Nara Lokesh Working President: టీడీపీ అధినేత చంద్రబాబు(TDP Chief Chandrababu) రాజకీయ వ్యూహం పక్కా ఉంటుంది. పార్టీలో ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు దాని కోసం బలంగా చర్చ జరగాలని భావిస్తారు. ఏకాభిప్రాయానికి ఎక్కువ శాతం ప్రయత్నిస్తారు. అందుకు తగ్గట్టు సానుకూలత వచ్చిన తరువాతే నిర్ణయం తీసుకుంటారు. ఆది నుంచి అదే వ్యూహం. ఇప్పుడు లోకేష్ కు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి విషయంలో సైతం అదే ఫార్ములాను అనుసరించారు. మహానాడు వేదికగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రకటన ఉంటుందని అంతా భావించారు. అనుకూల మీడియాలో సైతం దీనిపైనే పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. వ్యతిరేక మీడియాలో సైతం ఇదే హైలెట్ అయ్యింది. కానీ అందరి అంచనాలను తెరదించుతూ..మహానాడులో అటువంటి ప్రకటన రాలేదు. దీంతో పార్టీ శ్రేణుల్లో నిరాశ వ్యక్తమైంది. అయితే ఈ విషయంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. లోకేష్ పదోన్నతికి సంబంధించి ప్రజలతో పాటు పార్టీ శ్రేణుల్లో చర్చకు తెరలేపారు. లోకేష్ పై ప్రజలకు ఉన్న అభిప్రాయాన్ని, సానుకూలతలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. అదే సమయంలో లోకేష్ పై ఉన్న అపోహలు, అప నమ్మకాలను పోయేలా సైతం సీనియర్లు, జూనియర్లతో మద్దతుగా మాట్లాడించారు.
Also Read: ప్రతినెలా 15వ తేదీ వరకు బియ్యం పంపిణీ: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
మహానాడులో ప్రత్యేక ఆకర్షణగా లోకేష్..
ఈసారి టీడీపీ మహానాడు (TDP Mahanadu) అజెండా చూస్తే లోకేష్ ను ప్రొజెక్టు చేసేందుకు పక్కగా పనిచేసిందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే టీడీపీ భావి నాయకుడిగా లోకేష్ ను చూపించే ప్రయత్నం గట్టిగానే జరిగింది. యనమల రామక్రిష్ణుడు లాంటి సీనియర్ నేతలు పక్కకు వెళ్లిపోయారు. కింజరాపు రామ్మోహన్ నాయుడులాంటి నేతలు క్రియాశీలకంగా కనిపించారు. మహానాడు వేదికగా జూనియర్లకు ఈసారి మాట్లాడేందుకు అవకాశమిచ్చారు. అచ్చంగా చెప్పాలంటే లోకేష్ టీమ్ తోనే మాట్లాడించారన్న మాట. దాదాపు మాట్లాడిన వారంతా ఎన్టీఆర్, చంద్రబాబుతో పాటు లోకేష్ గురించి ప్రస్తావించారు. తద్వారా వారిద్దరి తరువాత టీడీపీ పగ్గాలు లోకేష్ కే అని తేలిపోయింది. ఈ విషయంలో చంద్రబాబు ఆలోచనకు తగ్గట్టుగానే మహానాడులో వ్యూహం ప్రకారం అంతా జరిగిపోయింది. అలా పూర్తి చేశారు కూడా.
ఒంటిచేత్తో దశాబ్దాలుగా పగ్గాలు..
నాలుగు దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీని (Telugudesam Party) తన చేతిలో పెట్టుకున్నారు చంద్రబాబు. సగటు టీడీపీ కార్యకర్త అభిప్రాయం తెలుసు. వారి విషయంలో ఎలా వ్యవహరించాలో చంద్రబాబుకు తెలుసు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన చంద్రబాబు టీడీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. ఫలితాలు వచ్చిన కొద్దిరోజులకే టీడీపీలో చేరారు. కానీ 1985 మధ్యంతర ఎన్నికల్లో పోటీచేయలేదు. కేవలం టీడీపీ వ్యవహారాలు చూసుకుంటానని ఎన్టీఆర్ కు చెప్పారు. అది మొదలు సగటు టీడీపీ నాయకుడి నుంచి కార్యకర్త వరకూ అందరితో సంబంధాలు ఏర్పాటుచేసుకున్నారు. అనతికాలంలోనే పార్టీ యావత్ ను తన స్వాధీనంలోకి తెచ్చుకున్నారు. 1995లో టీడీపీలో సంక్షోభ సమయంలో ఎన్నెన్నో ప్రశ్నలు, చిక్కుముళ్లను అధిగమించారు చంద్రబాబు. పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు, చివరికి నందమూరి కుటుంబసభ్యులు నందమూరి తారక రామారావును కాదని ..చంద్రబాబు వైపు మొగ్గుచూపారంటే పార్టీ శ్రేణుల్లో ఆయనపై అపార నమ్మకమే కారణం. అయితే దానిని వెన్నుపోటు అని..రాజకీయ దురాక్రమణ అని విశ్లేషకులు, ప్రత్యర్థులు రకరకాల పేర్లు పెట్టారు. కానీ ప్రజలు మాత్రం చంద్రబాబును ఆమోదించారు. పార్టీ శ్రేణులు మూడు దశాబ్దాల పాటు ఆయన నాయకత్వంలో పనిచేసిందంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.
పార్టీ శ్రేణులకు దగ్గరగా లోకేష్…
ఇప్పుడు లోకేష్(Nara Lokesh) సైతం పార్టీ శ్రేణుల్లో అదే ఆత్మస్థైర్యాన్ని నింపారు. లోకేష్ క్రియాశీలకం అయిన తరువాత తెలుగుదేశం పార్టీ శ్రేణుల బాగోగులు చూసుకుంటున్నారన్న నమ్మకం కుదిరింది. దశాబ్ద కాలం కిందట ఇదే టీడీపీ శ్రేణులకు సైతం లోకేష్ పై ఎంతమాత్రం నమ్మకం లేకుండా పోయింది. కానీ పదేళ్లలో అన్నిరకాల ఇబ్బందులను అధిగమించారు లోకేష్. సీనియర్ల నుంచి కూడా అభ్యంతరాలు తొలగిపోయాయి. వారు సైతం లోకేష్ కు జైకొట్టక తప్పని పరిస్థితి. అటు చంద్రబాబు సమకాలీకులైన సీనియర్ల వారసులు సైతం లోకేష్ టీమ్ లోకి వస్తున్నారు. లోకేష్ వచ్చిన తరువాత టీడీపీ కార్యకర్తలు తలెత్తుకొని తిరుగుతున్నారని.. వారిని అన్నివిధాలా కాపాడుకోవడంలో సక్సెస్ అయ్యారని మహానాడు వేదికగా టీడీపీ నాయకులతోనే చెప్పించారు. లోకేష్ కు ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వకపోవచ్చు కానీ..భవిష్యత్ లో పార్టీ పగ్గాలు ఆయనేవనని మాత్రం స్పష్టమైన సంకేతాలు పంపగలిగారు.