US Spelling Bee: అమెరికా ఆంగ్లంలో తెలుగోడి సత్తా.. అమెరికా స్పెల్లింగ్‌ బీ ఛాంపియన్‌!

బృహత్‌ సోమ తల్లిదండ్రులు ఫోరిడాలో నివాసం ఉంటున్నారు. బృహత్‌ ఏడో గ్రేడ్‌ చదువుతున్నాడు. అతని తండ్రి శ్రీనివాస్‌ సోమ స్వస్థలం తెలంగాణలోని నల్లగొండ.

Written By: Raj Shekar, Updated On : May 31, 2024 2:39 pm

US Spelling Bee

Follow us on

US Spelling Bee: అగ్రరాజ్యం అమెరికాలో తెలుగోడు సత్తా చాటాడు. ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన స్పెల్లింగ్‌ బీ (US Spelling Bee) పోటీల్లో ఈ ఏడాది కూడా భారత అమెరికన్‌ విద్యార్థులు(Indian – American Students) హవా కొనసాగింది. 2024 స్క్రిప్స్‌ నేషనల్‌ స్పెల్లింగ్‌ బీ పోటీల్లో తెలుగు సంతతికి చెందిన 12 ఏళ్ల బృహత్‌ సోమ సత్తా చాటాడు. ఛాంపియన్‌గా నిలిచాడు. 90 సెకన్లలో abseil సహా 29 పదాల స్పెల్లింగ్‌లను తప్పులు లేకుండా చెప్పి కప్పుతోపాటు 50 వేల డాలర్ల నగదు గెలుచుకున్నాడు.

7 గ్రేడ్‌ స్టూడెంట్‌..
బృహత్‌ సోమ తల్లిదండ్రులు ఫోరిడాలో నివాసం ఉంటున్నారు. బృహత్‌ ఏడో గ్రేడ్‌ చదువుతున్నాడు. అతని తండ్రి శ్రీనివాస్‌ సోమ స్వస్థలం తెలంగాణలోని నల్లగొండ.

పోటీలో 245 మంది విద్యార్థులు
ఇక ఈ ఏడాది నిర్వహించిన యూఎస్‌ స్పెల్లింగ్‌ బీ పోటీల్లో 245 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వీరిలో 8 మంది ఫైనల్‌కు చేరుకున్నారు. ఇందులో బృహత్, ఫైజన్‌ జాకీ మధ్య టై అయింది. దీంతో నిర్వాహకులు విజేతను తేల్చేందుకు టై బ్రేకర్‌ నిర్వహించారు. ఇందుకు 90 సెకన్ల సమయం ఇచ్చారు. ఇందులో జాకీ 20 పదాలను నిర్ణీత సమయంలో తప్పులు లేకుండా చెప్పాడు. ఇక బృహత్‌ 90 సెకన్లలో 29 పదాలు తప్పులు లేకుండా చెప్పాడు. దీంతో నిర్వాహకులు బృహత్‌ను విజేతగా ప్రకటించారు. 2022లో నిర్వహించిన స్పెల్లింగ్‌ బీ పోటీల్లో భారత సంతతికి చెందిన హరిణి లోగాన్‌ 90 సెకన్లలో 22 పదాల స్పెల్లింగ్‌లు చెప్పగా, ఆ రికార్డును ఇప్పుడు బృహత్‌ అధిగమించాడని నిర్వాహకులు తెలిపారు.

మూడోసారి ఛాంపియన్‌..
ఇదిలా ఉంటే.. స్పెల్లింగ్‌ బీ పోటీల్లో బృహత్‌ పాల్గొనడం ఇది మూడోసారి. 2022లో 163వ స్థానంలో నిలిచాడు. గతేడాది నిర్వహించిన పోటీల్లో 74వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఈసారి మాత్రం సత్తా చాటి టైటిల్‌ విజేతగా నిలిచాడు. ఇక టైబ్రేకర్‌లో ఓడిన జాకీకి 25 వేల డాలర్ల ప్రైజ్‌మనీ అందింది. ఈ పోటీల్లో శ్రేయ్‌ పరీఖ్‌ 2వ, అనన్యరావు ప్రసన్న మూడో స్థానంలో నిలిచారు.

100 ఏళ్లుగా పోటీలు..
అమెరికాలో ఈ జాతీయ స్పెల్లింగ్‌ బీ పోటీలు 100 ఏళ్లుగా నిర్వహిస్తున్నారు. 1925లో ఈ పోటీలను ప్రారంభించారు. భారత సంతతి విద్యార్థులు మాత్రం 1999 నుంచి సత్తా చాటడం మొదలు పెట్టారు. ఇప్పటి వరకు 29 మంది ఇండియన్‌ – అమెరికన్‌ (Indian – American)విద్యార్థులు స్పెల్లింగ్‌ బీ ఛాంపియన్లుగా నిలిచారు.