Telangana: తెలంగాణలో అమల్లోకి ఎన్నికల కోడ్; 5 లక్షల నగదు పట్టివేత

సోమవారం మధ్యాహ్నం ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రారంభోత్సవం, రాంజీ గోండు స్మారక ట్రైబల్ మ్యూజియం శంకుస్థాపనకు అధికారులు ఏర్పాటు చేయగా.. ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో అవన్నీ నిలిచిపోయాయి.

Written By: Bhaskar, Updated On : October 9, 2023 6:30 pm
Follow us on

Telangana: కేంద్ర ఎన్నికల సంఘం దేశంలోని ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సోమవారం షెడ్యూల్ ప్రకటించింది. తెలంగాణ, ఛత్తీస్ గడ్, మధ్యప్రదేశ్, మిజోరాం, రాజ స్థాన్ రాష్ట్రాలలో శాసనసభలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ 30న పోలింగ్ నిర్వహించనున్నారు. డిసెంబర్ 3న కౌంటింగ్ జరిపి ఫలితాలు ప్రకటిస్తారు. ఎన్నికల సంఘం ప్రకటన వెలువరించిన నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ క్రమంలో శంకుస్థాపనలు, అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు ఆగిపోయాయి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు చివరి క్షణంలో నిలిచిపోయాయి..

సోమవారం మధ్యాహ్నం ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రారంభోత్సవం, రాంజీ గోండు స్మారక ట్రైబల్ మ్యూజియం శంకుస్థాపనకు అధికారులు ఏర్పాటు చేయగా.. ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో అవన్నీ నిలిచిపోయాయి. సోమవారం ఉదయం కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి కొన్ని రైళ్లను ప్రారంభించారు. హడప్సర్_ హైదరాబాద్ ఎక్స్ప్రెస్ ను కాజీపేట వరకు, జైపూర్_ కాచిగూడ ఎక్స్ప్రెస్ ను కర్నూలు పట్టణం వరకు, నాందేడ్_ తాండూర్ ఎక్స్ప్రెస్ ను రాయచూర్ వరకు, కరీంనగర్_ నిజామాబాద్ ప్యాసింజర్ ను బోధన్ వరకు ప్రారంభించారు.

ఇక ఎన్నికల సంఘం ప్రకటించిన వివరాల ప్రకారం నవంబర్ 23న రాజస్థాన్ రాష్ట్రంలో పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడతాయి. మిజోరం రాష్ట్రంలో నవంబర్ 7న పోలింగ్ జరుగుతుంది. చత్తీస్గడ్ రాష్ట్రంలో రెండు దశల్లో ఎన్నికలు జరుగుతాయి. మొదటి దశలో నవంబర్ 7న, రెండవ దశలో నవంబర్ 17న పోలింగ్ జరుపుతారు. ఈ అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఫలితాలు డిసెంబర్ మూడున వెలువడతాయి. ఎన్నికల్లో పారదర్శకత కోసం అదనంగా 1.1 లక్షల బూత్ లకు వెబ్ కాస్టింగ్ సౌకర్యాన్ని కల్పించనున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వాల పరంగా ఎటువంటి హామీలు, అధికారిక ప్రకటనలు, జీవోలు జారీ చేసేందుకు అవకాశం ఉండదు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరిహద్దు ప్రాంతమైన ఖమ్మం జిల్లాలో పోలీసులు తనిఖీలు ప్రారంభించారు. ఖమ్మం జిల్లా వైరాలో ఒక కారులో తరలిస్తున్న ఐదు లక్షల నగదును పట్టుకున్నారు. అయితే ఈ నగదుకు సంబంధించి సరైన ఆధారాలు చూపించకపోవడంతో పోలీసులు దానిని తమ ఆ ధీనంలో ఉంచుకున్నారు. రెవెన్యూ అధికారుల సమక్షంలో పంచనామా నిర్వహించారు. తమకు పూర్తి వివరాలు సమర్పిస్తే ఆ నగదును తిరిగి వారికి ఇచ్చేస్తామని పోలీసులు ప్రకటించారు.