దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. దేశంలో రోజుకు దాదాపు నాలుగు లక్షల కరోనా కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం కరోనా సోకుతున్న వారిలో యువత ఎక్కువ సంఖ్యలో ఉండటం గమనార్హం. అయితే ఒకసారి కరోనా సోకిన వాళ్లకు మళ్లీ కరోనా సోకే అవకాశం ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. లాన్సెంట్ రెస్పిరేటరీ మెడిసిన్ జర్నల్ ఈ అధ్యయనానికి సంబంధించిన ఫలితాలను ప్రచురించింది.
కరోనా ఫస్ట్ టైమ్ సోకిన సమయంలో యాంటీబాడీలు ఎక్కువరోజులు ఉండడం లేదని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్నవారికి రెండోసారి కరోనా సోకే అవకాశాలు ఉంటాయని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. ఇకాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు అమెరికా నౌకాదళానికి చెందిన 3,000 మంది యువ రిక్రూటర్లపై అధ్యయనం చేసి ఈ విషయాలను వెల్లడించారు. ఈ 3,000 మందిలో 189 మందికి రెండుసార్లు కరోనా సోకింది.
అయితే రెండోసారి కరోనా బారిన పడిన వారిలో చాలామందిలో వైరస్ కు సంబంధించిన ఎటువంటి లక్షణాలు కనిపించలేదు. కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా మాత్రమే యువత వైరస్ బారిన పడకుండా ఉండే అవకాశం ఉంటుంది. కరోనా నుంచి కోలుకుని నెగిటివ్ వచ్చినా నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని శాస్త్రవేత్తలు సూచనలు చేస్తున్నారు. కరోనా సోకితే సొంత వైద్యం చేసుకోవద్దని సూచిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో సొంత వైద్యం చేసుకోవడం వల్ల పలువురు ప్రాణాలు కోల్పోయారు. కరోనా నిర్ధారణ అయితే వైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తే కరోనా నుంచి త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది.