DK Sivakumar: హ్రీం.. బ్రీం.. క్లీం.. ఆవాహయామి.. కర్ణాటకపై తాంత్రిక మంత్రం.. డీకే సంచలన వ్యాఖ్యలు!

తాంత్రిక పూజలు అనేవి ప్రస్తుతం లేవనే అంటున్నారు పండితులు. ఒకవేళ ఉన్నా..మానవాళికి నష్టం కలిగించే తాంత్రిక పూజలకు నిర్వాహకుడే బలవుతాడని పేర్కొంటున్నారు.

Written By: Raj Shekar, Updated On : May 31, 2024 2:54 pm

DK Sivakumar

Follow us on

DK Sivakumar: తాంత్రిక పూజలు.. సాధారణంగా ఇలాంటివి ఎవరూ చేయరు. వాటిని చేయడానికి కూడా తాంత్రిక శక్తులు ఉన్నవారే వేరేగా ఉంటారు. దారి తప్పిన కొందరు అఘోరాలు కూడా ఇలాంటి తాంత్రిక పూజలు చేస్తారని పండితులు చెబుతారు. ఇప్పుడు ఈ తాంత్రికం గురించి ఎందుకు అంటే.. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర హోం మంత్రి డీకే.శివకుమార్‌ తమపై కొందరు తాంత్రిక పూజలు చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేరళలో ఈ తాంత్రిక పూజలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఎవరు చేస్తున్నారో.. ఎప్పటి నుంచి చేస్తున్నారో తనకు తెలుసని చెప్పారు. తనతోపాటు సీఎం సిద్ధ రామయ్యపై కూడా తాంత్రిక పూజలు చేయిస్తున్నారని తెలిపారు. కేరళలోని రాజరాజేశ్వరీ ఆలయంలో శత్రువులను తొలగిండచం కోసం కొందరు ‘శత్రుభైరవి యాగం’ (అగ్ని బలి), రాజ శూల యాగం, మారణ మోహన యాగం చేస్తున్నట్లు వివరించారు.

పంచబలి..
ఇక ఈ తాంత్రిక పూజల్లో భాగంగా పంచబలి(ఐదు వస్తువులను బలి ఇవ్వడం) చేస్తున్నారని తెలిపారు. ఈ పంచ బలిలో భాగంగా 21 మేకలు, 21 నల్ల గొర్రెలు, 3 బర్రెలు, ఐదు పందులను బలి ఇచ్చారని కూడా పేర్కొన్నారు. దీని ఫలితంగా అగ్నిబలి జరుగుతుందని చెప్పారు. ఫలితంగా శత్రువులు తొలగిపోతారని వారు నమ్ముతున్నారని వెల్లడించారు. ఈ పూజలు ఇంకా కొనసాగుతున్నాయని తెలిపారు.

ఎవరు చేస్తున్నారో తెలుసు..
ఇక ఈ పూజలను ఎవరు చేస్తున్నారో కూడా తనకు తెలుసని డీకే.శివకుమార్‌ తెలిపారు. పూజలకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు తనకు అందుతోందని చెప్పారు. అయితే ఎవరు చేయిస్తున్నారు అన్నది మాత్రం వెల్లడించడం లేదు. ఓ ప్రతిపక్ష నాయకుడి ఆదేశాల మేరకు ఈ పూజలు జరుగుతున్నాయని తెలిపారు. వాళ్ల పూజల నుంచి తమను.. తాము నమ్ముకున్న దేవుడే రక్షిస్తాడని వెల్లడించారు.

ఏంటీ తాంత్రికం..
ఇక తాంత్రిక పూజలు అనేవి ప్రస్తుతం లేవనే అంటున్నారు పండితులు. ఒకవేళ ఉన్నా..మానవాళికి నష్టం కలిగించే తాంత్రిక పూజలకు నిర్వాహకుడే బలవుతాడని పేర్కొంటున్నారు. శత్రు భైరవి, రాజ శూల గాయాలు మాత్రం ఉన్నాయని చెబుతున్నారు. వాటి గురించి వేదంలో పేర్కొన్నట్లు తెలుపుతున్నారు. శత్రు భైరవి యాగాన్ని మనిషిలోని పంచ (కామ, క్రోధ, మోహ, లోభ, మద మాత్సల్యం) అనే శత్రువులను జయించేందుకు చేస్తారన్నారు. కొందరు తాంత్రికులు ఒక వ్యక్తికి ఉన్న శత్రువులను చంపేందుకు తాంత్రిక మంత్రాలతో ఇలాంటివి గతంలో చేసేవారని చెబుతున్నారు. ఇక రాజ శూల యాగం అంటే.. రాజు లేదా ప్రభువు, లేదా ప్రభుత్వం నశించాలని చేస్తారని, ఈ యాగంలో ఒక బొమ్మను తయారు చేసి దాని కళ్లు, ముక్కు, చెవులు, నాలుక, చేతులు ఇలా ఒళ్లంతా ముళ్లు, మేకులు కుచ్చడం ద్వారా మానసిక ఆనందం పొందుతారని అంటున్నారు.

తాంత్రిక పూజలను డీకే నమ్ముతారా..
ఇదిలా ఉండే.. పాలకులుగా ఉన్న డీకే శివకుమార్‌ తమపై తాంత్రిక పూజలు చేస్తున్నారని వ్యాఖ్యానిచడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ప్రజలకు అండగా ఉండాల్సినవారే.. తమకే ఏదో జరుగుతోందని ఆందోళనగా మాట్లాడడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. హోం మంత్రిగా ఉన్న డీకే.. ఈ గుట్టు రట్టు చేసే స్థాయిలో ఉన్నారు. అయినా.. తమను ఏమో చేయబోతున్నారని ఆందోళన వ్యక్తం చేయడాన్ని విశ్లేషకులు తప్పు పడుతున్నారు. ఈ మూఢ నమ్మకాలను డీకే బాగా నమ్ముతారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయినా.. డీకేగారు.. మంత్రాలకు చింతకాయలు రాలతాయా.? ఏంటో మరి.. అదేదో మీరు.. మీరు చూసుకోండి. జనాలకు నష్టం కలుగకుండా చూడండి అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.