
Nellore Politics: వైసీపీ కీలక నేతకు షాక్ ల మీద షాక్ లు ఇస్తుంది. స్వరం పెంచిన వారిని క్రమ శిక్షణా చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమని స్పష్టం చేస్తుంది. అధికార పార్టీ నేతలు సహకరించకపోగా, ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారని నానా యాగి చేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి అధికార పార్టీ పవర్ ఎంటో తెలిసొచ్చేలా, ఇలా వ్యవహరించన వారిపై శిక్ష ఇలానే ఉంటుందని తెలియజేస్తూ మరో వార్నింగ్ ఇచ్చింది.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆ నియోజకవ్గం నుంచి రెండుసార్లు గెలిచారు. అప్పటి నుంచి పార్టీ కార్యకలాపాల్లో చురుకుగానే ఉన్న ఆయనకు పార్టీ నాయకుల నుంచి అంతగా పొసగడం లేదని చెబుతున్నారు. పలుమార్లు ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా, స్వయంగా పార్టీ ఎమ్మెల్యే అయినా తనను లెక్క చేయకపోవడంపై రగిలిపోయారు. టీడీపీతో ఆయన కలిసి పనిచేస్తున్నట్లుగా ఆరోపణలు రావడంతో దాదాపుగా పక్కనబెట్టాశారనే వాదనలు వినిపించాయి.
ఊహించిన విధంగానే ఆయన వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహంగా రగిలిపోయారు. తన ఫోన్ ట్యాప్ చేశారని మండిపడ్డారు. ఆధారాలతో నిరుపిస్తారని మీడియా ముఖంగా ప్రకటించారు. ఆయన బాటలోనే ఇంకొందరు ఎమ్మెల్యేలు నడవబోతున్నారనే సమాచారంతో తేరుకున్న అధికార పార్టీ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసేసింది. టీడీపీలోకి దగ్గరవుతున్నారనే వార్తల నేపథ్యంలో, రూరల్ నియోజకవర్గానికే చెందిన టీడీపీ నాయకుడు మాతంగి కృష్ణ, ఎమ్మెల్యే కోటంరెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను హత్య చేయించడానికి ప్రయత్నించారంటూ విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో కోటంరెడ్డి అరెస్టు తప్పదనే పుకార్లు వచ్చాయి.

తాజాగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డిని కూడా వైసీపీ అధిష్టానం సస్పెండ్ చేస్తూ షాక్ ఇచ్చింది. ప్రస్తుతం ఆయన వైసీపీ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు క్రమశిక్షణ కమిటీ అందించిన సిఫారసుల మేరకు అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారని పేర్కొంది.
అధికార పార్టీకి దూరం జరిగిన తరువాత మొదటిసారి అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటున్నట్లు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. పార్టీకి ఎంతో సేవ చేసినా, తనను వేధింపులకు గురిచేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయని, వాటన్నింటిని అసెంబ్లీలో ప్రస్తావిస్తానని పేర్కొంటున్నారు. ఈ నెలాఖరులోపు ప్రభుత్వం స్పందించకపోతే ఏప్రిల్ 6న నీళ్లలో కూర్చొని జలదీక్ష చేపడతానన్నారు.