Director Vamsi : తన సినిమాల్లో గోదావరి నేపథ్యాన్ని పెద్దపీట వేశారు దర్శకుడు వంశీ. ఆయన తీసే ప్రతి సినిమాలోని గోదావరి అందాలను చూపించేందుకు ప్రయత్నించారు. ఆయన తీసిన మంచు పల్లకి, సితార, లేడీస్ టైలర్, డిటెక్టివ్ నారద, చెట్టు కింద ప్లీడర్, గోపి గోపిక గోదావరి.. వంటి 18 సినిమాలను గోదావరి తీరంలోనే చిత్రీకరించారు. ఇందులో సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. గత కొద్దిరోజులుగా సినిమాలకు గ్యాప్ ఇచ్చారు వంశీ. తన సినిమాల్లో సంగీతానికి పెద్ద పీట వేసేవారు. ఇళయరాజా, కీరవాణి వంటి మెలోడీ సంగీత దర్శకులతో.. ఉత్తమ బాణీలను సమకూర్చుకొని తన సినిమాల్లో ఉండేలా చూసుకునేవారు వంశీ. అయితే గోదావరి తీరాల ప్రాధాన్యతను అభివర్ణిస్తూ ఈ పాటలు సాగేవి. అందుకే ఇప్పటికీ ప్రజాదరణ పొందుతున్నాయి. అయితే ఇటీవల సినిమాలకు గ్యాప్ ఇచ్చిన దర్శకుడు వంశీ గోదావరి జిల్లాలో సడన్ గా కనిపించారు. దీంతో అందరూ ఆయన దర్శకత్వంలో మరో సినిమా వస్తుందని ఆశించారు. కానీ పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవంలో కూలిపోయిన సినిమా చెట్టును పరిశీలించేందుకు వచ్చారని తెలియడంతో నిరాశకు గురయ్యారు. గోదావరి నది ప్రవాహానికి గట్టు కోతకు గురైంది. గట్టుపై ఉన్న నిద్ర గన్నేరు చెట్టు నేలకొరిగింది. 150 సంవత్సరాల కిందట నాటి చెట్టు.. ఎన్నో సినిమాల్లో కనిపించింది. దాదాపు 300 సినిమాల్లో చెట్టు కింద సన్నివేశాలు, పాటలు కనిపిస్తాయి. ప్రధానంగా సీతారామయ్యగారి మనవరాలిలో కీలక సన్నివేశాలను ఈ చెట్టు కింద చిత్రీకరించారు.
* చాలా సినిమాలు ఇక్కడే
తెలుగు టాప్ మోస్ట్ దర్శకుల సినిమాలన్నీ ఈ చెట్టు కింద షూటింగ్ పూర్తి చేసుకున్నాయి. అందుకే కుమారదేవం చెట్టు అంటే తెలుగు సినీ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ చెట్టు కూలిపోయిందన్న విషయాన్ని తెలుసుకున్న దర్శకుడు వంశీ పరిశీలించేందుకు ఆ ప్రాంతానికి వచ్చారు. కూలిపోయిన చెట్టును చూసి భావోద్వేగానికి గురయ్యారు. ఈ చెట్టుతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ చెట్టుతో కుమారదేవం గ్రామానికి ఎంతో కీర్తి ప్రతిష్టలు వచ్చాయని కూడా చెప్పుకొచ్చారు. తన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ చిత్రాలు ఈ చెట్టు కింద షూటింగ్ చేసుకున్న విషయాన్ని కూడా వంశీ గుర్తు చేశారు. అందుకే ఒకసారి చూసి పోదామని వచ్చినట్లు చెప్పారు.
* బతికించే ప్రణాళిక సిద్ధం
మరోవైపు కుమారదేవం సినిమా చెట్టును బతికించే ప్రణాళిక సిద్ధమైంది. ఇందుకు సంబంధించి గురువారం పనులకు శ్రీకారం చుట్టారు. 153 సంవత్సరాల క్రితం ప్రకృతి ప్రేమికుడు సింగలూరి తాతబ్బాయి ఈ నిద్ర గన్నేరు చెట్టును నాటారు. నాడు నాటిన మొక్క మహావృక్షంగా మారి.. గోదావరి తీరంలో పచ్చదనంతో పాటు ఆహ్లాదాన్ని నింపింది. సినీ వృక్షంగా మారింది. ఘన చరిత్ర కలిగిన ఈ చెట్టు పడిపోవడంతో రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి ఐకాన్స్ చాప్టర్ ప్రెసిడెంట్ తీగల రాజా స్పందించారు. రోటరీ బృందం కుమారదేవం చెట్టును పునర్జీవం పోసినందుకు ముందుకు వచ్చింది.
* కెమికల్ ట్రీట్మెంట్
ప్రత్యేక ప్రక్రియ ద్వారా ఈ మహా వృక్షానికి జీవం అందించనున్నారు. కెమికల్ ట్రీట్మెంట్ ప్రణాళిక అమలు చేస్తారు. ముందుగా చెట్టు కొమ్మలను తొలగిస్తారు. నిపుణుల పర్యవేక్షణలో చెట్టు వేరుకు రసాయనాలు పంపించి శాస్త్రీయ విధానంలో నిలబెడతారు. సుమారు 100 టన్నుల బరువు ఉన్న ఈ చెట్టును పూర్వస్థితికి తెచ్చేందుకు నెల నుంచి 45 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. దర్శకుడు వంశీ రాకతో పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి తరలి వచ్చారు.