TANA Backpack Program: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహించే బ్యాక్‌ప్యాక్ కార్యక్రమం ఈసారి కూడా విజయవంతంగా జరిగింది. అమెరికాలోని కమ్యూనిటీకి తమ వంతు సేవ చేయాలన్న సంకల్పంతో తానా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. వాటిలో భాగంగానే చిన్నారులకు స్కూల్ బ్యాగులు, అవసరమైన విద్యా సామగ్రి అందజేయడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం.
Also Read: ‘విశ్వంభర’ సరికొత్త గ్లింప్స్ అదుర్స్..కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టినట్టు ఉంది!
ఈ సంవత్సరం ఆగస్టు 20న ఛార్లెట్‌లోని హార్నెట్ నెస్ట్ ఎలిమెంటరీ స్కూల్‌లో తానా నాయకులు 300 మందికిపైగా విద్యార్థులకు బ్యాక్‌ప్యాక్‌లను పంపిణీ చేశారు. బ్యాగ్‌లతో పాటు క్రేయాన్స్, ఎరేజర్స్, పెన్సిల్స్, షార్పనర్స్, పెన్లు వంటి విద్యా సరఫరాలను కూడా పిల్లలకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో తానా అప్పలాచియాన్ ప్రాంతీయ ప్రతినిధి రవి వడ్లమూడి (నాని), తానా స్పెషల్ ప్రాజెక్ట్స్ కో ఆర్డినేటర్ నాగమల్లేశ్వర పంచుమర్తి, తానా ఫౌండేషన్ ట్రస్టీ ఠాగూర్ మల్లినేని, తానా టీమ్ స్క్వేర్ చైర్మన్ కిరణ్ కొత్తపల్లి, తానా హెల్త్ సర్వీసెస్ కో ఆర్డినేటర్ మాధురి ఏలూరి, తానా రైతుకోసం చైర్ రమణ అన్నే పాల్గొన్నారు.

స్కూల్ నిర్వాహకులు, టీచర్లు మాట్లాడుతూ “తానా మా స్కూల్ ను ఎంపిక చేసుకుని విద్యార్థులకు స్కూల్ బ్యాగులు అందజేయడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇలాంటి సేవా కార్యక్రమాలు పిల్లల్లో విద్యపై ఆసక్తి పెంచుతాయి” అని అభినందించారు.

పిల్లల తల్లిదండ్రులు కూడా తానా కమ్యూనిటీకి తమ కృతజ్ఞతలు తెలిపారు. తానా నిర్వాహకులు మాట్లాడుతూ “అమెరికాలో మన కమ్యూనిటీ మనపై చూపుతున్న ఆదరణకు కృతజ్ఞతగా, ప్రతి ఏడాది సామాజిక సేవా కార్యక్రమాలు చేపడతాం. వాటిలో భాగంగానే ఈ బ్యాక్‌ప్యాక్ ప్రాజెక్ట్ కొనసాగుతోంది” అని చెప్పారు. మొత్తంగా ఈ కార్యక్రమం ఉత్సాహంగా, విజయవంతంగా ముగిసింది.
