AP New CS: ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నియామకం పై కూటమి సర్కార్ ఫోకస్ పెట్టింది. ప్రస్తుత సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఈనెల 31న పదవీ విరమణ చేయనున్నారు. దీంతో కొత్త సీఎస్ ను ఎంపిక చేయడం అనివార్యంగా మారింది. ఇప్పుడు ఎవరికి ఛాన్స్ దక్కుతుంది అన్నది చర్చ గా మారింది.ఓ ఇద్దరి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. వారిలో ఒకరు సీఎస్ కావడం ఖాయం. జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.ఈ ఇద్దరిలో ఎవరికీ ఛాన్స్ దక్కుతుందా అన్నది సస్పెన్స్ గా మారింది. అయితే ప్రముఖంగా సాయి ప్రసాద్ పేరు వినిపిస్తోంది.ఆయనకే ఎక్కువగా అవకాశాలు ఉన్నాయంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. మరోవైపు విజయానంద్ కంటే సాయి ప్రసాద్ కు ఎక్కువ సర్వీస్ ఉందట. అందుకే ముందుగా విజయానంద్ కు సి ఎస్ గా అవకాశం ఇచ్చి… ఆయన తదుపరి సాయి ప్రసాద్ ను ఎంపిక చేసే అవకాశం ఉందని కూడా ప్రచారం నడుస్తోంది.
ముందుగా విజయానంద్?
సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఉన్న విజయానంద్ వచ్చే ఏడాది నవంబర్ నెలాఖరులో పదవీ విరమణ చేయనున్నారు. సాయి ప్రసాద్ కు మాత్రం 2026 ఏప్రిల్ నెల వరకు సర్వీసు ఉంది. అందుకే ముందుగా విజయానంద్ కు అవకాశం ఇస్తారని.. తదుపరి సాయి ప్రసాద్ ను ఎంపిక చేస్తారని ప్రచారం నడుస్తోంది. కానీ సీఎం చంద్రబాబు ఛాయిస్ ఎవరనేది తెలియాల్సి ఉంది. ఇంకా మూడు రోజుల వ్యవధి మాత్రమే ఉండడంతో సీఎం చంద్రబాబు కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. దీనిపై అధికార వర్గాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.
* శ్రీలక్ష్మి కి నో ఛాన్స్
వాస్తవానికి సీనియారిటీ జాబితాలో శ్రీ లక్ష్మీ ఉన్నారు. కానీ ఆమెకు మాత్రం అవకాశం ఇవ్వరని తెలుస్తోంది. ఆ తర్వాత జి. అనంతరామ్ 1990 బ్యాచ్ అధికారిగా ఉన్నారు. ఈయన కూడా సీనియర్. ఇక 1991 బ్యాచ్ కు చెందిన అజయ్ జైన్ సైతం ఉన్నారు. ఈయనకు సైతం చాన్స్ దక్కే అవకాశం లేదు. మరోవైపు సిసోడియా ఉన్నారు. ఆయన పేరును పరిగణలోకి తీసుకుంటారా లేదా అన్నది చూడాలి. ఇంకోవైపు 1992 బ్యాచ్ కు చెందిన ఎస్ఎస్ రావత్ ఉన్నారు. ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఫైనల్ గా విజయానంద్, సాయి ప్రసాద్ లో ఒకరికి అవకాశం ఇస్తారని తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.