Vande Bharat Train Speed: ఇక ఆ మధ్య వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టినపుడు.. అందులో కల్పించిన సౌకర్యాలపై విపరీతంగా ప్రచారం చేశారు భారతీయ జనతా పార్టీ నాయకులు. విపరీతమైన వేగం ఉంటుందని.. గంటలు గంటలు ప్రయాణించకుండా.. స్వల్ప కాలంలోనే తమ గమ్యస్థానాలను చేరుకోవచ్చు అని.. అద్భుతమైన సౌకర్యాలను ఆస్వాదించవచ్చని.. భిన్నమైన రుచుల సమ్మేళనంతో రూపొందించిన ఆహారాన్ని తినవచ్చని.. మొత్తంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సౌకర్యాలను అనుభవించవచ్చని.. రైల్వే శాఖ విపరీతంగా ప్రచారం చేసింది. ఇక అనేక రూట్లలో వందే భారత్ రైళ్లను రైల్వే శాఖ నడుపుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పలు ప్రాంతాలలో వందే భారత రైళ్లను ప్రారంభించారు. ఇటీవలి చీనాబ్ వంతెన ప్రారంభంలోనూ ఆయన వందే భారత్ రైలును ప్రారంభించారు. వందే భారత్ రైళ్లను దేశవ్యాప్తంగా విస్తరించే ఆలోచనలో ఉన్నట్టు రైల్వే శాఖ చెబుతోంది. వేగంలో.. సౌకర్యాల విషయంలో.. ప్రపంచ స్థాయి ప్రమాణాలను పాటిస్తున్నట్టు రైల్వే శాఖ ఇప్పటికే అనేక సందర్భాలలో వెల్లడించింది. అయితే వందే భారత రైళ్లను భారతీయ జనతా పార్టీ గొప్పగా అభివర్ణించుకుంటున్న క్రమంలో.. ప్రతిపక్ష పార్టీలు కూడా వందే భారత రైళ్లకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాయి. సోషల్ మీడియాలో అనేక ఉదాహరణలతో భారతీయ జనతా పార్టీని విమర్శిస్తున్నాయి.
తాజాగా గులాబీ పార్టీకి అనుకూలంగా ఉన్న ఓ సామాజిక ఖాతా నుంచి వందేభారత్ రైలుకు సంబంధించిన ఒక వీడియో పోస్ట్ అయింది. ఆ వీడియోలో వందే భారత్ రైలు అత్యంత వేగంగా వెళ్లదని.. దీనిని భారతీయ జనతా పార్టీ నాయకులు తెగ ప్రచారం చేసుకుంటున్నారని.. క్షేత్రస్థాయిలో పరిస్థితి అలా లేదని ఆ వీడియోలో పేర్కొన్నారు. పైగా వందేభారత్.. బిట్రగుంట రైలు పక్కపక్కనే ప్రయాణిస్తున్నప్పుడు తీసిన ఒక వీడియో పోస్ట్ చేశారు. వందే భారత రైల్వే వేగాన్ని బిట్రగుంట రైలు అందుకోవడం.. ఒకానొక సందర్భంలో వందే భారత రైలు ను దాటేయడంతో.. భారత రాష్ట్ర సమితి నాయకులు విమర్శలు చేస్తున్నారు..” గొప్ప సౌకర్యాలన్నారు. అపరితమైన వేగం అన్నారు. అద్భుతమైన ప్రయాణ సౌలభ్యం అని చెప్పారు. ఇప్పుడేమో ఇలా ఉంది. వందే భారత్ రైలును బిట్రగుంట రైలు అధిగమించింది. ఇంతకంటే దారుణం ఇంకొకటి ఉందా.. ప్రచారం చేసుకోవడంలో మీ తర్వాతా ఎవరైనా” అంటూ కమలం పార్టీ నాయకులను ఉద్దేశించి భారత రాష్ట్ర సమితి నాయకుడు రాసుకొచ్చారు.
అయితే దీనిపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వందే భారత్ రైల్వే మార్గంలో ఏదైనా మరమ్మతులు.. లేకుంటే పట్టాల సామర్థ్యం.. ఇవన్నీ పరిశీలనలోకి తీసుకుంటారని.. అక్కడ వేగం తగ్గినంతమాత్రాన మిగతా ప్రాంతాలలో స్పీడ్ తగ్గినట్టు కాదని.. వందే భారత రైళ్లను ఏ స్థాయిలో ఆదరిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని.. ఇలాంటి విష ప్రచారాలు మానుకుంటే మంచిదని.. కమలం పార్టీ నాయకులు హితువు పలుకుతున్నారు. ఇలాంటి పిచ్చి పిచ్చి పోస్టులు చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.
వందేభారత్ ట్రైన్ తో పోటి పడి పరుగెత్తిన బిట్రగుంట మెమో ట్రైన్.. pic.twitter.com/fEGkof69Aq
— పెండ్లి పురుషోత్తం రెడ్డి (@PPR_CHALLA) June 10, 2025