Nagari MLA Bhanu: ఏపీ రాజకీయాల్లో( AP politics) నగిరిది ప్రత్యేక స్థానం. అంతలా హాట్ టాపిక్ అయ్యింది ఆ నియోజకవర్గం. ఆ నియోజకవర్గానికి రెండుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన సినీనటి రోజా తన మార్కు చూపించేవారు. వైసిపి హయాంలో మంత్రి పదవి చేపట్టి నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేసేవారు. అయితే ఇప్పుడు అదే వివాదాస్పద వ్యాఖ్యల బాధితురాలిగా ఆమె మారడం విశేషం. ప్రస్తుతం ఆమెపై గాలి ముద్దుకృష్ణమనాయుడు కుమారుడు గాలి భాను ప్రకాష్ పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే నగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే భాను ప్రకాష్ అవినీతికి తెర తీశారని తరచూ రోజా ఆరోపిస్తుంటారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే భాను ప్రకాష్ రోజాను టార్గెట్ చేసుకున్నారు. ఇప్పుడు అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కూటమి ఎమ్మెల్యే తీరుపై చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మాజీ మంత్రి రోజా విసుర్లు
నగిరి ఎమ్మెల్యే భాను ప్రకాష్ ( Nagari MLA Bhanu Prakash ) అవినీతికి అడ్డే లేకుండా పోయిందని.. అన్ని రకాల మాఫియాలను తన చెప్పు చేతల్లో పెట్టుకున్నారని రోజా తనదైన రీతిలో ఎమ్మెల్యే భాను ప్రకాష్ పై విరుచుకుపడ్డారు. అయితే దీనిపై సీరియస్ అయ్యారు ఎమ్మెల్యే భాను ప్రకాష్. ఎమ్మెల్యే రోజా రెండు వేలకు దేనికైనా తెగిస్తారని.. ఎంతస్థాయికైనా దిగజారి పోతారని.. ఏ పనైనా చేస్తారని.. ఇది తాను అన్నమాట కాదని.. పబ్లిక్ మాట గా చెప్పుకొచ్చారు. అంతటితో ఆగకుండా రోజా భర్త, సోదరుల సైతం భారీ అవినీతికి పాల్పడ్డారని వ్యాఖ్యానించారు ఎమ్మెల్యే భాను ప్రకాష్. ఓ బహిరంగ సమావేశంలో అయితే రోజా హీరోయిన్ కు తక్కువ.. వాంపునకు ఎక్కువ అని వ్యాఖ్యానించారు.
Also Read:
మహిళా నేతపై ఆ వ్యాఖ్యలు ఏమిటి?
అయితే ఓ ఎమ్మెల్యే ఇలా ఓ మహిళా నేత గురించి మాట్లాడడం మాత్రం విమర్శలకు తావిస్తోంది. అలాగని మాజీ మంత్రి రోజా( ex minister Roja) ఏం తక్కువ కాదు. ఆమె సైతం తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. గతంలో చాలా సందర్భాల్లో చేశారు. ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ క్రమశిక్షణగా మెలగాలని తరచూ చంద్రబాబు చెబుతుంటారు. కానీ అధికార పార్టీ ఎమ్మెల్యే ఏకంగా.. ఓ మహిళా నేతను అలా కించపరుస్తూ మాట్లాడడం మాత్రం ఎంత మాత్రం సబబు కాదని సోషల్ మీడియాలో ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి. గాలి భాను ప్రకాష్ తీరును ఎక్కువమంది వ్యతిరేకిస్తున్నారు. తప్పు పడుతున్నారు. అటువంటప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల మాదిరిగానే.. టిడిపి ఎమ్మెల్యేలు నోటికి పని చెబితే ఏంటని ఎద్దేవా చేస్తున్న వారు కూడా ఉన్నారు. చంద్రబాబు ఇటువంటి ఎమ్మెల్యేలను కట్టడి చేయకపోతే మాత్రం.. వైసీపీకి పట్టిన గతి టిడిపికి పట్టడం ఖాయమని ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు. చూడాలి టిడిపి హై కమాండ్ ఎలా స్పందిస్తుందో..