African Man: చావు నాకు ఎదరొచ్చినా.. నేను చావుకు ఎదురెళ్లినా రిస్క్ చావుకే.. ఇదేదో సినిమా డైలాగ్‌లా ఉంది కదూ.. సినిమా డైలాగే కానీ, కాస్త మార్చాం. బాలయ్య ఓసినిమాలో చెప్పిన డైలాగ్‌ను ఇలా చేంజ్ చేశాం. ఎందుకంటే టాంజానియాకు చెందిన ఓ వ్యక్తి విషయంలో అదే జరుగుతోంది. చావే ఇతనికి భయపడుతోంది. టచ్ చేసి కూడా ప్రాణాలు తీయడం లేదు. యమ భటులు దగ్గరి వరకు వచ్చి తిరిగి వెళ్తున్నారు. ఇక చావు అంచులు వరకు వెళ్లి తిరిగి వస్తున్న ఇతను ఇప్పుడు అనేక ఇబ్బందులు ఎదుక్కొంటోర్నాడు. నాకు చావెందుకు రావడం లేదురా దేవుడా అని మదన పడుతున్నాడు. టాంజానియాకు చెందిన ఇస్మాయిల్ అజీజి జీవితం ఒక అద్భుత కథనంలా సాగుతోంది. ఆరుసార్లు మరణాన్ని ఎదుర్కొని, ప్రతిసారీ ప్రాణాలతో బయటపడిన అతని కథ వైద్య శాస్త్రాన్నే సవాల్ చేస్తోంది.
Also Read: మనిషివా.. ‘ట్రంప్’ వా?
మరణం నుంచి తిరిగి రాగల శక్తి
అజీజి జీవితంలో ఆరుసార్లు వైద్యులు మరణాన్ని నిర్ధారించినప్పటికీ, అతను ప్రతిసారీ బతికి బయటపడటం ఒక వింత అనుభవం. ప్రమాదం, మలేరియా, కారు దుర్ఘటన, విషపు పాముకాటు, సెప్టిక్ ట్యాంక్‌లో పడటం, దహనం వంటి విభిన్న సంఘటనల్లో అతను మరణాన్ని జయించాడు. ఇటువంటి పరిస్థితులు సాధారణంగా ‘లాజరస్ సిండ్రోమ్’(స్వయంగా పునరుజ్జీవనం) లేదా వైద్యపరమైన తప్పిదాల వల్ల సంభవించవచ్చు.
ఆరుసార్లు మరణం నుంచి బయటపడిందిలా..
– మొదటిసారి అజీజి పనిచేస్తున్న చోట ప్రమాదం జరిగింది. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు చనిపోయినట్లు నిర్ధారించారు. దీంతో కుటుంబ సభ్యులు అతడి శరీరాన్ని శవాగారంలో ఉంచి అంత్యక్రియల కోసం ఏర్పాట్లు చేస్తుండగా అజీజి లేచి నడిచి వచ్చాడు.
– ఇక రెండోసారి అజీజికి మలేరియా వచ్చింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో కుటుంబ సభ్యులు మృతదేహాన్ని అంత్యక్రియల కోసం శవ పేటికలో పెట్టారు. కానీ, కాసేపటికే ఇతను శవపేటికలో నుంచి బయటకు వచ్చాడు.
– ఇక మూడోసారి ఇతనికి కారు ప్రమాదం జరిగింది. ఇందులో గాయపడిన అజీజి కోమాలోకి వెళ్లాడు. కొంత కాలానికి వైద్యులు అతను మరణించినట్లు ధ్రువీకరించారు. కానీ ఇతను మళ్లీ లేచాడు. ఈసారి డాక్టర్లు కూడా షాక్ అయ్యారు.
– నాలుగోసారి అజీజిని ఓ విషపు పాము కాటువేసింది. దీంతో అతడు మరణించాడని అంతా భావించారు. అయితే అప్పటికే మూడుసార్లు చావు అంచుల వరకు వెళ్లి లేచ రావడంతో మళ్లీ బతుకుతాడని ఈసారి శవాగారంలో బాడీని మూడు రోజులు ఉంచారు. తర్వాత ఇతని కుటుంబం శవాన్ని అంత్యక్రియలకు తీసుకెళ్తుండగా అజీజి మళ్లీ లేచాడు.
– ఇక ఐదోసారి అజీజి సెప్టిక్ ట్యాంకులో పడిపోయాడు. దీంతో అతడు ఈసారి కచ్చితంగా చనిపోయాడని స్థానికులు, కుటుంబ సభ్యులు భావించారు. కానీ, అలా జరగలేదు. మళ్లీ బతికాడు.
– ఇక చివరగా అతని ఊరువాళ్లు అజీజి ఇన్నిసార్లు చనిపోయి బతుకుతున్నాడని, ఇతను మనిషి కాదని ఏదో దుష్టశక్తి అని భావించారు. అతడిని ఇంట్లో నిర్భందించి సజీవంగా దహనం చేయాలనుకున్నారు. ఇంటికి నిప్పు పెట్టారు. ఇక ఈసారి అజీజి కాలి బూడిదై ఉంటాడని అంతా అనుకున్నారు. కానీ ఆశ్చర్యకరంగా ఇతను మళ్లీ లేచాడు.
అజీజి విషయంలో ఈ ఘటనలు ఆరుసార్లు పునరావృతం కావడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ ఘటనలు అతన్ని ఊరి నుంచి వెలివేతకు దారితీశాయి, ఫలితంగా అతను ఒంటరిగా ఒక పాడుబడ్డ గుడిసెలో నివసిస్తున్నాడు. అజీజి కథ కేవలం మరణం నుంచి తిరిగి రావడం గురించి మాత్రమే కాదు, మానవ జీవన స్థైర్యాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రతీ సంఘటనలో అతను ప్రాణాలతో బయటపడటం, అతని శారీరక,చ మానసిక దృఢత్వాన్ని సూచిస్తుంది. కానీ, సమాజం అతన్ని ఒంటరిగా వదిలేయడం ఒక విషాదం.