https://oktelugu.com/

America : అమెరికాలో పిడుగు.. తెలుగు విద్యార్థిని ఆశలను చిదిమేసింది! 

ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన తెలుగు విద్యార్థిని అక్కడ పిడుగుపాటుకు గురైంది. పార్కులో స్నేహితులతో నడుచుకుంటూ వెళ్తుండగా పిడుగు పడింది. ప్రస్తుతం ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతోంది.

Written By: , Updated On : July 21, 2023 / 05:28 PM IST
Follow us on

America : ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన తెలుగు విద్యార్థిని అక్కడ పిడుగుపాటుకు గురైంది. పార్కులో స్నేహితులతో నడుచుకుంటూ వెళ్తుండగా పిడుగు పడింది. ప్రస్తుతం ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతోంది. ఊహించని పరిణామంతో ఒక్కసారిగా కుదేలైన బాధితురాలి గుండె లయ తప్పింది. దీంతో మెదడు డ్యామేజీ అయి ప్రస్తుతం ఆమె జీవన్మరణ పోరాటం చేస్తోంది.

హ్యూస్టన్‌ యూనివర్సిటిలో.. 
 వివరాల్లోకి వెళ్తే.. భారత్‌ కు చెందిన సుశ్రూణ్య కోడూరు(25) యూనివర్సిటీ ఆఫ్‌ హ్యూస్టన్‌లో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మాస్టర్స్‌ చేస్తోంది. జులై మొదటివారంలో ఆమె తన స్నేహితులతో కలిసి స్థానిక పార్కులోని ఓ కొలను వెంబడి నడుచుకుంటూ వెళ్తుంది. అప్పటికే వాతావరణం ముసురుపెట్టి చిన్నగా వాన మొదలైంది. క్రమంగా పెరిగిన వాన ఉరుములు, మెరుపులతో జడివానగా మారింది. ఊహించనివిధంగా సుశ్రూణ్యపై పిడుగుపడింది. దీంతో, ఆమె పక్కనే ఉన్న కొలనులో పడిపోయింది. సుమారు 20 నిమిషాల పాటు గుండె లయతప్పడంతో సుశ్రూణ్య మెదడు దెబ్బతిని కోమాలోకి వెళ్లిపోయింది.
సుదీర్ఘ చికిత్సతో కోరుకునే చాన్స్‌…
సుదీర్ఘకాలం చాలా కీలకమైన వైద్యచికిత్స అందించాల్సి ఉంటుందని సుశ్రూణ్య బంధువు సురేంద్రకుమార్‌ కొత్త తెలిపారు. ఈ మేరకు ఆమె వైద్యఖర్చుల కోసం, అలాగే కుటుంబసభ్యులను పిలిచేందుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని కోరుతూ ఆన్‌లైన్‌లో ‘గోఫండ్‌మీ’ని ఏర్పాటు చేశారు. సుశ్రూణ్య పిడుగుపాటుకు గురైన వెంటనే కొలనులో పడిపోయారని, ఆ సమయంలో 20 నిమిషాలపాటు గుండె లయ తప్పడంతో మెదడు దెబ్బతిన్నట్లు సురేంద్ర తెలిపారు. తర్వాత ఆమె కోమాలోకి వెళ్లిపోయిందని వెల్లడించారు.
పిడుగుల వర్షంతో అలజడి.. 
అమెరికాలో పిడుగులతో కూడిన వర్షాలు అలజడి సృష్టిస్తున్నాయి. దీనివల్ల అక్కడ చాలా విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. మరికొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. అమెరికాలోని ఈశాన్య ప్రాంతంలో వర్షాలు దారుణంగా కురుస్తున్నాయి. దానికి తోడు పిడుగులు పడుతున్నాయి. పరిస్థితి ఏమీ బాగాలేదని చెబుతోంది అక్కడి ఫెడరల్‌ అడ్మినిస్ట్రేషన్‌. జన జీవనానికి ఏమీ ఇబ్బంది కలగకపోయినా.. విమానాలు తిరగడానికి మాత్రం అనుకూలంగా లేదని అంటోంది. దీంతో ఈశాన్య ప్రాంతంలో 1,320 విమాన సర్వీసులు రద్దయ్యాయి. న్యూజెర్సీ, న్యూయార్క్‌ లిబర్టీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కూడా విమానాలు వెళ్లడం లేదు. మొత్తంగా అమెరికాలో 2,600 విమానాల సర్వీసులు రద్దు చేశారు. మరో 8 వేల ఫ్లైట్‌లు ఆలస్యంగా నడుస్తున్నాయి.
వరద హెచ్చరికలు.. 
మరోవైపు న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్, పెన్సిల్వేనియా, మాసాచుసెట్స్, వెర్మాంట్‌ ప్రాంతాల్లో వరద హెచ్చరికలను కూడా జారీ చేశారు. ఈ ప్రాంతాల్లో మెరుపులు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడతాయని చెబుతున్నారు. దాంతోపాటూ కొన్నిచోట్ల టోర్సడోలు వచ్చే అవకాశం కూడా ఉందని హెచ్చరికలు జారీ చేశారు. ఈశాన్యం ఇలా ఉంటే అమెరికా దక్షిణం వైపు మాత్రం ఎండలు దంచికొడుతున్నాయి. కాలిఫోర్నియా నుంచి టెక్సాస్‌ దాకా రికార్డ్‌ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణం కంటే 10 లేదా 20 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని అక్కడి జాతీయ వాతావరణ సంస్థ తెలిపింది.