NaMo Drone Didi Scheme: ఏపీ ప్రభుత్వం( AP government ) వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. రాష్ట్రాన్ని డ్రోన్ల హబ్ గా మార్చాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అన్ని రంగాల్లో డ్రోన్ల వినియోగం పెంచాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో సైతం డ్రోన్ల సేవలు పెరగాలని ఆశిస్తోంది. తద్వారా సాగు పెట్టుబడులు తగ్గడంతో పాటు నిరుద్యోగ యువతకు ఉపాధి మార్గాలు దొరికే అవకాశం ఉంటుందని భావిస్తోంది. అయితే వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగానికి సంబంధించి డ్వాక్రా మహిళలకు భాగస్వామ్యం కల్పించాలని నిర్ణయించింది. డ్వాక్రా మహిళలకు వ్యవసాయంలో సహాయం చేయడానికి వీలుగా రాయితీపై డ్రోన్లను అందించాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నమో డ్రోన్ దీదీ పథకాన్ని ఏపీలో డ్వాక్రా మహిళలకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిజంగా ఇది డ్వాక్రా సంఘాల సభ్యులకు శుభవార్త.
పెరిగిన పెట్టుబడులు..
వ్యవసాయంలో( cultivation) విపరీతమైన పెట్టుబడులు పెరిగిపోయాయి. కూలీల కొరత కూడా అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో డ్రోన్లను వినియోగిస్తే సాగు పెట్టుబడులు తగ్గడంతో పాటు నిరుద్యోగ యువతకు ఉపాధి పెరిగే అవకాశం ఉంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరించింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. అయితే ఏపీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు డ్వాక్రా మహిళలకు రాయితీపై డ్రోన్లను అందించేందుకు కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పథకం ద్వారా డ్వాక్రా మహిళలకు 80% రాయితీతో డ్రోన్లను అందిస్తారు. ఈ ఏడాది 440 మందికి పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
పెరుగుతున్న వినియోగం..
ఇప్పటికే అనేక రంగాల్లో డ్రోన్లు( drones ) సేవలు అందిస్తున్నాయి. వ్యవసాయ రంగంలో కూడా వినియోగిస్తున్నారు. ఒక్కో డ్రోన్ సామర్థ్యం బట్టి పది లక్షల రూపాయల వరకు ఉంటుంది. తాజాగా డ్వాక్రా మహిళలకు సంబంధించి 80% రాయితీ అందించనున్నారు. అంటే అక్షరాల ఎనిమిది లక్షల రూపాయల రాయితీ అన్నమాట. మరోవైపు ప్రభుత్వానికి కట్టాల్సిన రెండు లక్షల రూపాయలను సైతం బ్యాంకు లింకేజీ లేదా స్త్రీ నిధి మంచి రుణాలుగా అందించాలని ప్రభుత్వం భావిస్తోంది.
Also Read: రైతుల ఖాతాలో రూ.7,000.. ముహూర్తం ఫిక్స్!
లబ్ధిదారుల గుర్తింపు..
వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగం పెరిగితే పెట్టుబడులు తగ్గే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రైవేటు డ్రోన్లు వ్యవసాయ రంగంలో ప్రవేశించాయి. అద్దె రూపంలో వాటికి చెల్లింపులు చేయాల్సి వస్తోంది. అందుకే డ్వాక్రా మహిళలకు ఇస్తే వారికి ఉపాధి మెరుగు అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే సెర్ఫ్ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా 88 మంది లబ్ధిదారులను గుర్తించారు. మిగతా వారి ఎంపికపై కూడా దృష్టి పెట్టారు. అయితే ఇలా అందిస్తున్న డ్రోన్లు 15 కిలోల కంటే తక్కువ బరువు కలిగి ఉండడం వల్ల.. వాటిని తీసుకెళ్లడం కూడా చాలా సులభంగా ఉంటుంది. ఇవి బ్యాటరీతో పనిచేస్తాయి. ఎకరా పొలానికి ఐదు నుంచి ఏడు నిమిషాల్లో డ్రోన్లు రసాయనాలను పిచికారి చేయగలవు. వీటి వినియోగం వల్ల రసాయనాల వాడకం 10% తగ్గుతుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నమో డ్రోన్ దీదీ పథకం అమలవుతోంది. ఏపీలో వినూత్నంగా డ్వాక్రా సంఘాలకు ఈ డ్రోన్లను అప్పగించడం ద్వారా ఆర్థిక బలోపేతానికి కృషి చేసినట్టు అవుతుంది. ఏపీ ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. త్వరలో వీరికి డ్రోన్లను అందించనుంది.