Chandrababu Birthday: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలు అమెరికాలోని ఛార్లెట్ నగరంలో అంగరంగ వైభవంగా జరిగాయి. వేలాది మైళ్ల దూరంలో ఉన్నప్పటికీ, తమ అభిమాన నాయకుడి పుట్టినరోజును ఘనంగా జరుపుకోవడానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఛార్లెట్‌లోని కంఫర్ట్ ఇన్ సూట్స్‌లో జరిగిన ఈ వేడుకలు నభూతో నభవిష్యతి అన్న రీతిలో జరిగాయి.

ఈ వేడుకలకు అమెరికాలోని వివిధ ప్రాంతాల నుండి ఎన్నారైలు తరలివచ్చారు. సాంప్రదాయ తెలుగు దుస్తుల్లో, టీడీపీ జెండాలతో, చంద్రబాబు నాయుడు చిత్రపటాలతో వేడుకల ప్రాంగణం కళకళలాడింది. ఎన్నారై టీడీపీ పార్టీ నాయకులతో కలిసి పిల్లలు, మహిళలు చంద్రబాబు పుట్టినరోజు కేక్‌ను కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. “జై చంద్రబాబు”, “సీఎం చంద్రబాబు” అంటూ నినాదాలు మిన్నంటాయి. సాంస్కృతిక కార్యక్రమాలు, తెలుగు పాటలు, నృత్యాలతో వేడుకలు ఉత్సాహంగా సాగాయి.

ఈ సందర్భంగా గుడివాడ శాసనసభ్యుడు, ఎన్నారై వెనిగళ్ళ రాము మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు 75 ఏళ్లు వచ్చినప్పటికీ నేటికీ 18 గంటలకు పైగా పనిచేస్తున్నారని, ఎల్లప్పుడూ ప్రజల సంక్షేమం కోసం కృషి చేసే విజనరీ ఉన్న నాయకుడని కొనియాడారు. “చాలామంది 60 ఏళ్లు వచ్చిన తర్వాత రిటైర్మెంట్ అయ్యామంటూ పనుల నుంచి విశ్రాంతి తీసుకుంటారు. కానీ చంద్రబాబు నాయుడు 75 ఏళ్లు వచ్చినప్పటికీ ప్రజల కోసం పనిచేయడం తనకు ఇష్టమని చెబుతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం నిరంతరం తపిస్తున్నారు. ఆయన నిబద్ధత, అంకితభావం ఎందరికో స్ఫూర్తిదాయకం” అని రాము అన్నారు.

ఈ వేడుకల్లో పాల్గొన్న ఛార్లెట్ టీడీపీ నాయకులు కూడా చంద్రబాబు నాయుడు చేస్తున్న సేవలను ప్రశంసిస్తూ మాట్లాడారు. ఆయన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని, ఆయన విజన్ రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో నిలిపిందని కొనియాడారు. “చంద్రబాబు నాయుడు ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తూ, వారి ఆకాంక్షలను నెరవేర్చడానికి కృషి చేస్తున్నారు. ఆయన నాయకత్వం రాష్ట్రానికి ఎంతో అవసరం” అని వారు అన్నారు.
ఈ కార్యక్రమాన్ని ఛార్లెట్ ఎన్నారై టీడీపీ స్థానిక నాయకులు నాగ పంచుమర్తి, ఠాగూర్ మల్లినేని, సతీష్ నాగభైరవ, బాలాజీ తాతినేని, ఇతర ఎన్నారై టీడీపీ కార్యవర్గ సభ్యులు నిర్వహించారు. ఈ వేడుకలను విజయవంతం చేసిన వారందరికీ నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. అమెరికాలో కూడా చంద్రబాబు నాయుడుకి ఇంతటి ఆదరణ లభించడం ఆయన నాయకత్వానికి నిదర్శనమని వారు అన్నారు. ఈ వేడుకలు కేవలం చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు మాత్రమే కాదు, ఇది అమెరికాలోని తెలుగు ప్రజల ఐక్యతకు, అభిమానానికి ప్రతీకగా నిలిచాయి. వేలాది మైళ్ల దూరంలో ఉన్నప్పటికీ, తమ నాయకుడిపై ఉన్న అభిమానాన్ని, రాష్ట్రంపై ఉన్న ప్రేమను ఎన్నారైలు చాటుకున్నారు.
Also Read: అమెరికాలో చావు బతుకుల మధ్య తెలుగు విద్యార్థిని.. అసలేమైందంటే?