Kalki 2829 AD : విడుదల వేళ కల్కి 2829 AD టీమ్ కి ఊహించని దెబ్బ తగిలింది. కల్కి టికెట్స్ రేట్లు పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది. దీంతో కోర్టు తీర్పు పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కల్కి మూవీ భారీ బుడ్జెట్ మూవీ కావడంతో టికెట్స్ ధరలు పెంచుకునేలా ఏపీ ప్రభుత్వాన్ని నిర్మాతలు కోరారు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం అమలులో ఉన్న ధరలకు అధికంగా రేట్లు పెంచి టికెట్స్ అమ్ముకునేలా అనుమతులు జారీ చేసింది.
సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో రూ. 75, మల్టీఫ్లెక్స్ లలో రూ. 125 అదనంగా కల్కి టికెట్స్ పెంచుతూ అనుమతులు పొందారు. అయితే అదనపు ధరల అనుమతి రద్దు చేయాలని ఏపీ హై కోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలైంది. అత్యధిక ధరలకు సినిమా టికెట్స్ విక్రయించడం సరికాదు. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని పిటీషనర్లు కోరారు. కాగా ఏపీ హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణతో పోల్చితే ఏపీలో సినిమా టికెట్స్ ధరలు తక్కువ. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కల్కి టికెట్స్ ధరలు పెంచి విక్రయించేలా అనుమతులు ఇవ్వడమైంది. అదనంగా ధరలు పెంచాక టికెట్స్ ధరలు చుక్కల్లోకి చేరాయి. ప్రేక్షకులు ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారు. కల్కి చిత్రాన్ని దాదాపు రూ. 600 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. భారీ ఎత్తున ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. పాజిటివ్ టాక్ వస్తే బయ్యర్లు బయటపడతారు. లేదంటే నష్టాలు తప్పదు. నెగిటివ్ టాక్ సినిమాలకు వందల రూపాయలు ఖర్చు చేసి ఆడియన్స్ చూడరు.
దర్శకుడు నాగ్ అశ్విన్ కల్కి చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రభాస్,దీపికా పదుకొనె, కమల్ హాసన్, అమితాబ్ నటించారు. కల్కి మూవీ ట్రైలర్స్ ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా యూఎస్ లో కల్కి చిత్రానికి విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే కల్కి వసూళ్లు $4 మిలియన్ దాటేశాయి. లక్షన్నర టికెట్స్ అమ్ముడుపోయాయి. కల్కి చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్ లో అశ్వినీ దత్ నిర్మించాడు.