America: అమెరికాలో భారతీయుల మరణ మృదంగం మోగుతూనే ఉంది. ఇప్పటికే ఈ ఏడాదిలో వివిధ కారణాలతో 11 మంది విద్యార్థులు మృత్యువాత పడ్డారు. తాజాగా శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థులు దుర్మరణం చెందారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణానికి చెందిన డాక్టర్ స్వాతి–డాక్టర్ నవీన్ దంపతులు కుమారుడు నివేశ్(20), జనగామ జిల్లా స్టేషన్ గన్‌ఫూర్‌కు మండలం శవునిపల్లికి చెందిన స్వర్ణకారుడు పార్శి కమల్‌కుమార్, పద్మ దంపతుల కుమారుడు గౌతమ్‌కుమార్(19) అమెరికాలోని అరిజోనా స్టేట్ విశ్వవిద్యాలయంలో ఈటెక్ సెకండియర్ చదువుతున్నారు.
సెలవు రోజు బయటకు వెళ్లి..
శని, ఆదివారం సెలవు కావడంతో ఇద్దరితోపాటు మరో ఇద్దరు కలిసి కారులో వాటర్ ఫాల్స్ చూసేందుకు వెళ్లారు. వీరు ప్రయాణిస్తున్న కారును ఫినిక్స్ పరిధిలోని మెట్రోటైన్ సెంటర్ వద్ద ఓ ట్రక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో గౌతమ్, నివేశ్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు విద్యార్థులు గాయాలతో అక్కడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై ఆరిజోనా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నెల రోజులైతే ఇండియాకు..
గౌతమ్‌కుమార్ ఇండియాకు తిరిగి రావడానికి మే 22న టికెట్ బుక్ చేసుకున్నాడు. నెలరోజులైతే ఇంటికి వచ్చి తమతో సంతోషంగా గడుపుతాడనుకున్న గౌతమ్ తల్లిదండ్రులకు ఆరియానా పోలీసులు యాక్సిడెంట్ సమాచారం అందించడంతో గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. ఉన్నత చదువులు చదివి ప్రయోజకుడవుతాడనుకున్న కొడుకు మరణ వార్త ఆ కుటుంబంలో విషాదం నింపింది. గౌతమ్‌కుమార్ మృతదేహం స్వగ్రామం చేరుకోవడానికి రెండు రోజుల సమయం పడుతుందని కుటుంబ సభ్యులకు పోలీసులు తెలిపారు. నివేశ్ మృతదేహాన్ని హుజూరాబాద్‌కు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.