TDP Action Plan: టీడీపీ పార్టీకి మూడుదశాబ్దాల చరిత్ర ఉంది. రాజకీయంగా ఎన్నో అటుపోట్లను, ఒడిదుడుకులను చవిచూసింది. ఎన్టీఆర్ హయాంలోనూ టీడీపీ ఒకసారి సంక్షోభానికి గురైంది. ఆ తర్వాత మళ్ళీ కోలుకుంది. ఇక చంద్రబాబు నాయుడి చేతిలోకి టీడీపీ పగ్గాలు వెళ్లాక కూడా ఇలాంటి సన్నివేశాలు పునరావృతమయ్యాయి. ఈనేపథ్యంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా ఎక్కువకాలం పనిచేసిన నాయకుడిగా రాజకీయాల్లో సరికొత్త రికార్డును నెలకొల్పారు.
చంద్రబాబు నాయుడికి గెలుపోటములు కొత్తమీకాదు. అయితే 2019లో ఆపార్టీ ఓడిన తీరు మాత్రం ఆయన్నీ బాగా కుంగదీసింది. రాష్ట్రంలో వైసీపీ ప్రభంజనం ముందు అంతకముందు ఐదేళ్లు అధికారంలో ఉన్న టీడీపీ కనీస పోటీ ఇవ్వలేకపోయింది. చంద్రబాబు నాయుడి కుమారుడు నారా లోకేష్ స్వయంగా మంగళగిరిలో ఓడిపోయారు. టీడీపీ భవిష్యత్ సీఎంగా చెప్పబడుతున్న లోకేష్ ఓటమి ఆపార్టీ నేతలను కలవరానికి గురిచేస్తోంది.
ఈక్రమంలోనే లోకేష్ నాయకత్వం, సమర్ధతపై టీడీపీలోనే లుకలుకలు మొదలయ్యాయి. లోకేష్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ పార్టీ నుంచి పలువురు నేతలు బయటికి వెళ్లారు. దీంతో ఆపార్టీ మరింత బలహీన పడింది. ఇక ఎన్నికలకు ముందు పలువురు వైసీపీ నేతలు టీడీపీలో చేరారు. వీరిలో కొందరు అధికార పార్టీలోకి తిరిగి వెళ్లగా మరికొందరు టీడీపీలోనే ఉంటూ వైసీపీకి కోవర్టుల్లాగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఇటీవల కాలంలో టీడీపీలో దీనిపై పెద్దఎత్తున చర్చ నడుస్తోందని సమాచారం.
కొంతమంది టీడీపీ నేతలు వైసీపీతో కలిసిపోయి పార్టీకి ద్రోహం చేస్తున్నారనే ఆరోపణలు ఇటీవలీ కాలంలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని పలువురు నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఇలాంటి వాళ్లను గుర్తించి బయటకు పంపాలని వారంతా చంద్రబాబుని వారంతా కోరుతున్నారు. ఇటీవల గురజాల, దాచేపల్లి ఎన్నికలపై చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన సమీక్షలో మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస రావు ఇలాంటి సంచలన వ్యాఖ్యలనే చేశారు.
కొంతమంది టీడీపీ నేతలు రాత్రిపూట వైసీపీ నాయకులతో సంప్రదింపులు జరిపే అలవాటును మానుకోవాలని చంద్రబాబు అన్నారు. దీంతో పార్టీకి ఎవరు ద్రోహం చేస్తున్నారనే చర్చ మొదలైంది. తాజాగా ఇదే అంశంపై మాజీ మంత్రి కేఎస్ జవహర్ ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Also Read: ‘రావాలి జగన్.. కావాలి జగన్’ అంటున్న టీడీపీ..!
‘కొంతమంది టీడీపీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీని కలవడంలో నిజం లేదా అని ప్రశ్నిస్తే.. నాతో చాలా మంది ఇదే అంశాన్ని ప్రస్తావించారు.. పార్టీకి ఎవరు అన్యాయం చేసినా తప్పే. వ్యాపారం, కులం, స్నేహం పరంగా పనిచేయడం సరైన పద్ధతి కాదు.. ఇలా వైసీపీతో సంబంధాలు ఉన్నవాళ్లు టీడీపీని వదిలి వెళ్తే మంచిది. పార్టీ బలపడాలంటే ఇలాంటివి ఉండకూడదు.. నిజాయతీగా ఉండేవాళ్లను పార్టీ ప్రోత్సహించాలి. .చంద్రబాబుతో ఈ విషయంపై మాట్లాడతా.. యరపతినేని వ్యాఖ్యల్లో నిజం ఉందని’ తెలిపారు.
ఇప్పటికే పార్టీకి ద్రోహం చేసేవారిని గుర్తించే ప్రక్రియ మొదలైందని త్వరలోనే వీరిని పార్టీ నుంచి గెంటివేయడం జరుగుతుందనే సంకేతాలను ఆయన పంపించారు. అయితే టీడీపీ నేతలు కోరుతున్నట్లుగా చంద్రబాబు నాయుడు ఇంటి దొంగలను పట్టుకొని బయటికి గెంటిస్తేనే పార్టీకి భవిష్యత్ ఉంటుందని లేకుంటే 2023లో టీడీపీ అధికారంలోకి రావడం కష్టమేననే సొంత పార్టీ నేతలు కామెంట్స్ చేస్తున్నారు. దీంతో చంద్రబాబు నాయుడు ఈ విషయంలో ఏం చేస్తారనేది మాత్రం ఆసక్తిని రేపుతోంది.
Also Read: ఎన్టీఆర్ కు వెన్నుపోటు: బాలయ్య కన్నీళ్లకు అర్థం ఉందా?