US Layoffs: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ).. ప్రస్తుతం అంతా దీనిదే. అన్నిరంగాల్లోనూ చొరబడిన ఏఐతో చాలా మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఐటీ కంపెనీలు ఇప్పటికే ఏఐపై పట్టు ఉన్నవారినే నియమించుకుంటున్నాయి. వీలైనంతవరకు మ్యాన్ పవర్ తగ్గించుకుంటున్నాయి. ఈ క్రమంలో అర్ధంతంరంగా ఉద్యోగాల నుంచి ఊడబీకేస్తున్నాయి. అయితే ఏఐ రంగంలో ఇటీవల నెలకొన్న ఉత్సాహం ఇప్పుడు ఆర్థిక సంక్షోభ సంకేతాలుగా మారుతోంది. అమెరికాలో టెక్నాలజీ ఆధారిత షేర్ల విలువలు ఒక్కసారిగా కూలిపోవడంతో పెట్టుబడిదారులు ఆందోళనలో మునిగిపోయారు. నాస్‌డాక్ సూచీ గత వారంలో నమోదుచేసిన పెద్ద పతనం, టెక్ రంగ భవిష్యత్తుపై కొత్త అనుమానాలు రేకెత్తించింది.
ఏఐ షేర్ల పతనం..
ఏఐ ఆధారిత షేర్లు గత రెండేళ్లలో అసాధారణంగా పెరిగాయి. వాటి వాస్తవ వృద్ధికి మించి మార్కెట్ విలువలు చేరుకోవడం ఇప్పుడు ప్రమాదకరంగా మారింది. అతివిలువల కారణంగా త్రైమాసిక ఫలితాలు అంచనాలను అందుకున్న సంస్థల షేర్లు కూడా క్షీణిస్తున్నాయి. పెట్టుబడిదారుల్లో విశ్వాసం తగ్గిపోవడంతో ఏఐ బెలూన్ బ్లాస్ అయిందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
టెక్ రంగంలో కలవరం
ఇటీవలికాలంలో ఐటీ సంస్థలు ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఉద్యోగాల్లో కోత విధిస్తున్నాయి. నిపుణులైన తక్కువ మందితో ఎక్కువ పని చేయించుకుంటున్నాయి. దీంతో ఐటీ ఉద్యోగాలకు ఈ రోజుల్లో భద్రత కరువైంది. ఇదే క్రమంలో ఏఐ షేర్ విలువ పడిపోవడంతో అక్టోబర్ నెలలో మాత్రమే అమెరికాలో 1.53 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇది గత రెండు దశాబ్దాలుగా ఒకే నెలలో చోటుచేసుకున్న అత్యధిక తొలగింపు. దీంతో 2025లో ఇప్పటి వరకు తొలగింపుల సంఖ్య 11 లక్షలు దాటింది. టెక్ సంస్థలతోపాటు రిటైల్, లాజిస్టిక్స్ రంగాలు కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నాయి. ఒకవైపు పెరుగుతున్న వ్యయాలు, మరోవైపు ఏఐ, ఆటోమేషన్ టెక్నాలజీలతో మానవ వనరుల అవసరం తగ్గిపోవడం కంపెనీలను ఉద్యోగాల కోత వైపు నెట్టింది. ఈ పరిణామాలు అమెరికా ఆర్థిక వ్యవస్థను మాంద్య దిశగా నడిపిస్తున్నాయని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ద్రవ్యోల్బణం భయాలు..
షేర్ల పతనం వెనుక ఉన్న అసలు కారణాల్లో ఒకటి అమెరికా ప్రభుత్వ అప్పు. ప్రస్తుతం దేశ ఋణభారం 38 ట్రిలియన్ డాలర్లను దాటింది. ఇది జీడీపీతో పోలిస్తే 324 శాతం, అంటే చరిత్రలోనే అత్యధిక స్థాయి. ఈ అప్పును నియంత్రించడంలో విఫలమైతే, అమెరికా మరో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోవచ్చని ఆర్థిక వర్గాలు హెచ్చరిస్తున్నాయి. దీంతో ద్రవ్యోల్బణం పెరుగుతుందనే భయంతో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మరింత పెంచే అవకాశం ఉందని భావిస్తున్నారు. వీటితోపాటు రాజకీయ అనిశ్చితి, రుణభారం, పెట్టుబడిదారుల్లో భయం.. ఇలా అన్నీ కలిపి మార్కెట్ నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయి.
ప్రపంచ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం
టెక్నాలజీ కంపెనీల షేర్ల పతనం అమెరికాకే పరిమితం కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతోంది. ఆసియా, యూరోపియన్ స్టాక్ మార్కెట్లు కూడా క్షీణత వైపు సాగుతున్నాయి. గ్లోబల్ పెట్టుబడిదారులు ప్రమాదం తగ్గించే వ్యూహాలతో మార్పులు చేపడుతున్నారు. ఆర్థిక నిపుణుల అభిప్రాయంలో, ఇది కేవలం తాత్కాలిక సవాలు కాదు, టెక్ రంగంలో జరగుతున్న కీలక మార్పు.
ఏఐ రంగం ఉత్సాహం ప్రపంచ వ్యాప్త పరిశ్రమల దృష్టిని ఆకర్షించినప్పటికీ, అధిక అంచనాలు, వేగవంతమైన పెట్టుబడులు, వాణిజ్య లెక్కల లోపం దీని బలహీనతగా మారాయి. మానవ వనరుల ఉద్యోగ క్షీణతతోపాటు షేర్ విలువల తగ్గుదల కూడా ఇదే బబుల్ ప్రభావమని నిపుణులు చెబుతున్నారు.