Dwarampudi Chandrasekhar Reddy: ఏపీ డిప్యూటీ సీఎం చిత్తశుద్ధి గురించి శంకించాల్సిన పనిలేదు. ప్రతిపక్షంలో ఉన్నా.. అధికారపక్షంలో ఉన్నా ప్రజలకు న్యాయం జరగాలని ఎక్కువగా భావిస్తారు. అందుకు అనుగుణంగా పనిచేస్తారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పవన్ హోం మంత్రి అవుతారని అంతా భావించారు. ఎందుకంటే ముఖ్యమంత్రి తర్వాత అంతా పవర్ ఫుల్ పదవి అదే. కానీ పవన్ అలా కోరుకోలేదు. ఐదు కీలక మంత్రిత్వ శాఖలను తీసుకున్నారు. అందులో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ కీలకమైనవి. అయితే ఇక్కడే మరో ట్విస్ట్. తన స్నేహితుడు, జనసేనలో నెంబర్ 2 గా ఎదిగిన నాదెండ్ల మనోహర్ కు పౌర సరఫరాల శాఖను కట్టబెట్టారు. దీని వెనుక పక్క ప్లాన్ ఉంది. అసలు పౌరసరఫరాల శాఖలో ఏం జరుగుతోంది? ఐదేళ్ల వైసిపి పాలనలో ఏం జరిగింది? అనే విషయాలను తెలుసుకోవడం పై ఆయన దృష్టి పెట్టారు. దీనిపై ఒక స్పష్టత వచ్చాక పవన్ రంగంలోకి దిగారు. కాకినాడ పోర్టులో విస్తృత తనిఖీలు చేపట్టారు. అయితే ఇప్పటికీ వైసీపీకి విధేయులైన అధికారులు, ఉద్యోగులు ఉన్న విషయాన్ని గుర్తించారు. వాస్తవానికి కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే అటువంటి అధికారులపై వేటు పడింది. చాలామంది బదిలీలు జరిగాయి. అయితే కొంతమంది లాబీయింగ్ చేసుకుని ఇక్కడే ఉండిపోయారు. అటువంటి వారే ఇప్పుడు రేషన్ దందాకు సహకరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అందుకే పవన్ కళ్యాణ్ సైతం అధికారులపై సీరియస్ అయ్యారు.
* ఆ పర్యటనల వెనుక స్కెచ్
గత ఆరునెలల కాలంలో పవన్ కాకినాడ వెళ్లారు. అయితే డిప్యూటీ సీఎం, ఆపై జిల్లా మంత్రి కావడంతోనే వచ్చి వెళ్లారని అంతా భావించారు. కానీ పవన్ వచ్చిన ఉద్దేశం వేరు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వ్యవహారాలపై ఆరా తీసేందుకేనని తాజాగా తెలుస్తోంది. ఏకకాలంలో ద్వారంపూడి పరిశ్రమలపై పర్యావరణ శాఖ దృష్టి పెట్టింది. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ద్వారంపూడి పరిశ్రమలను మూసివేస్తోంది. ఇప్పటికే రొయ్యలను శుద్ధి చేసే కంపెనీని ప్రభుత్వం మూసేసింది. తాజాగా వీరభద్ర ఎక్స్ పోర్ట్స్ పేరుతో ఉన్న మరో కంపెనీని కూడా మూసేసింది. నిబంధనలకు విరుద్ధంగా పరిశ్రమల నిర్వహణ, నోటీసులకు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఈ చర్యలకు ఉపక్రమించింది.
* కూలిపోతున్న ద్వారంపూడి వ్యాపారాలు
అయితే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి విషయంలో పవన్ కళ్యాణ్ పక్కా ప్లాన్ తోనే ముందుకు అడుగు వేసినట్లు తెలుస్తోంది. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆగడాలు పెచ్చుమిరాయి. పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి. జన సైనికులపై దాడులు చేసిన ఉదంతాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పై శపధం చేశారు. తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నీ అన్యాయాలను, అక్రమాలను, అవినీతిని వెలికి తీసి నడి రోడ్డుపై నిలబెట్టకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు అని ప్రతిజ్ఞ చేశారు. అయితే దీనిపై ద్వారంపూడి స్పందించి ముందు నువ్వు గెలిచి చూడు అంటూ సెటైర్ వేశారు. అయితే అదే ద్వారంపూడి తప్పయింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ద్వారంపూడి వ్యాపార కోటలు కూల్చివేత ప్రారంభం అయ్యింది. గత ఆరు నెలలుగా పక్క ఆధారాలు సేకరించి స్కెచ్ వేశారు పవన్. ద్వారంపూడిని అష్టదిగ్బంధనం చేయగలిగారు.