Alaska missing student : ప్రకృతి అందాలను ఆస్వాదించాలని వెళ్లిన ఒక తెలుగు విద్యార్థి ఇప్పుడు మంచు కొండల మధ్య ఆచూకీ లేకుండా పోయాడు. గుంటూరు జిల్లా అద్దంకికి చెందిన హరి కరసాని అమెరికాలోని అలాస్కా రాష్ట్రంలో అదృశ్యం కావడం ఇప్పుడు అటు అమెరికాలోని తెలుగు సంఘాలను.. ఇటు ఆంధ్రప్రదేశ్‌లోని ఆయన కుటుంబాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
అసలేం జరిగింది?
హ్యూస్టన్‌లో నివసిస్తున్న హరి కరసాని క్రిస్మస్ సెలవుల నేపథ్యంలో డిసెంబర్ 22, 2025న ఒంటరిగా అలాస్కా పర్యటనకు వెళ్లారు. అక్కడ డెనాలి సమీపంలోని ఒక హోటల్‌లో బస చేశారు. జనవరి 3 లేదా 4 నాటికి తిరిగి వస్తానని తన రూమ్‌మేట్స్‌కు సమాచారం ఇచ్చారు. అయితే డిసెంబర్ 30న చివరిసారిగా స్నేహితులతో మాట్లాడిన హరి ఆ మరుసటి రోజు డిసెంబర్ 31 హోటల్ నుంచి చెక్-అవుట్ అయ్యారు. అప్పటి నుండి ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది.
* మిస్టరీగా మారిన ‘లిఫ్ట్’ ప్రయాణం
ఈ కేసులో అత్యంత కీలకమైన అంశం హరి క్రెడిట్ కార్డ్ లావాదేవీలు. డిసెంబర్ 31న ఆయన హోటల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక క్యాబ్ సర్వీస్ వాడినట్లు సమాచారం అందుతోంది. డ్రైవింగ్ రాకపోవడం.. హరికి సొంతంగా కారు నడపడం రాదు. దీనివల్ల ఆయన పూర్తిగా క్యాబ్‌లు లేదా స్థానిక రవాణాపైనే ఆధారపడాల్సి వచ్చింది. హోటల్ నుంచి బయలుదేరిన హరి ఆ క్యాబ్‌లో ఎక్కడికి వెళ్లారు? ఆ డ్రైవర్ ఎవరు? అన్న కోణంలో దర్యాప్తు జరుగుతోంది.
మైనస్ 40 డిగ్రీల మృత్యు చలి
ప్రస్తుతం అలాస్కాలో ఉష్ణోగ్రతలు మైనస్ 40 డిగ్రీల ఫారెన్‌హీట్‌కు పడిపోయాయి. ఇలాంటి వాతావరణంలో కేవలం కొన్ని నిమిషాల పాటు బయట ఉన్నా చర్మం గడ్డకట్టడం, హైపోథర్మియా వంటి ప్రాణాంతక స్థితి ఏర్పడుతుంది. ఒంటరిగా ప్రయాణించడం, సరైన నెట్‌వర్క్ లేకపోవడం వల్ల సహాయం కోరడం కూడా కష్టమవుతుంది.
ఆందోళనలో కుటుంబ సభ్యులు
గత వారం రోజులుగా హరి నుంచి ఎటువంటి ఫోన్ కాల్స్ లేకపోవడం, సోషల్ మీడియాలో యాక్టివిటీ ఆగిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. అమెరికాలోని స్థానిక పోలీసులు, తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు హరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. “ఒకవైపు తీవ్రమైన మంచు తుపానులు, మరోవైపు మైనస్ 40 డిగ్రీల చలి.. ఈ పరిస్థితుల్లో హరి క్షేమంగా తిరిగి రావాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాం” అని ఆయన స్నేహితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విదేశాల్లో ఉన్న విద్యార్థులకు హెచ్చరిక
ఈ ఘటన విదేశాల్లో ఉన్న భారతీయ విద్యార్థులకు ఒక హెచ్చరికగా మారింది. ముఖ్యంగా చలి ఎక్కువగా ఉండే ప్రాంతాలకు వెళ్లేటప్పుడు, ఒంటరి ప్రయాణాలు చేయవద్దని, ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులకు లోకేషన్ షేర్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
హరి కరసాని ఆచూకీ త్వరగా లభించాలని, ఆయన క్షేమంగా ఇంటికి చేరుకోవాలని కోరుకుందాం.