Pakistan And Afghanistan War: పాకిస్తాన్–ఆఫ్గానిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్నాయి. 20 రోజుల క్రితం ఆఫ్గానిస్తాన్‌పై పాకిస్తాన్ వైమానిక దాడులు చేసింది. తెహ్రీక్ ఎ తాలిబాన్ పాకిస్తాన్ ఉగ్రవాదులు తమ దేశంలో దాడులు చేస్తున్నారన్న సాకుతో ఈ దాడులు చేసింది. తెహ్రీక్ ఎ తాలిబాన్ పాకిస్తాన్ చీఫ్‌ను టార్గెట్ చేసింది. అయితే.. మూడు నాలుగు రోజులు ఓపిక పట్టిన ఆఫ్గానిస్తాన్.. ప్రతిదాడులు ప్రారంభించింది. పాకిస్తాన్‌కు చెందిన 80 మందికిపైగా సైనికులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. దీంతో అప్రమత్తమైన ఖతార్, టర్కీ రంగంలోకి దిగాయి. ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిర్చాయి. అయితే ఇది తాత్కాలికమే. దీర్ఘకాలిక ఒప్పంద కోసం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. పాకిస్తాన్ పెట్టిన కండీషన్లకు ఆఫ్గాన్ పాలకులు తాలిబాన్లు అంగీకరించలేదు. దీంతో ఉద్రిక్తతలు మళ్లీ తారాస్థాయికి చేరుకున్నాయి. తుర్కియే, ఖతర్ మధ్యవర్తిత్వంలో ఇస్తాంబుల్‌లో శనివారం జరిగిన శాంతి చర్చలు విఫలమయ్యాయి.
తాలిబన్ల ఆగ్రహం
చర్చల అనంతరం పాకిస్తాన్ వైఖరిపై తాలిబాన్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. సరిహద్దు వివాదాలు, ట్రేడ్ మార్గాల నిర్బంధం వంటి అంశాల్లో పాక్ ఉద్దేశపూర్వకంగా ప్రతిబంధకాలు సృష్టిస్తోందని ఆరోపించింది. తమ భూభాగ పరిమితులు లేదా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే యుద్ధానికి వెనుకాడమని తాలిబాన్లు హెచ్చరించారు. అఫ్గాన్ ప్రభుత్వం సరిహద్దు భద్రతను పెంపొందించడానికి అదనపు సైనిక దళాలను తరలించినట్లు తెలిసింది. మరోవైపు పాక్ సైనిక వర్గాలు కూడా సిద్ధంగా ఉన్నాయని తెలుస్తోంది.
కొత్త రాజకీయ సంకేతం..
ఇస్తాంబుల్ చర్చలు రెండు దేశాల మధ్య మధ్యవర్తిత్వానికి చివరి ప్రయత్నంగా భావించబడ్డాయి. అయితే సరిహద్దు ఉగ్రవాదం, దాల్‌బంద్ ప్రవేశాలు, శరణార్థుల నియంత్రణ అంశాలపై ఏకాభిప్రాయం కుదరలేదు. తుర్కియే, ఖతర్ నేతలు సమన్వయం కోసం ప్రయత్నించినప్పటికీ, రెండు పక్షాలు పట్టు వీడలేదు. దీంతో చర్చలు విఫలమయ్యాయి.
పాకిస్తాన్ నాలుగో విడత చర్చలకు ఏ ప్రణాళిక లేదని అధికారికంగా ప్రకటించింది. దీంతో ఇక యుద్ధం తప్పదన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ప్రస్తుత దశలో రెండు దేశాల మధ్య పరస్పర విమర్శలు, సరిహద్దు సైనిక కదలికలు పెరిగే అవకాశం ఉందని రక్షణ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. తాలిబన్ కఠిన వైఖరి, పాక్ ప్రతిస్పందన తీరు ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణాన్ని పెంచాయి.