫీ వ్యాధి సోకినట్టు గుర్తించారు. ఇది పూర్తిగా జన్యు సంబంధమైన వ్యాధి. ఈ వ్యాధి ఉన్నవారు నిలబడలేరు.. పాకుకుంటూ ఉండిపోతారు. ఇతరుల సహాయం మీద ఆధారపడాల్సిన దుస్థితి వీరికి ఉంటుంది. ఈ వ్యాధి నివారణకు 16 కోట్ల విలువైన ఇంజక్షన్ వేయాల్సి ఉంటుంది. ఈ పాప పరిస్థితి తెలిసిన ఇంజక్షన్ తయారీ కంపెనీ 9 కోట్లకు ఇస్తామని ముందుకు వచ్చింది. ఆ 9 కోట్లు కూడా వీరి దగ్గర లేకపోవడంతో క్రౌడ్ ఫండింగ్ ద్వారా సేకరించారు.
క్రౌడ్ ఫండింగ్ ద్వారా డబ్బు సమకూరడంతో ఆ పాపకు ఇంజక్షన్ కొనుగోలు చేసి వేయించారు. ఇంజక్షన్ పెంచిన తర్వాత ఆ పాప పూర్తిగా కోలుకుంది. ప్రస్తుతం నడుస్తోంది. మొన్నటిదాకా బుడిబుడి అడుగులు వేసేది. ఇప్పుడు స్వయంగా నడుస్తోంది. అత్యంత అరుదైన జన్యుపరమైన వ్యాధిని అధిగమించిన నేపథ్యంలో ఆ బాలికను పశ్చిమ బెంగాల్లో సెలబ్రిటీగా పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జగదాత్రి పూజను ప్రారంభించే అవకాశం ఆ బాలికకు దక్కింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఈ పూజను కేవలం సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు మాత్రమే ప్రారంభిస్తారు.
ఆస్మిక దాస్ ను కాళికామాత అంశగా అక్కడి ప్రజలు పేర్కొంటున్నారు. ఆ బాలిక చూసేందుకు కూడా అదే మాదిరిగా ఉండడంతో ముద్దు చేస్తున్నారు. ఆమె ఎంతో బలమైన విపత్తును ఎదుర్కొందని.. ఇప్పుడు ఏకంగా చలాకీగా తిరుగుతోందని పేర్కొంటున్నారు. అటువంటి బాలిక పూజను ప్రారంభించడం గొప్ప విషయంగా అక్కడి ప్రజలు భావిస్తున్నారు.