Kattera Henry Christina: ఏపీలో అధికార వైసీపీకి షాక్ లు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు పార్టీ ముఖ్యులు, ఎమ్మెల్సీలు రాజీనామా చేసి మరి పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. తొలిసారిగా జిల్లా పరిషత్తుల నుంచి రాజీనామాల పర్వం ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా జగన్ బస్సు యాత్ర చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాయలసీమలో బస్సు యాత్ర పూర్తి చేసుకున్న జగన్ గుంటూరులో అడుగుపెట్టారు. గుంటూరులో ఉండగానే ఆ జిల్లాకు చెందిన జిల్లా పరిషత్ చైర్ పర్సన్ హెనీ క్రిస్టినా వైసీపీకి రాజీనామా చేశారు. ఆమె భర్త సురేష్ కుమార్ తో కలిసి వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఎమ్మెల్యే టికెట్ దక్కనందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు.
వైసీపీలో టికెట్లు ప్రకటించిన నాటి నుంచి దంపతులిద్దరూ అసంతృప్తితో ఉన్నారు. పార్టీకి అంటి ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. హేనీ క్రిస్టీనా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా ఉండగా.. భర్త కత్తెర సురేష్ కుమార్ తాడికొండ నియోజకవర్గ ఇన్చార్జిగా ఉండేవారు. తాడికొండ ఎమ్మెల్యే ఉండవెల్లి శ్రీదేవి టిడిపిలో చేరిన తర్వాత నియోజకవర్గ బాధ్యతలను సురేష్ కుమార్ కు అప్పగించారు. దీంతో తాడికొండ నుంచి పోటీకి సురేష్ కుమార్ అన్ని విధాల సిద్ధపడ్డారు. అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ సీఎం జగన్ ఝలక్ ఇచ్చారు. తాడికొండ అభ్యర్థిగా మాజీ హోంమంత్రి మేకతోటి సుచరితను ప్రకటించారు. అప్పటినుంచి కత్తెర సురేష్ కుమార్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు.అయితే వ్యూహాత్మకంగా జగన్ జిల్లాలో ఉండగానే వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఇది ముందస్తు వ్యూహంతోనే చేసినట్లు తెలుస్తోంది.
మేమంతా సిద్ధం పేరిట సీఎం జగన్ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపడుతున్న సంగతి తెలిసిందే. కడప జిల్లా ఇడుపాలపాయలో ప్రారంభమైన బస్సు యాత్ర రాయలసీమలో విజయవంతంగా పూర్తయింది. ప్రస్తుతం గుంటూరు జిల్లాలో కొనసాగుతోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే దంపతులిద్దరూ రాజీనామా ప్రకటించారు. పార్టీ సభ్యత్వంతో పాటు పదవులను వదులుకున్నారు. త్వరలో వారు తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. సురేష్ కుమార్ కు క్రిస్టియన్ మైనారిటీ వర్గాల్లో మంచి పట్టు ఉంది. దీంతో గుంటూరు జిల్లాలో వైసీపీకి ఎదురు దెబ్బ తగిలినట్లు అయ్యింది. పార్టీ కోసం ఎంతో శ్రమించామని.. కానీ తమకు ఆ గుర్తింపు లభించలేదని దంపతులిద్దరూ ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లాలో మేయర్ రామయ్యకు ఎంపీ సీటు ఇవ్వలేదా? శ్రీకాకుళం జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్ పిరియా విజయకు టికెట్ ఇవ్వలేదా? వారు ప్రశ్నించారు. అందుకే పార్టీ నిర్ణయానికి నిరసిస్తూ తాము పదవులకు రాజీనామా చేసినట్లు వారు స్పష్టం చేశారు. అయితే సరిగ్గా జగన్ గుంటూరు జిల్లాలో ఉండగానే ఈ ప్రకటన రావడం.. అధికార పార్టీలో గుబులు రేపుతోంది. పార్టీ అధికారంలోకి వస్తుందని నమ్మకం లేక ఒక్కొక్కరు పార్టీని వీడుతున్నారని.. పదవులను సైతం విడిచి పెడుతున్నారని పార్టీలో ఒక రకమైన చర్చ నడుస్తోంది.