
Vanama Raghavendra Rao: ” నువ్వు సబ్ రిజిస్ట్రార్ కదా! ఐదు లక్షలు నాకు పంపు.. సీఎం సార్ సభ ఉంది.. దాన్ని గ్రాండ్ గా చేయాలి. నువ్వు తహసీల్దార్ కదా… ఒక మూడు లక్షలు నాకు ఫోన్ పే చేయ్.. కార్యకర్తలకు పంచాలి కదా! నీదేంది ఒక్కరోజులో సంపాదిస్తావ్” ఇది ఓ ఎమ్మెల్యే తనయుడి మాట తీరు. పైసలు వసూలు చేస్తున్న తీరు. అధికారులను బెదిరిస్తున్న తీరు.. ఆ మధ్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం పట్టణంలో ఏర్పాటు చేసిన నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ వచ్చారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు మొత్తం ప్రభుత్వమే చూసుకుంది.. చివరికి భోజనాలతో సహా. అక్కడి కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ అన్ని తానయి వ్యవహరించారు. కానీ ఇక్కడే కొత్తగూడెం ఎమ్మెల్యే కొడుకు రాఘవేంద్రరావు ఎంటర్ అయ్యాడు.. ముఖ్యమంత్రి సభకు తన నియోజకవర్గ పరిధిలోని అధికారులకు టార్గెట్లు విధించాడు. ముక్కు పిండి పైసలు వసూలు చేశాడు. ఇలా నాలుగు కోట్ల దాకా వెనకేశాడు.. పిల్లి కళ్ళు మూసుకుని అంతమాత్రాన లోకం మొత్తం చీకటి కాదు కదా! అందుకే ఇతగాడు చేస్తున్న జులుం ను కొందరు ఫోన్లో రికార్డ్ చేశారు.. ఇప్పుడు అది సామాజిక మాధ్యమాల్లో లో వైరల్ గా మారింది.
సస్పెండ్ చేసినా..
వనమా వెంకటేశ్వరరావు పేరుకే కొత్తగూడెం ఎమ్మెల్యే. కానీ తెర వెనుక శాసించేది అతని కొడుకు వనమా రాఘవేంద్రరావు. పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్టుగా.. ఇతగాడు చేయని దందాలు లేవు.. బెదిరించని అధికారి లేడు. అడ్డగోలుగా అసైన్డ్ భూములు తన పేరున చేయించుకోవడం, ప్రభుత్వ భూములను ఆక్రమించడం ఇతగాడికి వెన్నతో పెట్టిన విద్య. కుటుంబ కలహాల నుంచి భూ పంచాయితీల దాకా ఇతడు సెటిల్ చేయని కేసులు అంటూ లేవు. ఇతని బాధితులు ఎంతోమంది ఉన్నారు. అధికార పార్టీ కావడంతో ఎవరూ నోరు మెదపడం లేదు. పైగా కేసీఆర్…నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలను సామంత రాజులను చేయడంతో ఎవరు ఏమీ అనలేని పరిస్థితి. ఆ మధ్య రాఘవేంద్రరావు దాష్టీకానికి ఓ కుటుంబం బలయింది.. ఇది అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.. ఇంత జరిగినప్పటికీ అధికార భారత రాష్ట్ర సమితి జస్ట్ సస్పెండ్ తో సరి పుచ్చింది.. కానీ అదే రాఘవేంద్రరావు ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చాడు.. దందా షురూ చేశాడు. ఆ మధ్య తనకు వేతనం ఇవ్వాలని పీఏ కోరితే.. అతనిపై దాడి చేశాడు. దీంతో సదరు పిఏ ఆత్మహత్యకు యత్నించాడు.. ఇలా చెప్పుకుంటూ పోతే కొత్తగూడెం నియోజకవర్గం లో వనమా రాఘవేంద్రరావు లీలలు ఎన్నో.

సీఎం పేరు చెప్పి..
వనమా రాఘవేంద్రరావు జైలుకు వెళ్ళొచ్చిన తర్వాత కొద్ది రోజులపాటు ఏలూరులో ఉన్నాడు. తర్వాత మళ్ళీ పాల్వంచ వచ్చాడు.. ఎప్పటిలాగే తన దౌర్జన్యాన్ని మొదలుపెట్టాడు.. కానీ ఈసారి ఏకంగా ముఖ్యమంత్రి సభ పేరును చెప్పి అధికారుల దగ్గర అడ్డగోలుగా వసూలు చేశాడు.. ఈ వసూళ్లల్లో తన తల్లిని కూడా భాగస్వామిని చేయడం విశేషం. అయితే చీమ చిటుక్కుమన్నా వెంటనే తెలుసుకునే కేసీఆర్… ఈ విషయం ఎందుకు తెలుసుకోలేకపోయాడు? అతడి ఇంటలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తోంది? అధికారులు ఏమైనా పర్వాలేదు, ప్రజలు ఇబ్బంది పడ్డా పర్వాలేదు.. పార్టీ నాయకులు రెండు చేతులా సంపాదిస్తే చాలు అనుకుంటున్నాడా?! ఇలాంటి గుణాత్మక మార్పు నే దేశం మొత్తం అమలు చేయాలని చూస్తున్నాడా! ఈ ప్రశ్నలకు ఆ నమస్తే తెలంగాణ పేపర్లో ఆయన సమాధానం దొరుకుతుందా?