Tata Motors : దేశీయ కార్ల తయారీ దిగ్గజం టాటా మోటార్స్ ఏప్రిల్ 2025 అమ్మకాల గణాంకాలను రిలీజ్ చేసింది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం, ఈ కాలంలో దాదాపు 45,532 కార్లను విక్రయించింది. ఇది ఏప్రిల్ 2024లో విక్రయించిన 47,983 యూనిట్లతో పోలిస్తే 5 శాతం తక్కువ. ఈ గణాంకాల్లో దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలోని ICE (Internal Combustion Engine), EV (Electric Vehicle) మోడల్స్ రెండూ ఉన్నాయి.
టాటా మోటార్స్ వెల్లడించిన లెక్కల ప్రకారం.. దేశీయంగా ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 45,199 యూనిట్లుగా ఉన్నాయి. 2024 ఇదే కాలంలో కంపెనీ 47,883 యూనిట్లను విక్రయించింది. అంటే ఈ ఏడాది అమ్మకాలు 6 శాతం మేర తగ్గాయి. అయితే, టాటా మోటార్స్ అంతర్జాతీయ వ్యాపారం మాత్రం 233 శాతం వృద్ధిని నమోదు చేసింది. కంపెనీ దాదాపు 333 ప్యాసింజర్ వాహనాలను విదేశాల్లో విక్రయించింది. 2024 ఇదే కాలంలో ఈ సంఖ్య కేవలం 100 యూనిట్లుగా ఉంది.
Also Read : పెట్రోల్ ఖర్చులకు చెక్ పెట్టండి! టాటా టియాగో ఈవీపై బంపర్ ఆఫర్!
టాటా మోటార్స్ దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో పెరుగుతున్న అవసరాలను తీర్చేందుకు అనేక కొత్త మోడళ్లను ప్రవేశపెడుతుంది. అదే సమయంలో తన ఈవీ పోర్ట్‌ఫోలియోను బలోపేతం చేయడానికి కృషి చేస్తోంది. అయితే, ఏప్రిల్ నెలలో ఏడాదికేడాది ఈవీ అమ్మకాల్లో 16శాతం మేర క్షీణత నమోదు చేసింది. ఏప్రిల్ 2024లో 6,364 ఈవీ యూనిట్లను విక్రయించగా, ఏప్రిల్ 2025లో కేవలం 5,318 యూనిట్లను మాత్రమే విక్రయించగలిగింది. ఈ గణాంకాలు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలోని అమ్మకాలను కలిపి చూస్తే కనిపిస్తాయి.
ఇది కాకుండా, టాటా మోటార్స్ 2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తన అమ్మకాల గణాంకాలను కూడా విడుదల చేసింది. కంపెనీ దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో మొత్తం 5,56,263 కార్లను విక్రయించింది.ఇది మహీంద్రా అండ్ మహీంద్రా విక్రయాల కంటే ఎక్కువ. గత ఆర్థిక సంవత్సరంలో మహీంద్రా 5,51,487 యూనిట్ల వాహనాలను విక్రయించింది, ఇది కంపెనీకి వార్షికంగా అత్యధిక అమ్మకాలు. అయితే, 2025 ఆర్థిక సంవత్సరంలో టాటా కార్ల అమ్మకాలు 2024 ఆర్థిక సంవత్సరంలో విక్రయించిన 573,495 యూనిట్లతో పోలిస్తే మూడు శాతం తగ్గాయి.
టాటా మోటార్స్ అంతర్జాతీయ మార్కెట్లలో తన ఉనికిని విస్తరిస్తోంది. మార్చిలో కార్ల తయారీదారు శ్రీలంక మార్కెట్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. డీమోను తన అధీకృత పంపిణీదారుగా ఎంచుకుని, తన లైనప్ నుంచి ఏకంగా నాలుగు మోడళ్లను అక్కడ విడుదల చేసింది. వీటిలో పంచ్, నెక్సాన్, కర్వ్, టియాగో ఈవీ ఉన్నాయి. ఆ దేశంలో ఈ వాహనాల ధర LKR 8.7 మిలియన్ల నుంచి ప్రారంభమవుతుంది.
Also Read : భారీగా పడిపోయిన టాటా మోటార్స్ సేల్స్.. మరి స్టాక్ పరిస్థితేంటి.. అసలు ఇలా ఎందుకు జరిగింది ?