Teacher Transfers AP: ఏపీలో విద్యా సంవత్సరం( academic year ) ముగియనుంది. మరో రెండు రోజుల్లో వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. గత అనుభవాల దృష్ట్యా కూటమి ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ముఖ్యంగా సెలవుల్లోనే ఉపాధ్యాయుల బదిలీ చేపట్టాలని నిర్ణయించింది. ఏటా ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ కొనసాగుతుందని ఇప్పటికే మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. అందుకు అనుగుణంగా త్వరలో ఈ ప్రక్రియ చేపట్టేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. బదిలీలకు సంబంధించి తేదీలు కూడా ఖరారు అయినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు సంబంధించిన కిట్లను కూడా అందించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
Also Read: ఏపీలో పారిశ్రామిక ప్రగతి.. తట్టుకోలేకపోతున్న వైసిపి.. విష ప్రచారం!
* ఏటా బదిలీలు..
ఏటా ఉపాధ్యాయుల బదిలీ( teachers transfer ) చేపట్టాలని ఆ వర్గాలు కోరుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో మే 7న ఉపాధ్యాయుల బదిలీలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. మే 15 వరకు అప్లికేషన్లు ఆన్లైన్లో అప్లోడ్ చేసేందుకు అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది. అనంతరం మే 18 నుంచి 20 వరకు ఎంఈఓల లాగిన్ లో సవరణకు అవకాశం కల్పిస్తారు. ఆ తరువాత మే 21 నుంచి 22 వరకు డీఈవోల లాగిన్ లో వీటి సవరణకు అవకాశం ఉంటుంది. అనంతరం మే 29న ఉపాధ్యాయుల వ్యక్తిగత మొబైల్స్ కు బదిలీల వివరాలు పంపిస్తారు. వీటి ఆధారంగా ఉపాధ్యాయుల బదిలీ కావాల్సి ఉంటుంది.
* ఉపాధ్యాయులపై శ్రద్ధ..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) ప్రభుత్వం దిగిపోవడానికి ఉపాధ్యాయులు ఒక కారణం. అందుకే ఈ వర్గం విషయంలో కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకొచ్చింది. ఆదర్శ ప్రాథమిక పాఠశాల విధానానికి అనుగుణంగా ఉపాధ్యాయుల సర్దుబాటు చేయనున్నారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఐదుగురు ఉపాధ్యాయుల చొప్పున కేటాయిస్తారు. ఎప్పటికీ ఈ కేటాయింపులు పూర్తయ్యాయి. రాష్ట్రంలో 7500కు పైగా ఆదర్శ ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు చేసేందుకు తుది కసరత్తు జరుగుతోంది. అదేవిధంగా వార్డు, గ్రామ పంచాయితీకి ఒక బడి ఏర్పాటు చేసేలా ప్రణాళిక రూపొందించారు. ఈనెల 30 నాటితో ఈ ప్రక్రియ పూర్తి చేయనున్నారు.
* జూన్ 12న కిట్ల పంపిణీ..
మరోవైపు ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర ( Sarvepalli Radhakrishna Vidyarthi Mitra)పేరిట కిట్లు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకాన్ని వ్యాసవి సెలవుల తర్వాత పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యే రోజు జూన్ 12న పంపిణీ చేయాలని ముహూర్తం ఖరారు చేసింది. ఇందుకోసం కమిటీలను కూడా ఏర్పాటు చేసింది. మండల స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పర్యవేక్షణ బాధ్యతలను ఖరారు చేసింది. ఈ కిట్లలో పాఠ్య, రాత పుస్తకాలు, వర్క్ బుక్స్, నిఘంటువులు, యూనిఫామ్ దుస్తులు, బ్యాగులు, బూట్లు, బెల్టులు ఉంటాయి. మరోవైపు వచ్చే విద్యా సంవత్సరం నాటికి పాఠశాల నిర్వహణలోనూ మార్పులు చేసేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.