Amit Sehra: పనసకాయ పరిమాణంలో కష్టపడినప్పటికీ.. వేప గింజంత అదృష్టం కూడా ఉండాలని అంటారు పెద్దలు. ఇతడి జీవితంలో కూడా అలానే జరిగింది.. అతడికి మొదటినుంచి కూడా కష్టపడే అలవాటు.. కాకపోతే అదృష్టం లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడేవాడు.. ఆర్థికంగా ఒడిదుడుకులను ఎదుర్కొనేవాడు.. ఈ క్రమంలో అతడికి ఒక ఆలోచన వచ్చింది.. తన దరిద్రాన్ని దూరం చేసుకోవాలనే ఆకాంక్ష పెరిగింది. ఇందులో భాగంగానే అతడు స్నేహితుడి దగ్గర అప్పుచేసి లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. కొనుగోలు చేస్తున్నప్పుడు స్నేహితుడి దగ్గర తీసుకున్న అప్పు ఎలా తీర్చాలి అని మాత్రమే ఆలోచించాడు. లాటరీ తనకు తగులుతుందని.. తన జీవితం మారిపోతుందని కలలో కూడా ఊహించలేదు.
Also Read: జూబిలీ హిల్స్ ఎన్నికల ప్రచారం లో పవన్ కళ్యాణ్..? పూర్తి వివరాలు ఎక్సక్లూసివ్ గా మీకోసం!
రాజస్థాన్ రాష్ట్రంలోని కోట్ పూతులి ప్రాంతానికి చెందిన అమిత్ సెహ్రా అనే వ్యక్తి కూరగాయల వ్యాపారం చేస్తుంటాడు. కూరగాయల వ్యాపారం చేస్తున్నప్పటికీ అతడికి చెప్పుకునే స్థాయిలో ఆస్తులు లేవు. బ్యాంకు బాలన్స్ కూడా లేదు. పేద కూరగాయలు అమ్మడం.. వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని సాకడం.. ఇలానే సాగిపోతోంది అతడి జీవితం. అయితే ఇదంతా ఎన్ని రోజులు? ఎంతకాలం? అనే ప్రశ్న అతడిలో నిత్యం ఉదయిస్తూనే ఉండేది. ఈ నేపథ్యంలో అతడు తన స్నేహితుని వద్ద లాటరీ టికెట్ కొన్నాడు..
పంజాబ్ స్టేట్ దీపావళి బంపర్ లాటరీ 2025లో 1000 పెట్టి లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. ఆ టికెట్ లాటరీలో 11 కోట్ల నగదు గెలుచుకుంది. ఆ టికెట్ మరెవరితో కాదు అమిత్ ది. దీంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. అంతేకాదు లాటరీ టికెట్ కొనుగోలు చేయడానికి వెయ్యి రూపాయలు అప్పుగా ఇచ్చిన స్నేహితుడి రుణం తీర్చుకోవడానికి కీలక నిర్ణయం తీసుకున్నాడు. అతడు 1000 రూపాయలు ఇచ్చినందుకు కృతజ్ఞతగా.. అతని కుమార్తెకు కోటి రూపాయలు నగదు బహుమతిగా ఇస్తున్నట్టు ప్రకటించాడు. వచ్చిన డబ్బుతో ఆస్తులు కొనుగోలు చేస్తానని.. పిల్లల విద్య కోసం, కుటుంబ భవిష్యత్తు కోసం ఖర్చు చేస్తానని అమిత్ ప్రకటించాడు.. నేటి కాలంలో స్నేహితుల వద్ద తీసుకున్న అప్పును ఎగ్గొట్టే ఫ్రెండ్స్ ఉన్నారు.. కానీ లాటరీ గెలిచినందుకు అతడి వెయ్యి రూపాయలు కారణమయ్యాయి అని భావించిన అమిత్ ఏకంగా కోటి రూపాయలు ఇవ్వడం నిజంగా గొప్ప విషయం.
లాటరీ గెలిచిన తర్వాత ఆమె కుటుంబం సంబరాలు జరుపుకుంది.. ఏకంగా 11 కోట్లు వచ్చాయని తెలియడంతో ఆనందంలో మునిగితేలుతోంది. అమిత్ భార్య అయితే కన్నీటి పర్యంతమవుతోంది.. ఇంతటి డబ్బులు తాను కలలో కూడా ఊహించలేదని.. దేవుడు ఇన్నాళ్లకు తన బతుకులు మార్చాడని ఆమె చెబుతోంది.