Uttar Pradesh: మారుతున్న కాలంతో సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతోంది. కొత్తకొత్త టెక్నాలజీ అందుబాటులోకి వస్తుంది. వారం పది రోజుల్లోనే ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ పాతబడుతోంది. ఇంతలా సాకేంతికత అన్నింగాల్లోకి వచ్చేసింది. అయితే టెక్నాలజీలో అప్పుడప్పుడు జరిగే పొరపాట్లు ఇబ్బందికరంగా మారతుంటాయి. తాజాగా ట్రాఫిక్ చలాన్ విషయంలో అదే జరిగింది. హెల్మెట్ లేదని ఓ వాహనదారుడికి ఏకంగా రూ.21 లక్షల జరిమానా పడింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్‌నగర్ జిల్లాలో హెల్మెట్ లేకుండా స్కూటర్‌పై వెళ్తున్న వ్యక్తికి భారీ చలాన్ పడిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. సాధారణంగా హెల్మెట్ లేకుండా వెళితే రూ.1,000 నుంచి రూ.4 వేల వరకు జరిమానా విధించే నియమం ఉంది. కానీ ప్రస్తుతం పడిన చలాన్ అందరినీ షాక్‌కు గురిచేసింది.
సోషల్ మీడియాలో వైరల్
ఉత్తరప్రదేశ్‌కు చెందిన అన్మోల్ అనే యవకుడు స్కూటర్‌పై వెళ్తుండగా పోలీసులు ఆపి హెల్మెట్ లేకపోవడంపై చలాన్ విధించారు. తర్వాత బండిని సీజ్ చేసి రశీదు అందజేశారు. ఆ చలాన్ మొత్తాన్ని చూసి అన్మోల్ షాక్‌కి గురయ్యాడు. మొత్తంగా రూ.20,74,000గా రసీదులో ఉంది. షాక్ అయిన అన్మోల్.. వెంటనే తేరుకున్నాడు. రశీదును ఫొటోతీసి తన మిత్రులకు పంపించాడు. సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. గంటల వ్యవధిలో లక్షల మంది దీనిని వీక్షించారు.
పొరపాటుపై పోలీసుల వివరణ
సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాక, అన్మోల్ ఈ విషయంపై ట్రాఫిక్ శాఖను ప్రశ్నించాడు. ఇది పోలీసుల వరకు చేరింది. వెంటనే విచారణ చేపట్టారు. సాంకేతిక లోపం కారణంగా ఇలా జరిగిందని స్పష్టం చేశారు. నిజానికి రూ.4 వేల చలాన్ మాత్రమే ఉండగా సిస్టమ్ లోపం కారణంగా సంఖ్యలు తప్పుగా నమోదయ్యాయని తెలిపారు. అనంతరం సరైన చలాన్ జారీ చేశారు. ఈ ఘటనతో డిజిటల్ సిస్టమ్‌లలో దిద్దుబాటు అవసరాన్ని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఆన్‌లైన్ చలాన్ విధానంలో సాంకేతిక లోపాలు జరిగితే సాధారణ ప్రజలకు ఇబ్బందులు తప్పవని నెటిజన్లు పేర్కొంటున్నారు. ఇలాంటి తప్పిదాలతో పోలీసు వ్యవస్థపై సందేహాలు తలెత్తే ప్రమాదం ఉంది.
ట్రాఫిక్ నియమాలు పాటించడం వ్యక్తిగత భద్రతకే కాదు, సామాజిక బాధ్యతకూ సంకేతమని అధికారులు చెబుతున్నారు. ప్రజలు ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటిస్తే ఇలాంటి అనవసర వివాదాలు తప్పించుకోవచ్చని సూచిస్తున్నారు.