NRI News : అమెరికాలో తెలుగు విద్యార్థుల మరణాలు ఆగడం లేదు. ఉన్నత చదువుల కోసం అగ్రరాజ్యానికి వెళ్తున్న విద్యార్థులు విగత జీవులుగా తిరిగి వస్తున్నారు. తాజాగా ఉన్నత చదవుల కోసం అమెరికా వెళ్లిన తెలుగు యువతి అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందింది. మృతురాలును తెలంగాణకు చెందిన గుంటిపల్లి సౌమ్యగా గుర్తించారు. ఆమె స్వస్థలం యాదాద్రిభువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శివారులోని యాదగిరిపల్లె.
ఆదివారం రాత్రి ఘటన..
సౌమ్య ఎంఎస్ చేయడం కోసం అమెరికా వెళ్లింది. అక్కడి టెక్సాస్ యూనివర్సిటీలో ఇటీవలె ఎంఎస్ పూర్తి చేసింది. చదువుకుంటూనే పార్ట్‌టైం ఆజబ్ కూడా చేసింది. ఉన్నతస్థాయికి ఎదుగుతున్న తమ బిడ్డను చూసి తల్లిదండ్రులు మురిసిపోయారు. ఈ క్రమంలో దేవడు చిన్నచూపు చూశాడు. ఆదివారం రాత్రి నడుచుకుంటూ వెళ్తున్న సౌమ్యను వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో సౌమ్య అక్కడికక్కడే మృతిచెందింది.
కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు..
చదువు పూర్తి కావడంతో అక్కడే ఉద్యోగాన్వేషణలో ఉన్న సౌమ్య మే 11న తన 25వ పుట్టిన రోజు జరుపుకుంది. ఉద్యోగం వచ్చాక ఇండియాకు రావాలని భావించింది. ప్రయోజకురాలై తమ కూతురు ఇండియాకు వస్తుందనుకున్న తల్లిదండ్రులు కోటేశ్వర్‌రావు, బాలమణికి సోమవారం గుండెలు పగిలే వార్త అందింది. సౌమ్య రోడ్డు ప్రమాదంలో మృతిచెందినట్లు అమెరికాలోని భారత రాయబార కార్యలయం నుంచి సమాచారం అందించారు. దీంతో వారు కన్నీరుమున్నీవరతున్నారు.
వరుస ఘటనలతో ఆందోళన..
అమెరికాలో తెలుగు విద్యార్థుల వరస మరణాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ మే నెలలోనే ఐదుగురు తెలుగు విద్యార్థులు వివిధ ప్రమాదాల్లో మృతిచెందారు. తాజాగా సౌమ్య దుర్మరణం చెందింది. దీంతో ఉన్నత చదువుల కోసం తమ పిల్లలను అమెరికాకు పంపిన తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.