Inter Results: విద్యార్థి జీవితంలో ఇంటర్ టర్నింగ్ పాయింట్. సంక్లిష్టమైన ఈ దశలో బాగా చదివి మంచి మార్కులు సాధించిన విద్యార్థి జీవితంలో సక్సెస్ అవుతాడు అంటారు విద్యావేత్తలు. ఇక్కడ పునాది ఎంత దృఢంగా నిర్మించుకుంటే భవిష్యత్ అంత సాఫీగా సాగుతోందని పేర్కొంటారు. తాజాగా తెలంగాణలో ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో సింగరేణి నల్ల బంగారు నేలపై పుట్టిన విద్యార్థిని మెరిసింది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన సింగరేణి కార్మికుడు ప్రకాష్ కూతురు స్ఫూర్తి 992 మార్కులతో సత్తా చాటింది. గోదావరిఖని కాకతీయ జూనియర్ కాలేజీలో చదివిన స్ఫూర్తి ఇంటర్ ఫలితాల్లో కాలేజీ టాపర్‌గా నిలిచింది.
అధ్యాపకులు, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో..
స్ఫూర్తి.. చదవులో ఎంతో మంది విద్యార్థులకు స్ఫూర్తిగా నిలిచింది. కార్పొరేట్ కళాశాలల్లో చదివితేనే మంచి మార్కులు వస్తాయని, స్టేట్ ర్యాంకులు సాధించవచ్చని జరుగుతున్న ప్రచారం తప్పని నిరూపించింది. కష్టపడే తత్వం, అధ్యాపకులు, తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉంటే ఏ కాలేజీలో చదివినా మంచి ఫలితం సాధించవచ్చని నిరూపించింది. ఎంపీసీ విభాగంతో చిన్న కాలేజీలో చదివి ఏకంగా 1000 మార్కులకు 992 సాధించి రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించింది.
కార్మికుడి బిడ్డను..
ఇక ఫలితాల అనంతరం స్ఫూర్తి మాట్లాడుతూ తాను సింగరేణి కార్మికుడి బిడ్డనని గర్వంగా చెప్పారు. నాకు వచ్చిన మార్కులు చూసి అమ్మానాన్న, కుటుంబ సభ్యులు చాలా సంతోషం వ్యక్తం చేశారన్నారు. వారి కష్టమంతా నా మార్కులతోనే మర్చిపోయారని తెలిపింది. తనకు చాలా ఇష్టమైనది మ్యాథ్స్ సబ్జెక్టు అని పేర్కొంది. ఎంసెట్ రాసి బీటెక్ చేసి ఇంజినీర్ అవుతానని వెల్లడించింది. ఉద్యోగం చేసి తల్లిదండ్రుల కష్టాలు తీరుస్తారని చెప్పింది.