Virat Kohli: టీమిండియా దిగ్గజ క్రికెటర్ విరాట్ కోహ్లీ భారత క్రికెట్ బోర్డుపై సీరియస్ అయ్యాడు. బోర్డు తీసుకొచ్చిన కొత్త రూల్ మీద అతడు అసహనం వ్యక్తం చేశాడు. బీసీసీఐ ఇటీవల తీసుకున్న కుటుంబ పరిమితి నిబంధనలపై తన అభిప్రాయాన్ని కాస్త గట్టిగానే వినిపించాడు. క్రికెటర్ల టూర్ల సమయంలో వాళ్ల కుటుంబాలు ట్రావెల్ చేయకుండా కొత్త నిబంధనలు తీసుకురావడం పై ఆయన అసహనం వ్యక్తం చేశాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తర్వాత నిబంధనలు మార్చడం పై కోహ్లీ ఘాటుగా స్పందించాడు. 45 రోజుల టూర్ ఉంటే అందులో రెండు వారాలు మాత్రమే ప్లేయర్ల ఫ్యామిలీలను అనుమతిస్తూ బీసీసీఐ నిర్ణయం సరైనది కాదన్నాడు విరాట్. తలా తోక లేని నిర్ణయాల వల్ల పెద్దగా ఎవరికీ ఉపయోగపడవని బోర్డును ప్రశ్నించాడు.
Also Read: ముంబై తో ఓటమి.. మూడో సారీ కప్ కోల్పోయిన బాధలో ఏడ్చేసిన ఢిల్లీ కెప్టెన్ (వైరల్ వీడియో)
బీసీసీఐ ఇటీవల తీసుకున్న కొత్త విధానం.. 45 రోజుల కంటే ఎక్కువ వ్యవధి ఉన్న విదేశీ టూర్లలో ఆటగాళ్ల కుటుంబ సభ్యులు మొదటి రెండు వారాల తర్వాత మాత్రమే ప్లేయర్స్ తో ఉండే వీలుంటుంది. అంతేకాదు, వారి గడువు కేవలం 14 రోజులు మాత్రమే ఉంటుంది. ఈ నిర్ణయంపై విరాట్ కోహ్లీ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. టూర్ల సమయంలో కుటుంబ సభ్యుల సమక్షం చాలా కీలకమని చెప్పాడు.
“ఒక క్రికెట్ ప్లేయర్ గా, మైదానంలో ఒత్తిడిని ఎదుర్కొన్న తర్వాత ఫ్యామిలీతో గడిపే సమయమే మళ్లీ సాధారణ స్థితికి తీసుకొస్తుంది.కానీ, ఇప్పుడు బీసీసీఐ తీసుకున్న నిబంధన వల్ల మేము ఒంటరిగా ఉండాల్సి వస్తుందని కోహ్లీ అన్నాడు. టూర్ సమయంలో కుటుంబ సభ్యులను కలిసే అవకాశాన్ని తగ్గించడం వల్ల ఆటగాళ్ల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందన్నాడు. కోహ్లీ ఇటీవల జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. పాకిస్తాన్‌పై సెంచరీ, సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాపై 84 పరుగులు సాధించి జట్టు విజయాల్లో కీలకంగా మారాడు.
ఇటీవల జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో కోహ్లీ భార్య అనుష్క శర్మ స్టేడియంలో అతనికి సపోర్టుగా కనిపించింది. మ్యాచ్ తర్వాత ఇద్దరూ కలిసి సెలబ్రేట్ చేసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.అలాగే కెప్టెన్ రోహిత్ శర్మ భార్య రితికా, కూతురు సమైరా కూడా జట్టుకు సపోర్టుగా స్టేడియంలో కనిపించారు. కోహ్లీ తన కుటుంబ సభ్యుల మద్దతు వల్ల ఆటతీరుపై సానుకూల ప్రభావం చూపుతుందని చెబుతూ, “ఒంటరిగా కూర్చొని బాధపడేందుకు నాకు ఇష్టం లేదు. ఒక ఆటగాడిగా నా బాధ్యత పూర్తి అయిపోయిన తర్వాత సాధారణ జీవితం గడపాలి” అని చెప్పాడు. కోహ్లీ చేసిన వ్యాఖ్యలపై నెట్టింట్లో చర్చలు మొదలయ్యాయి. భవిష్యత్తులో బీసీసీఐ ఈ నిబంధననుమరోసారి సమీక్షించే అవకాశం ఉందేమో చూడాలి.
Also Read: అక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది.. ముంబై రెండోసారి విజేతగా నిలిచింది.. ప్చ్ ఢిల్లీకి మళ్ళీ నిరాశ..