HomeNewsCorporate Colleges: పది రోజుల్లో ముగ్గురు.. కార్పొరేట్ చదువులు భారమయ్యాయి.. విద్యార్థులను బలిగొంటున్నాయి..

Corporate Colleges: పది రోజుల్లో ముగ్గురు.. కార్పొరేట్ చదువులు భారమయ్యాయి.. విద్యార్థులను బలిగొంటున్నాయి..

Corporate Colleges: చదువుకునే రోజులు పోయాయి.. చదువుకొనే రోజులు ఎప్పుడో వచ్చాయి. సౌకర్యాలు.. ర్యాంకులు, అనుభవం కలిగిన అధ్యాపకులను సాకుగా చూపి.. ఇష్టానుసారంగా కాలేజీలు ఓపెన్‌ చేస్తున్నాయి కార్పొరేట్‌ సంస్థలు. ఇందులో అడ్మిషన్ల పేరుతో లక్షల రూపాయలు ఫీజులు తీసుకుంటున్నాయి. తల్లిదండ్రులు కూడా కార్పొరేట్‌ కాలుజీలో చేర్పిస్తే తమ పిల్లల భవిష్యత్‌ బాగుంటుందని భావిస్తున్నారు. ఇదే ఆరాటాన్ని కార్పొరేట్‌ విద్యా సంస్థలు తమకు పెట్టుబడిగా మార్పుకుంటూ విద్యా వాప్యారాన్ని విస్తరిస్తున్నాయి. అందినకాడికి దోచుకుంటున్నాయి. మరోవైపు ఫీజులు తీసుకున్నాం కాబట్టి విద్యార్థుల సామర్థ్యానికి మించి చదువులపై ఒత్తిడి చేస్తున్నారు. తిట్టడం, కొట్టడం, అవమానించడం లాంటి ఘటనలు నిత్య కృత్యమయ్యాయి. ఇటు తల్లిదండ్రులకు ఏమీ చెప్పుకోలేక.. అటు చదవలేక విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. పది రోజుల వ్యవధిలో ముగ్గురు విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇక కట్టడి చేయాల్సిన పాలకులు, అధికారులు చోద్యం చూస్తున్నారు.

నారాయణ కళాశాలలో…
బీబీనగర్‌ మండలం పెద్దపలుగు తండాకు చెందిన భానోత్‌ తనూష్‌నాయక్‌(18) తల్లిదండ్రులు నగరానికి వలస వచ్చారు. కుషాయిగూడలో నివాసం ఉంటున్నారు. అన్నోజిగూడలోని నారాయణ జూనియర్‌ కలేజీలో తనుష్‌ను ఇంటర్‌ (ఎంపీసీ) ఫస్ట్‌ ఇయర్‌ లో చేర్పించారు. సోమవారం(డిసెంబర్‌ 2న) సాయంత్రం హాస్టల్‌ బాత్‌రూంలోకి వెళ్లి ఎంతసేపటికీ బయటకు రాలేదు. దీంతో విద్యార్థులు తలుపులు పగుల గొట్టి లోనికి వెళ్లి చూడగా ఉరికి వేలాడుతూ కనిపించాడు. సిబ్బంది వెంటనే తనుష్‌ను ఆస్పత్రికి తరలించారు. పరిశీలింన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. తనుష్‌ ఫిట్స్‌తో చనిపోయాడని యాజమాన్యం బుకాయిస్తోంది. ఒత్తిడి కారణంగానే ఆత్మహత్య చేసుకున్నాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

ఎన్‌ఎస్‌ఆర్‌ కళాశాలలో…
నిజామాబాద్‌ జిల్లా మోపాల్‌ మండలం చిన్న తండాకు చెందిన ప్రజ్ఞారెడ్డి ప్రగతినగర్‌లోని ఎన్‌ఎస్‌ఆర్‌ ఇంపల్స్‌ ఐఐటీ గల్స్‌ క్యాంపస్‌లో ఎంపీసీ సెకండియర్‌ చదువుతోంది. కళాశాల హాస్టల్‌లో ఉంటోంది. సోమవారం ఉదయం 9:30 గంటలకు తాను ఉంటున్న హాస్టల్‌లో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకుంది. యాజమాన్యం విషయం దాచి మతదేహాన్ని హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలించింది. ప్రజ్ఞరెడ్డి మతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకుందా లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఫీజు చెల్లించాలని ఒత్తిడి చేయడంతో….
సూర్యపేట జిల్లా కోదాడలోని స్నేహ నర్సింగ్‌ కళాశాలలో అసోం రాష్ట్రానికి చెందిన నర్గీస్‌ పర్వీన్‌ బీఎస్సీ సెకండియర్‌ చదువుతోంది. కాలేజీ ఫీజు చెల్లింపు ఆలస్యమైంది. దీంతో యాజమాన్యం విద్యార్థినిపై ఫీజు కోసం ఒత్తిడి చేసింది. దీంతో గత బుధవారం(నవంబర్‌ 27న) కాలేజీ హాస్టల్‌లోని తన గదిలో శానిటైజర్‌ తాగింది. గమనించిన సహచర విద్యార్థులు సూర్యపేట ఆస్పత్రికి తరలించగా కోలుకుంటోంది.

మంత్రి సీరియస్‌..
ఇంటర్‌ కాలేజీల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై మంత్రి కోమటిరెడ్డి సీరియస్‌ అయ్యారు. పది రోజుల వ్యవధిలో ముగ్గురు బలవన్మరణానికి పాల్పడడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ర్యాంకుల పేరిట విద్యార్థులపై మానసిక ఒత్తిడి మానుకోవాలని కాలేజీల యాజమాన్యాలకు సూచించారు. విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న కాలేజీల యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులు కూడా క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకోవద్దని కోరారు. చావు సమస్యకు పరిష్కారం కాదన్నారు. తత్యవసరమైతే తన కార్యాలయం నంబర్‌ 8688007954కు లేదా minirter.randbc@fmai.com కు ఈమెయిల్‌కు తెలియజేయాలని సూచించారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version