China Vs India: మళ్లీ చైనా కవ్వింపు.. కశ్మీర్‌లో శాటిలైట్‌ ఫొటోలు లీక్‌!

భారత్‌– పాకిస్థాన్‌ మధ్య అత్యంత కీలకమైన, సున్నిత సరిహద్దు ప్రాంతం సియాచిన్‌ గ్లేసియర్‌. దీనికి సమీపంలో ఆఘిల్‌ కనుమలోని షక్స్‌గామ్‌ వ్యాలీ సమీపంలో చైనా రోడ్ల నిర్మాణం చేపట్టింది.

Written By: Raj Shekar, Updated On : April 26, 2024 4:14 pm

China Vs India

Follow us on

China Vs India: డ్రాగన్‌ కంట్రీ చైనా భారత సరిహద్దుల్లో తరచుగా కవ్వింపులకు పాల్పడుతూనే ఉంది. భారత సరిహద్దుల్లో చాపకింద నీరులా తన హద్దులను మరింత విస్తరించుకుంటూ పోతోంది. ఇప్పటికే పలుమార్లు భారత సరిహద్దుల్లో ఆక్రమణలకు పాల్పడింది. ఇటీవల అరుణాచల్‌ప్రదేశ్‌ విలషయంలో కయ్యానికి కాలు దువ్వింది. తాజాగా కశ్మీర్‌ను లక్ష్యంగా చేసుకుంది. పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌(పీవోకే) భూభాగంపై కొత్తగా రోడ్లు నిర్మించింది. దీనికి సంబంధించిన శాటిలైట్‌ ఫొటోలు బయటకు వచ్చాయి.

సున్నిత సరిహద్దులో
భారత్‌– పాకిస్థాన్‌ మధ్య అత్యంత కీలకమైన, సున్నిత సరిహద్దు ప్రాంతం సియాచిన్‌ గ్లేసియర్‌. దీనికి సమీపంలో ఆఘిల్‌ కనుమలోని షక్స్‌గామ్‌ వ్యాలీ సమీపంలో చైనా రోడ్ల నిర్మాణం చేపట్టింది. కశ్మీర్‌లోని గిల్గిట్‌ బాల్టిస్టాన్‌ నుంచి తమ దేశంలోని గ్జిన్‌జియాంగ్‌ ప్రావిన్స్‌ను కలుపుతూ ఇప్పటికే ఉన్న జీ219 నంబర్‌ జాతీయ రహదారిని షక్స్‌గామ్‌ వేలీ వరకూ పొడిగించింది. సియాచిన్‌ గ్లేసియర్‌ సమీపంలో గల ఇందిరా కోల్‌వెస్ట్‌ సరిహద్దకు 50 కిలోమీటర్ల దూరం నుంచి ఈ జాతీయ రహదారిని నిర్మించినట్లు శాటిలైట్‌ ఫోటులు స్పష్టం చేస్తున్నాయి.

ధ్రువీకరించిన మాజీ లెఫ్టినెంట్‌ జనరల్‌..
మరోవైపు.. చైనా ఆక్రమణలపై మాజీ కమాండర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ రాకేష్‌ స్పందించారు. కశ్మీర్‌లో చైనా రోడ్ల నిర్మాణం నిజమేనని ధ్రువీకరించారు. అక్రమంగా రోడ్డు నిర్మాణం చేపట్టిందన్నారు. ఈ విషయంలో భారత్‌ తగు చర్యలు తీసుకోవాలన్నారు.

సుదీర్ఘ సరిహద్దు..
భారత్‌తో చైనా సుదీర్ఘ సరిహద్దు(3 వేల కిలోమీటర్లు ) కలిగిఉంది. ఈ నేపథ్యంలో భారత్‌ సరిహద్దు ప్రాంతాల ఆక్రమణే లక్ష్యంగా చైనా కుట్రలు చేస్తోంది. అరుణాచల్‌ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో కూడా చైనా ఆక్రమణలు చేపట్టింది. అరుణాచల్‌ప్రదేశ్‌ మొత్తాన్ని తనలో కలిపేసుకున్నట్లు ఇటీవల మ్యాప్‌లను విడుదల చేసింది. అలాగే, అరుణాచల్‌లోని పలు ప్రాంతాలకు పేర్లను కూడా మార్చింది డ్రాగన్‌ దేశం. దీనిపై భారత ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఈ క్రమంలో తాజాగా కశ్మీర్‌లో రోడ్ల నిర్మాణం వెలుగులోకి వచ్చింది. దీనిపై భారత ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.