IPL 2024: ఐపీఎల్ అంటేనే వేగం.. దూకుడుకు అసలైన నిర్వచనం. ఇలాంటి ఆటలో బ్యాటర్లదే మొదటి నుంచి ఆధిపత్యం. ఫోర్లు, సిక్సర్లు బాధతో బ్యాటర్లు పండగ చేసుకుంటారు. ప్రస్తుత సీజన్లోనూ బ్యాటర్లదే హవా కొనసాగుతోంది. అద్భుతమైన స్ట్రైక్ రేట్ తో వారు ఆడుతున్న తీరు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తోంది. ఆకాశమే హద్దుగా.. మెరుపు ఇన్నింగ్స్ తో వారు ప్రేక్షకులకు సరికొత్త క్రికెట్ ఆనందాన్ని అందిస్తున్నారు. ఈ సీజన్లో అత్యధిక స్ట్రైక్ రేట్ కలిగిన ఆటగాళ్లను ఒక్కసారి పరిశీలిస్తే..
ఆండ్రీ రసెల్
ఈ ఆల్ రౌండర్ కోల్ కతా జట్టుకు ఆడుతున్నాడు. ఇప్పటివరకు ఇతడు 115 పరుగులు చేశాడు. మూడు ఇన్నింగ్స్ లలో ఇతడి స్ట్రైక్ రేట్ 212. 97. హైదరాబాద్ జట్టుపై ఇతడు 25 బంతుల్లో 64 పరుగులు చేసి విధ్వంసానికి సిసలైన నిర్వచనం చెప్పాడు.
అభిషేక్ శర్మ
ఇతడు భారత జట్టుకు చెందిన అన్ క్యాప్డ్ ఆటగాడు. హైదరాబాద్ జట్టుకు ప్రస్తుతం ఆడుతున్నాడు. ఇప్పటివరకు ఐదు మ్యాచ్ లలో 208.23 స్ట్రైక్ రేటుతో 177 రన్స్ చేశాడు. చెన్నై జట్టుతో జరిగిన మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
శశాంక్ సింగ్
పంజాబ్ కింగ్స్ జట్టుకు ఆడుతున్న ఈ ఆటగాడు.. అద్భుతమైన ఇన్నింగ్స్ నిర్మించడంలో దిట్ట. ఇటీవల గుజరాత్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో 29 బంతుల్లో 61 రన్స్ చేశాడు. ఇతడి స్ట్రైక్ రేట్ 195.71 గా ఉంది.
క్లాసెన్
హైదరాబాద్ జట్టు తరఫున ఆడుతున్న ఈ ఆటగాడు.. తుఫాన్ వేగంతో పరుగులు చేస్తున్నాడు. ఇప్పటివరకు ఐదు మ్యాచ్లు ఆడి 186 పరుగులు చేశాడు. ఇతడి స్ట్రైక్ రేట్ 193.75. ముంబై జట్టుపై 80 పరుగులు చేసి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
స్ట్రబ్స్
ఢిల్లీ జట్టుకు ఆడుతున్న ఈ ఆటగాడు.. ఐదు మ్యాచ్లలో 174 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 193.33. కీలక సమయంలో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడుతూ జట్టుకు ఆపద్బాంధవుడిగా నిలుస్తున్నాడు.
సునీల్ నరైన్
కోల్ కతా జట్టులో ఆడుతున్న ఈ ఆటగాడు.. నాలుగు మ్యాచ్లలో 161 రన్స్ చేశాడు. ఇతడి స్ట్రైక్ రేట్ 189.41 గా ఉంది. ఇటీవల ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్లో 85 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు.