ఈ తెల్లవారుజామున మూడు గంటల సమయంలో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకే, అతి పెద్ద చేదు సంఘటన జరిగింది. ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు కె.వి.ఆనంద్(54) గుండెపోటుతో మరణించారు. దర్శకుడిగా తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న ఆనంద్ సినీ కెరీర్ లో ఎన్నో గొప్ప చిత్రాలు తీశారు. ముఖ్యంగా ఆయన సినీ ప్రస్థానం కూడా ఎంతో విభిన్నమైనది. ఒక చిన్న స్టిల్ ఫోటోగ్రాఫర్ గా కెరీర్ ను మొదలుపెట్టి.. ఆ తరువాత తక్కువ టైంలోనే ‘తెన్నావిన్ కోంబత్’ అనే మలయాళీ చిత్రంతో సినిమాటోగ్రాఫర్ గా మారి మొదటి సక్సెస్ అందుకున్నారు.
ఆ తరువాత కాలంలో ఆయన తమిళం, మలయాళంతో పాటు తెలుగులో అలాగే బాలీవుడ్ లో కూడా పలు సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పని చేసి తనకంటూ మంచి డిమాండ్ ను క్రియేట్ చేసుకున్నారు. ఆయన కెమెరామెన్ గా వచ్చిన ‘తెన్నావిన్ కోంబత్’ అనే చిత్రానికిగానూ కె.వి.ఆనంద్ కు ఏకంగా జాతీయ అవార్డు వరించింది అంటేనే ఆనంద్ కెమరా గొప్ప తనం గురించి అర్థమవుతుంది.
ఇక ఆనంద్ సినిమా దర్శకుడిగానూ సూపర్ సక్సెస్ అయ్యారు. అయన తీసిన పలు చిత్రాలు ఇప్పటికీ క్లాసిక్ గానే నిలిచాయి. ముఖ్యంగా జీవాతో తెరకెక్కించిన రంగం(కో) సినిమాతో అటు తమిళంతో పాటు ఇటు తెలుగులోనూ భారీ హిట్ కొట్టి.. తన సినిమాల శైలి విభిన్నమైనది అని నిరూపించుకున్నారు. దర్శకుడిగా ఆ తరువాత కూడా ఆయన బ్రదర్స్(మాట్రాన్), అనేకుడు(అనేగన్), కవన్, బందోబస్త్(కాప్పాన్) లాంటి సినిమాలు తీసి మంచి విజయాలనే అందుకున్నారు.
ఇక కె.వి.ఆనంద్ మృతి పై చిత్ర పరిశ్రమ దిగ్బ్రాంతిని వ్యక్తం చేసింది. ఏది ఏమైనా ఈ మధ్య కాలంలో తమిళ సినీ ఇండస్ట్రీకి వరుస షాకులు మీద షాక్ లు తగులుతున్నాయి. ఆనంద్ మరణ వార్తతో తమిళ పరిశ్రమలో విషాదఛాయలు అలముకున్నాయి. మా ‘ఓకేతెలుగు.కామ్’ తరఫున ఆనంద్ మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.