Tallikivandanam Viral Video: గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావడానికి చంద్రబాబు అండ్ కో ఇష్టానుసారంగా పథకాలు అమలు చేస్తామని చెప్పారు. ఏకంగా సూపర్ సిక్స్ పేరుతో ప్రజలకు సంక్షేమం అందిస్తామని గొప్పలు పోయారు. వారి మాటలు నమ్మిన ప్రజలు అధికారాన్ని అప్పగించారు. అంతకుముందు అధికారంలో ఉన్న వైసిపి సంక్షేమ పథకాల విషయంలో చెప్పిన మాటను నిలబెట్టుకోవడంలో విఫలమైంది. దీంతో కూటమి నాయకులైనా మాట మీద ఉంటారని భావించిన ఏపీ ప్రజలు అధికారాన్ని కట్టబెట్టారు. అధికారులకు వచ్చిన తర్వాత అనేక తర్జనభర్జనలు.. అనేక శషభిషల తర్వాత కూటమి నాయకులు తల్లికి వందనం అనే పథకానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా లబ్ధిదారులకు వారి ఖాతాలలో నగదు జమ అవుతుందని ప్రభుత్వ పెద్దలు ప్రకటించారు. అధికారులు కూడా అదే విషయాన్ని వెల్లడించారు. తల్లికి వందనం పథకాన్ని ప్రభుత్వ అధినేతలు నుంచి మొదలు పెడితే కిందిస్థాయి కార్యకర్తల వరకు గొప్పగా ప్రచారం చేసుకున్నారు. అయితే దీనికి వ్యతిరేకంగా వైసిపి ప్రచారం మొదలుపెట్టింది. సోషల్ మీడియాలో అధికార ప్రభుత్వాన్ని విమర్శించడం ప్రారంభించింది. ఇక వైసిపికి అనుకూలంగా పనిచేసే కొంత మంది నెటిజన్లు రకరకాల వీడియోలతో సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. కూటమి ప్రభుత్వాన్ని విమర్శించాలని ఏదో ఒక మార్గాన్ని ఎంచుకుంటున్నారు. అందులో ఓ వ్యక్తి చేసిన స్వీయ వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.
ఎటకారంకి అమ్మ మొగుడులా ఉన్నాడు ఈడు ఎవడో .#TallikiVandanam pic.twitter.com/s4ZstUoUkM
— అనిల్ (@AR_YSJ) June 12, 2025
ఆ వ్యక్తి మాట్లాడుతున్న మాటలను చూస్తుంటే అది రాయలసీమ యాస లాగా కనిపిస్తోంది.. అతడు మాట్లాడిన మాటలు వాస్తవ పరిస్థితిని వెల్లడిస్తున్నాయి..” గురువారం తల్లికి వందనం పథకానికి శ్రీకారం చుట్టారు. ఆరోజు బ్యాంకు సర్వర్లు ఫుల్ బిజీ. శుక్రవారం ఎలాగూ డబ్బులు తీసుకోవడం కుదరదు. ఎందుకంటే చాలామందికి సెంటిమెంట్లు ఉంటాయి. శనివారం సెకండ్ సాటర్ డే. ఆరోజు ఎలాగూ సెలవు ఉంటుంది. ఇక ఆదివారం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక సోమవారం తల్లికి వందనం డబ్బులు ఖాతాలో జమవుతాయి. ఇక అప్పట్నుంచి మీరు డబ్బులు తీసుకోవచ్చు. బ్యాంకుల్లో ఇబ్బంది పడకుండా.. తొక్కిసలాటకు గురికాకుండా డబ్బులను తీసుకొని.. పిల్లలకు పాఠ్యపుస్తకాలు, స్కూల్ బ్యాగులు కొనుగోలు చేయవచ్చు. వారికోసం బూట్లు, ఇతర సామాగ్రిని కొని బడికి పంపించవచ్చు” అని ఆ వ్యక్తి రాయలసీమ యాసలో మాట్లాడిన మాటలు ఆసక్తికరంగా ఉన్నాయి. అయితే దీనిపై టిడిపి నాయకులు కౌంటర్లు వేస్తున్నారు..” జగన్ హయాంలో తల్లికి వందనం స్కీం లో కోతలు మొదలయ్యాయి. ఆ తర్వాత ఆ పథకంలో అనేక షరతులు విధించారు. చివరికి లబ్ధిదారుల సంఖ్యను తక్కువ చేశారు. నాడు ఎన్నికల్లో గొప్పగా చేస్తామంటూ హామీ ఇచ్చి చివరికి ప్రజలకు పంగనామాలు పెట్టారు. ఇప్పుడు మా ప్రభుత్వంలో ప్రజలకు మంచి జరుగుతోంది. లబ్ధి చేకూరుతోంది. దీనిని చూసి తట్టుకోలేక కొంతమంది విమర్శలు చేస్తున్నారు. వారంతా ఒకసారి ఆలోచించుకోవాలి.. గతంలో తమ ప్రభుత్వంలో ఏం జరిగిందో ఆత్మ విమర్శ చేసుకోవాలి.. ఇలాంటి చవక బారు వీడియోల వల్ల సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తాయి ఏమోగానీ.. ప్రజల్లో ఓటు రావు. ప్రజలకు ఆల్రెడీ నమ్మకం ఉంది. ఎవరు ముంచేవారు? ఎవరు అభివృద్ధి చేసేవారు? అనే విషయాలలో ఒక క్లారిటీ ఉందని” టిడిపి నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.. అయితే ఆ వ్యక్తి మాట్లాడిన మాటలను.. దానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో వైసిపి అనుకూల నాయకులు తెగ సర్కులేట్ చేస్తున్నారు. అతడు మాట్లాడిన మాటలు చూస్తుంటే అతడు వైసిపి అభిమాని అని తెలుస్తోంది.