
ఓ బాలికను కాపాడబోయి 30 మంది బావిలో పడ్డ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కలకలం రేపింది. అయితే వీరిలో నలుగురు మృతి చెందగా 19 మంది ప్రాణాలతో బయటపడ్డారు. మధ్యప్రదేశ్లోని విదిశ జిల్లాలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. విదిశ జిల్లా గంజ్ బసోడ గ్రామంలో గురువారం రాత్రి ఓ బాలిక ప్రమాదవశాత్తూ అక్కడే ఉన్న బావిలో పడిపోయింది. ఈ విషయం తెలిసిన స్థానికులు బాలిక బంధువులకు సమాచారం అందించారు. దీంతో బాలికను కాపాడేందుకు స్థానికులతో పాటు బంధువులు కొంత మంది బావిలోకి దిగారు.
50 అడుగుల లోతున్న బావిలో 20 అడుగుల వరకు నీరుంది. అయితే బాలికను రక్షించేందుకు దిగిన వారికి సాయం చేసేందుకు మరికొంత మంది బావి గోడవద్ద నిల్చున్నారు. ఈక్రమంలో బావిగోడ అనుకోకుండా కూలిపోయింది. ఇలా 30 మంది ఒకరిపై ఒకరు బావిలో పడ్డారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇదిలా ఉండగా బావి పక్కనే వీరికి సహాయం చేసేందుకు ట్రాక్టర్ ను ఉంచారు. అందులో నలుగురుపోలీసులు ఉన్నారు.
దీంతో ఆ ట్రాక్టర్ ఉన్న ప్లేసు కుంగిపోవడంతో వారు కూడా బావిలో పడిపోయారు. ఇలా 30 మంది బావిలో పడిపోయారు. వెంటనే ఎన్టీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టింది. వీరిలో నలుగురు మృతి చెందారు. 19 మంది ప్రాణాలతో బయటపడ్డారు. మిగతా వారి కోసం సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
ఈ సంఘటన తెలుసుకున్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహణ్ తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల నష్టపరిహారం ప్రకటించారు. అలాగే గాయపడ్డవారికి రూ.50 వేల చొప్పున ఇవ్వనున్నట్లు తెలిపారు.