https://oktelugu.com/

America: అమెరికాలో మరో విద్యార్థి దుర్మరణం.. పట్టా స్వీకరించిన సంతోషం ఆవిరి!

ఖమ్మంలోని మాంటిస్సోరి పాఠశాలల డైరెక్టర్‌ లక్కిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ఏకైక కుమారుడు రాకేశ్‌(24). రెండేళ్ల క్రితం బీటెక్‌ పూర్తి చేశాడు. అమెజాన్‌ కంపెనీలో జావ్‌ వచ్చింది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : May 12, 2024 / 09:32 AM IST

    America

    Follow us on

    America: బీటెక్‌ పూర్తి చేశాడు.. మల్టీనేషనల్‌ కంపెనీలో మంచి వేతనంతో కూడిన ఉద్యోగానికి ఎంపికయ్యాడు. కానీ ఉన్నత విద్య చదవాలన్న ఉద్దేశంతో వచ్చిన ఉద్యోగం కాదనుకున్నాడు. ఎంఎస్‌ చేయడానికి అమెరికా వెళ్లాడు. ఇటీవలే చదువు పూర్తి చేశాడు. కాలేజీలో నిర్వహించిన కాన్వకేషన్‌ కార్యక్రమంలో తల్లిదండ్రుల సమక్షంలో పట్టా అందుకోవాలనుకున్నాడు. వారిని కూడా అమెరికా రావాలని కోరాడు. అంతా అనుకున్నట్లే జరిగింది. తల్లిదండ్రులు సమక్షంలో పట్టా స్వీకరించాడు. అతని ఆనందం చూసి విధికి కన్ను కుట్టినట్లు ఉంది. పట్టా స్వీకరించిన సంతోషంలో మిత్రులతో కలిసి విహార యాత్రకు వెళ్లిన యువకుడు జలపాతంలో మునిగి మృతిచెందాడు. చదువు పూర్తి చేసుకున్న కొడుకుతో కలిసి స్వదేశానికి వద్దామనుకున్న తల్లిదండ్రులు ఇప్పుడు విగతజీవిగా మారిన కొడుకును తీసుకుని ఇండియాకు ఎలా వెళ్లాలని కన్నీరు మున్నీరవుతున్నారు.

    ఖమ్మం జిల్లా యువకుడు..
    ఖమ్మంలోని మాంటిస్సోరి పాఠశాలల డైరెక్టర్‌ లక్కిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ఏకైక కుమారుడు రాకేశ్‌(24). రెండేళ్ల క్రితం బీటెక్‌ పూర్తి చేశాడు. అమెజాన్‌ కంపెనీలో జావ్‌ వచ్చింది. అయినా దానిని కాదనుకుని ఎంఎస్‌ చేయాలని అమెరికా వెళ్లాడు. అక్కడ అరిజోనా యూనివర్సిటీలో ఎంఎస్‌ ఇటీవలే పూర్తి చేశాడు. వారం క్రితం పట్టా స్వీకరించాడు. తమ కొడుకు ఎదుగుదలను కళ్లారా చూసేందుకు వెళ్లిన తల్లిదండ్రులు మురిసిపోయారు. ప్రస్తుతం వారు అక్కడే ఉన్నారు.

    విహార యాత్ర విషాదం..
    ఎంఎస్‌ విజయవంతంగా పూర్తి కావడంతో రాకేశ్‌ తన స్నేహితులతో కలిసి ఈనెల 8న అమెరికాలోని ఫాసిల్‌ క్రీక్‌ జలపాతం చూసేందుకు విహారయాత్రకు వెళ్లాడు. అక్కడ సరదాగా గడుపుతుండగా రాకేశ్‌తోపాటు మరో యువకుడు ప్రమాదవశాత్తు జారి జలపాతంలో పడిపోయారు. నీటిలో ముగిని మృతిచెందారు. రెస్క్యూ సిబ్బంది గాలించి 25 అడుగుల లోతులో మృతదేహాలను గుర్తించి వెలికి తీశారు. రాకేశ్‌తోపాటు మృతిచెందిన మరో యువకుడి వివరాలు తెలియలేదు.

    ఒక్కకగానొక్క కొడుకు మరణంతో..
    ఒక్కగానొక్క కొడుకున్న ఉన్నత స్థాయిలో చూడాలన్న ఉద్దేశంతో తల్లిదండ్రులు అతను ఏదడిగినా కాదనకుండా చదవించారు. కానీ విధి చూసిన చిన్న చూపుతో చేతికి వచ్చిన కొడుకు విగత జీవిగా మారడంతో ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. తమ బాధ్యత తీరింది అనుకుంటున్న తరుణంలో దేశం కాని దేశంలో కొడుకు మృతిచెందడంతో వారిని ఓదార్చడం ఎవరితరం కావడం లేదు.