Nellore Politics: ఆ ప్రాంతం అధికార పార్టీకి పెట్టని కోట. ఏ ఎన్నిక వచ్చినా ఎగిరేది అధికారపార్టీ జెండానే. కానీ ఇప్పుడు ప్రతిపక్ష నేత దెబ్బకు ఆ జెండా విలవిలాడుతోంది. అంతా బాగుందనుకుంటున్న సమయంలో అనూహ్యమైన దెబ్బతో ప్రతిపక్షం విరుచుకుపడుతోంది. అధికార పక్షానికి ఊపిరాడకుండా చేస్తోంది. కక్కలేక.. మింగలేక అధికార పక్షం కొట్టుమిట్టాడుతోంది.

నెల్లూరు జిల్లా వైసీపీకి కంచకోట. 2019 ఎన్నికల్లో పదికి పది అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ జెండా ఎగిరింది. టీడీపీ కనీసం ఖాతా కూడా తెరవలేకపోయింది. 2024 ఎన్నికల్లో కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతుందని అంతా అనుకుంటున్నారు. ఇంతలోనే అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరూ పార్టీ పై అసమ్మతి స్వరం వినిపిస్తున్నారు. ఏకంగా టీడీపీలో చేరేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సైకిల్ ఎక్కుతామని స్పష్టం చేశారు. ఇక ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కూడా అసమ్మతి ఎమ్మెల్యేల జాబితాలో చేరారు. తాడోపేడో తేల్చుకోవడానికి తాను సిద్దంగా ఉన్నానంటూ సంకేతాలు ఇచ్చారు. మేకపాటి కూడా ఆనం, కోటంరెడ్డి బాటలో నడుస్తారని ప్రచారం జరుగుతోంది.
కంచుకోటలాంటి నెల్లూరులో వైసీపీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు బావుటా ఎగరేయడంతో దిక్కుతోచని స్థితి వైసీపీలో నెలకొంది. ఒక్కొక్కరుగా అసమ్మతి ప్రకటించడం మింగుడుపడటంలేదు. అంతా బాగుందని అనుకుంటున్న సమయంలో ఎమ్మెల్యేల అసమ్మతి స్వరం ఊహించని షాక్ ఇచ్చింది. అసలు వైసీపీలో ఏం జరుగుతుందో ఆ పార్టీ కార్యకర్తలకు అర్థం కావడంలేదు. ఇంకా ఎన్నికలకు 15 నెలల సమయం ఉంది. అయినా కూడా ఎమ్మెల్యేలు తిరుబాటు బావుటా ఎగరేయడం, టీడీపీలోకి వెళ్తామని ప్రకటించడం సంచలనంగా మారింది. జగన్ తో పోలిస్తే లోకేష్ ఇమేజ్ తక్కువే అని వైసీపీ నేతలు భావిస్తారు. ఇలాంటి నేపథ్యంలో టీడీపీ వైపు వైసీపీ ఎమ్మెల్యేలు వెళ్లడం వైసీపీ కిందిస్థాయి కేడర్ కు అర్థం కావడంలేదు.

నెల్లూరు వైసీపీలో ముసలం పుట్టడానికి చంద్రబాబే ప్రధాన కారణమని తెలుస్తోంది. రాయలసీమ, నెల్లూరు జిల్లాలు వైసీపీకి మంచి మెజార్టీని ఇచ్చాయి. ఈ ప్రాంతంలో పట్టు సాధిస్తే టీడీపీ గెలుపు సునాయాసం అవుతుంది. ఇది గమనించిన చంద్రబాబు నెల్లూరు పై పట్టుసాధించే వ్యూహం పన్నారు. వైసీపీలోని కీలకమైన ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఆనంరామనారాయణరెడ్డి, కోటంరెడ్డిశ్రీధర్ రెడ్డిని టీడీపీ వైపు తిప్పుకున్నారు. ఇక మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కూడా టీడీపీలోకి వస్తారని తెలుస్తోంది. ఇది ఒక రకంగా వైసీపీ ఊహించని దెబ్బ. చంద్రబాబు సైలెంట్ గా వైసీపీ పై దెబ్బేశాడని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కడప జిల్లాలో డీఎల్ రవీంద్రారెడ్డి, వీరశివారెడ్డిలను టీడీపీ వైపు తిప్పుకున్నారు. ఎక్కడైతే వైసీపీ బలంగా ఉందో ఆ ప్రాంతాల పై చంద్రబాబు దృష్టిసారించారు.
చంద్రబాబు నిశ్శబ్ధంగా కొట్టిన దెబ్బకు వైసీపీ విలవిలలాడుతోంది. అప్పటి వరకు 175 సీట్లు ఎందుకు గెలవకూడదు అంటున్న జగన్ కు చంద్రబాబు గట్టి షాక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. వైసీపీ ఎమ్మెల్యేలు ఇంత ఈజీగా చంద్రబాబు వైపు వెళ్తారని జగన్ కూడా ఊహించి ఉండరు. జగన్ మూడు రాజధానుల పై ఫోకస్ చేస్తే… చంద్రబాబు వైసీపీ ఎమ్మెల్యేల పై ఫోకస్ చేశారు. ఎమ్మెల్యేలకు ఏదో ఒక ఆశ చూపి వారిని టీడీపీ వైపు తిప్పుకుంటున్నారు.