Latha Mangipudi: కమలా హ్యారిసే గెలుస్తుంది… మహిళా శక్తి గెలిపిస్తుంది.. ఎన్‌ఆర్‌ఐ లత మంగిపూడి!

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో సమీకరణలు వేగంగా మారుతున్నాయి. డెమోక్రటిక్‌ అభ్యర్థిగా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ ఉన్నన్ని రోజులు ట్రంప్‌ వైపే అమెరికన్లు మొగ్గు చూపారు. తర్వాత ట్రంప్‌పై కాల్పులు జరగడంతో ఆదరణ మరింత పెరిగింది. అయితే కమలా హ్యారిస్‌ రేసులోకి రావడంతో బలా బలాలు మారుతున్నాయి.

Written By: Raj Shekar, Updated On : August 9, 2024 1:47 pm

Latha Mangipudi

Follow us on

Latha Mangipudi: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలకు గడువు సమీపిస్తోంది. దీంతో అధికార డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్, ప్రతిపక్ష రిపబ్లిక్‌ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బరిలో ఉన్నారు. ఇద్దరి మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. ఇద్దరూ ప్రచారం జోరు పెంచారు. ఇదిలా ఉంటే.. డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థిగా మొదట అధ్యక్షుడు బైడెన్‌ను ప్రకటించారు. అయితే అమెరికన్లు అతనిపై ఆసక్తి చూపలేదు. పాలన బాగున్నా.. బైడెన్‌ మతిమరుపు, వృద్ధాప్య సమస్యల కారణంగా అతనికి ఓటు వేయడానికి ఇష్టపడలేదు. ఇక ట్రంప్‌ పాలనను గతంలోనే చూశారు. దీంతో ఆయనను కూడా వద్దనుకున్నారు. అయితే గుడ్డిలో మెల్ల అన్నట్లు బైడెన్‌ కన్నా ట్రంప్‌ బెటర్‌ అన్న అభిప్రాయం వ్యక్తమైంది. దీంతో బైడెన్‌ను మార్చాలన్న ఒత్తిడి పెరిగింది. పార్టీకి ఆర్థికసాయం చేసేవాళ్లు, వివిధ రాష్ట్రాల గవర్నర్లు కూడా బైడెన్‌ తప్పుకోవాలని సూచించారు. ఈ క్రమంలో డొనాల్డ్‌ ట్రంప్‌పై కాల్పులు జరగడంతో బైడెన్‌పై వ్యతిరేకత మరింత పెరిగింది. ట్రంప్‌కు ఆదరణ అనూహ్యంగా పుంజుకుంది. ఈనేపథ్యంలో బైడెన్‌ తప్పుకోవాలన్న ఒత్తిళ్లు మరింత పెరిగాయి. ఈ క్రమంలో బైడెన్‌కు కోవిడ్‌ రావడం, ఆయన çహోం ఐసోలేషన్‌కు వెళ్లడం చకచకా జరిగాయి. అక్కడే ఆయన పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో కమలా హ్యారిస్‌ రేసులోకి వచ్చారు. దీంతో అనూహ్యంగా డెమోక్రటిక్‌ పార్టీ బలం పుంజుకుంది. అధ్యక్ష అభ్యర్థిగా పార్టీ కూడా దాదాపు ఖరారు చేసింది. దీంతో ప్రచారంలో కమలా దూసుకుపోతోంది.

పెరుగుతన్న ఎన్నారైల మద్దతు..
ఇక కమలా హ్యారిస్‌ అభ్యర్థి అయ్యాక మహిళలు, ఎన్నారైల మద్దతు ఆమెకు పెరుగుతోంది. తాజాగా డెమోక్రటిక్‌ పార్టీ లెజిస్లేటర్‌గా ఉన్న ఎన్నారై లత మంగిపూడి కమల ప్రచారంలో పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో కమలా హ్యారిస్‌ గెలుస్తుందని తెలిపారు. ఆమె గెలుపు మహిళా శక్తిని నిరూపిస్తుందని పేర్కొన్నారు. హ్యారిస్‌ గెలుపు కోసం అహర్నిశలూ కృషి చేస్తామని తెలిపారు. అమెరికాలో ప్రజాస్వామ్యానికి, నియంతృత్వానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు ఇవని తెలిపారు. అమెరికన్లు మరోసారి ట్రంప్‌ నియంతృత్వ పాలన కోరుకోవడం లేదని తెలిపారు. కమలా గెలిస్తే ప్రజాస్వామ్యానికి మనుగడ అన్నారు. అందుకే సేవ్‌ డెమోక్రసీ నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నట్లు చెప్పారు.

మైసూర్‌కు చెందిన లత..
ఇక లత మంగిపూడి సొంత రాష్ట్రం కర్ణాటక. మైసూర్‌కు చెందిన లత రాజమండ్రికి చెందిన కృష్ణ మంగిపూడిని వివాహం చేసుకున్నారు. 1985లో అమెరికా వెళ్లి స్థిరపడ్డారు. అనంతరం యూఎస్‌ ఇండియా పొలిటికల్‌ యాక్షన్‌ కమిటీ న్యూహ్యాంప్‌షైర్‌ చాప్టర్‌కు 2006 నుంచి 2013 వరకు చైర్‌పర్సన్‌గా ఉన్నారు. అలా రాజకీయాల్లోకి వచ్చారు. అప్పటి అధ్యక్షుడు ఒబామా, హ్లిరీ క్లింటన్‌ వంటి ప్రముఖులతో సత్సంబంధాలు ఉన్నాయి. 2013 నుంచి ఇప్పటి వరకు నాషువా నుంచి లెజిస్లేలటర్‌గా గెలుపొందుతూ వస్తున్నారు. కమలా హ్యారిస్‌ గెలుపు కోసం హోరాహోరీగా ప్రచారం సాగిస్తున్నారు.

స్త్రీల హక్కులకు విఘాతం..
ప్రపంచంలో ఏ మహిళకైనా శరీరంపై తనకు పూర్తి హకు ఉండాలంటారు లత. తన ఆరోగ్యాన్ని కాపాడుకునే అవకాశం ఉండాలని పేర్కొంటారు. అమెరికా పరిణామాలు ఆందోళనకు గురిచేస్తున్నాయని తెలిపారు. పిల్లల్ని కనాలా వద్దా అనే అత్యంత కీలకమైన అంశంపైన మహిళలు హక్కు కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గర్బం దాల్చిన తర్వాత తప్పనిసరిగా బిడ్డను కనాల్సిందే అని తెలిపారు. కానీ బిడ్డును కనేందుకు మహిళ మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. ఇందులో ప్రభుత్వ జోక్యం ఉండొద్దని అభిప్రాయపడ్డారు.

ఇంకా వివక్షే..
ఇదిలా ఉంటే.. విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో మహిళలకు పురుషులతో సమాన అవకాశాలు లభించడం లేదని తెలిపారు. స్త్రీలు తీవ్ర నిర్లక్ష్యానికి, వివక్షకు గురవుతున్నట్లు తెలిపారు. చివరకు కొన్నిచోట్ల ఓటుహక్కును కూడా వినియోగించుకునే పరిస్థితి లేదన్నారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేయాలని కోరారు. రిపబ్లికన్‌ పార్టీ గెలిస్తే మహిళల స్వేచ్ఛ మరింత తగ్గుతుందని పేర్కొన్నారు. ఓటు వేసే హక్కు కూడా కోల్పోతారని తెలిపారు.