
విదేశాల్లో చదువులైనా.. ఉద్యోగమైనా.. భారతీయుల ఫస్ట్ ఛాయిస్ అమెరికానే. ఆ తర్వాతనే ఇతర దేశాలు అన్నట్టుగా ఉండేది. కానీ.. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. క్రమంగా అమెరికాను వదిలేస్తున్నారు. యూఎస్ కు గుడ్ బై చెబుతూ.. కెనడాకు జై కొడుతున్నారు. రానురానూ ఈ పరిస్థితి పెరుగుతోంది. అటు కెనడా కూడా సాదరంగా వెల్కమ్ చెబుతోంది. మరి, ఈ పరిస్థితికి కారణమేంటీ? అన్నది చూద్దాం.
భారతీయుల్లో ప్రతిభావంతులుగా ఉన్నవారంతా విదేశాలకు వెళ్లిపోతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి వారంతా గతంలో అమెరికాను ఎంచుకునేవారు. కానీ.. ఇప్పుడు మాత్రం కెనడాకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. దీనికి అమెరికా విధానాలే కారణంగా చెబుతున్నారు. ప్రధానంగా.. హెచ్1 బీ వీసాలు జారీచేసే విషయంలో అమెరికా వ్యవహరిస్తున్న తీరు కారణంగానే.. భారతీయ నిపుణులు అమెరికాను వదిలేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థుల్లో అత్యధికంగా చైనా వాళ్లు ఉన్నారు. ఆ తర్వాత స్థానం భారతీయులదే. ప్రస్తుతం సుమారు 1.93 లక్షల మంది విద్యార్థులు అమెరికాలో ఉన్నారు. అయితే.. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు అయిన తర్వాత.. వీసాలు జారీచేయడం గణనీయంగా తగ్గిపోయింది. విద్యార్థులతోపాటు అమెరికాలో ఉద్యోగం చేసుకోవాలనే వారి పరిస్థితి కూడా ఆందోళనకరంగా తయారైంది.
ఇక, కరోనా నేపథ్యంలో 2019 నుంచి 2020 మధ్య విద్యార్థుల వీసాలను ఏకంగా 64 శాతం మేర తగ్గించారు. 2019 ఆర్థిక సంవత్సరంలో 4.4 శాతం భారత విద్యార్థులకు అమెరికా వీసా ఇవ్వలేదు. అక్కడి యూనివర్సిటీల్లో అడ్మిషన్ తీసుకున్న తర్వాత ఈ పరిస్థితి రావడం గమనార్హం. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఈ వివరాలు వెల్లడించింది.
విద్యార్థుల పరిస్థితి ఇలా ఉంటే.. ఉద్యోగుల పరిస్థితి మరో విధంగా ఉంది. అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలని భావించే వారికి గ్రీన్ కార్డు మంజూరు చేయడానికి సైతం ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గడిచిన దశాబ్ద కాలంలో దాదాపు 20 లక్షల మంది గ్రీన్ కార్డు అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నాయి. దీంతో.. గ్రీన్ కార్డు ఎప్పుడో వస్తుందో.. అసలు వస్తుందో రాదో.. అనే టెన్షన్ మొదలైంది. ఈ కారణాలతోనే కెనడా వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు భారతీయులు. ఇలాంటి వారి సంఖ్య రానురానూ పెరుగుతోందట. ఇదేసమయంలో.. అటు కెనడా నుంచి మంచి ఆఫర్లు ఉండడం.. ఎలాంటి చిక్కులూ పెద్దగా లేకపోవడంతో.. అందరూ ఆ దేవం వెళ్లేందుకే సిద్ధమవుతున్నారు.