కెసిఆర్ జిహెచ్ఎంసి ఎన్నికల తర్వాత సైలెంట్ అయ్యాడని అందరూ కామెంట్ చేయటం వింటున్నాం. అది నిజమే. అంత సడెన్ గా డిల్లీ పర్యటన, ఆ తర్వాత ఇంతవరకూ మౌనం వెనక పరమార్ధం అర్ధంకాక రాజకీయ పండితులందరూ తలలు పట్టుకుంటున్నారు. ఏమయివుంటుంది అనేది తలారకంగా వ్యాఖ్యానిస్తున్నారు. నిజమే ఈ వ్యాఖ్యానాలను కొట్టిపారేయలేము. ఎందుకంటే కెసిఆర్ ఇంతవరకూ దీనిపై క్లారిటీ ఇవ్వలేదనేది వాస్తవం. ఇవ్వాల్సిన అవసరం కూడా లేదని భావించి ఉండొచ్చు. అందుకే ఇన్నిరకాల వ్యాఖ్యలు. అదీగాక అట్టహాసంగా అన్ని ప్రతిపక్ష నాయకులతో మాట్లాడుతున్నట్లు ప్రకటించి దానిపై ఊసెత్తకపోవటం కూడా ఈ అనుమానాలకు తావిస్తుంది. ఏమయివుంటుంది సుమా.
ఒక్కసారి రీలు వెనక్కు తిప్పి చూడండి. ఇది ఆయనకు కొత్తేమీ కాదు. తెలంగాణా ఉద్యమంలో ఇలాగే 6 నెలలు మౌనంగా వున్న రోజులు కూడా వున్నాయని మర్చిపోవద్దు. అంతమాత్రాన ఏమీ చేయకుండా వూరికే కూర్చుంటున్నాడని ఎవరైనా బ్రమపడితే పొరపాటు. మొదట్నుంచీ తన వ్యవహార శైలి అంతే. ప్రతిరోజూ ప్రజా దర్భారులు నిర్వహించటం, సామాన్య ప్రజలకు దర్శనమివ్వటం, సచివాలయానికి క్రమం తప్పకుండా రావటం ఇవన్నీ తన మనస్తత్వానికి సరిపడవు. అదేసమయంలో తను అందరికన్నా మేధావినని, తనకు ఏ సందర్భంలో ఏమి చేయాలో, ఏమి చేయకూడదో బాగా తెలుసునని నమ్ముతాడు. ఇది నా స్టైల్ నా వ్యవహారశైలిని ప్రశ్నించే దమ్ము ఎవరికీ లేదని కూడా భావిస్తూవుంటాడు. ఒకటిమాత్రం నిజం, ఇంటి దగ్గర ఊరికే కూర్చొనే రకం మాత్రం కాదు. ప్రతి మౌనం వెనక ఏదో అంతరార్ధం వుంటుంది.
తెలంగాణా ఉద్యమంలో తను ప్రత్యక్షంగా రోడ్డుమీదికి వచ్చి నిరసనలు తెలిపిన సంఘటనలు లేవు. అదే సమయంలో సభల్లో ప్రజల్ని తన వాగ్దాటితో తన్మయత్వం చెందేటట్లు చేసి మైమరపించటంలో తనకు ఎవరూ సాటిలేరు. తెలంగాణా కాంగ్రెస్ నాయకుల్ని ఇటువంటి మాటలతోనే బుట్టలో పడేసిన సంగతి అందరికీ తెలుసు. అంతెందుకు స్వయానా సోనియా గాంధీనే ఆయన మాటలకు మైమరిచి పోయిందంటే అర్ధం చేసుకోండి. కుటుంబంతో సహా ఆవిడ దగ్గరకు వెళ్లి కృతజ్ఞతలు చెప్పిరావటం అందరికీ తెలిసిందే. అదే ఆవిడతో మాట్లాడటం బహుశా చివరిసారి అనుకుంటా. ఇంకేముంది తెరాసని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నాడు, మొత్తం 17 లోక్ సభ సీట్లు తన ఖాతాలో పడిపోయాయని నమ్మింది. ఇదంతా ఏదో సినిమాలో లాగే జరిగింది. అంతెందుకు ఉద్యమ సమయంలో నాపక్కన నా కుటుంబ సభ్యులని తీసుకొస్తే రాళ్ళతో కొట్టమని చెప్పి ప్రజల్ని కూడా నమ్మించటం జరిగింది. అదే ప్రజలు ఆ కుటుంబ సభ్యులకు ఆహ్వానం పలకటం కూడా చూసాము. అది కెసిఆర్ అంటే.
తిరిగి మరలా ఎప్పుడో ప్రజలముందుకు వచ్చి మాట్లాడితే అందరూ ఆహా ఓహో అనటమూ ఖాయము. దట్ఈజ్ కెసిఆర్. ఇదంతా ఎందుకు చెపుతున్నామంటే మీ కంట శోష తప్పించి ఇంకేమీ లేదు. ఆయనకు బయటకు వచ్చి ఎప్పటికప్పుడు ప్రజలముందు వివరణ ఇచ్చుకోవటం మొదట్నుంచీ అలవాటులేదు. ఇప్పుడు కొత్తగా చేయాలంటే అయ్యే పనికాదు. ఆ వ్యవహార శైలి వుందని తెలిసినా ప్రజలు ఓటు వేసారు. ఇప్పుడు మార్చుకోమన్నా జరిగేపని కాదు. మనం ఎడ్జస్ట్ కావాల్సిందే. దట్ఈజ్ కెసిఆర్.