https://oktelugu.com/

US: అమెరికాలో మరో భారతీయుడు మృతి.. యూపీకి చెందిన వ్యక్తి కాల్చివేత!

సచిన్‌ సాహూ చెవియట్‌ హౌట్స్‌ వద్ద మారణాయుధంతో సంచరిస్తున్నట్లుగా ఏప్రిల్‌ 21న శాన్‌ అంటోనియో పోలీసులకు సమాచారం అందింది. దీంతో అక్కడికి చేరుకున్న అధికారులు నిందితుడిని పట్టుకునేందుకు యత్నించారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : April 26, 2024 / 04:19 PM IST

    US

    Follow us on

    US: అమెరికాలో భారతీయుల మరణాల పరంపర కొనసాగుతోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 10 మంది విద్యార్థులు వేర్వేరే కారణాలతో మృతిచెందగా ఉద్యోగులు, ఇతర వ్యక్తులు మరో నలుగురు మృతిచెందారు. తాజాగా భారత సంతతికి చెందిన వ్యక్తిని పోలీసులు కాల్చి చంపారు. మృతుడు ఉత్తరప్రదేశ్‌కు చెందిన సచిన్‌సాహూ(42)గా గుర్తించారు. అతనికి అమెరికా పౌరసత్వం ఉన్నట్లు భావిస్తున్నారు. అమెరికాలోని శాన్‌అంటోనియోలో ఈ ఘటన జరిగింది.

    మహిళను కారుతో ఢీకొట్టినందుకు..
    సచిన్‌ సాహూ చెవియట్‌ హౌట్స్‌ వద్ద మారణాయుధంతో సంచరిస్తున్నట్లుగా ఏప్రిల్‌ 21న శాన్‌ అంటోనియో పోలీసులకు సమాచారం అందింది. దీంతో అక్కడికి చేరుకున్న అధికారులు నిందితుడిని పట్టుకునేందుకు యత్నించారు. ఈ క్రమంలో అతడు పారిపోతూ 51 ఏళ్ల మహిళను కారుతో ఢీకొట్టాడు. అరెస్ట్‌ చేసేందుకు వచ్చిన అధికారులను సైతం కారుతో ఢీకొట్టాడు. దీంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సచిన్‌ సహూ అక్కడికక్కడే మృతిచెందాడు.

    ఆస్పత్రిలో బాధితులు..
    ఎన్‌కౌంటర్‌ తర్వాత పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఇందులో సాహూ ఢీకొట్టిన మహిళను అతని రూంమేట్‌గా గుర్తించారు. ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసు చీఫ్‌ బిల్‌ మెక్‌మనుస్‌ తెలిపారు. గాయపడిన ఒక అధికారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించగా, మరో అధికారికి ఘటనా స్థలంలోనే చికిత్స అందించారు. ఈ ఘనటపై బాడీ కెమెరాల ఫుటేజీని పరిశీలించాల్సి ఉందని పోలీసు ఉన్నతాధికారి ఒకరు ప్రకటించారు. కాగా, హతుడు సాహూ బైపోలార్‌ డిజార్డర్‌తో పదేళ్లుగా బాధపడుతున్నాడని అతని మాజీ భార్య లీ గోల్డ్‌ స్టీవ్‌ తెలిపారు. అలాగే స్క్రిజోఫ్రీనియా సమస్యతో చికిత్స తీసుకుంటున్నాడని పేర్కొన్నారు. వీరికి పదేళ్ల కుమారుడు ఉన్నాడు.